Love vs Money: ప్రేమ.. డబ్బు.. @ 40
నలభై ఏళ్ల వయసులో ప్రేమలో పడినా లేదా రెండో పెళ్లి చేసుకున్నా ఆ అనుభూతే వేరు. అయితే ఒక వ్యక్తి, మరొక వ్యక్తితో కలిసి జీవించడానికి ప్రేమ ఎంత అవసరమో,తమ జీవితాన్ని ప్రభావితం చేసే ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆలుమగలిద్దరికీ ఒక జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు? చాలా కష్టాలను అధిగమించవచ్చు. అదేవిధంగా, ఈ పద్ధతిలో ఆర్థిక లావాదేవీలు జరపడం వల్ల భారం కూడా తగ్గుతుంది.
1. పిల్లలకయ్యే ఖర్చుపై చర్చించండి
మీకు అంతకు ముందే పిల్లలు ఉంటే, వారికి మీరు పెట్టే ఖర్చు గురించి మీ భాగస్వామికి తెలపండి. పిల్లల స్కూలు ఫీజులు నెల వారీ బడ్జెట్‌లో ప్లాన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు డబ్బును ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చిందో తెలుస్తుంది. మీ భాగస్వామికి కూడా ఇంటి ఖర్చుల గురించి అర్ధమవుతుంది.
2. రిటైర్ అయ్యాక ఎలా?
ఉద్యోగ బాధ్యతల తర్వాత జీవితం ఎలా సాగాలో ప్రణాళికలు వేసుకోండి. వ్యక్తిగతంగానైనా, జంటగానైనా పొదుపు చేసే డబ్బు చాలా అవసరాలను తీరుస్తుంది. వయసు పైబడిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలకైనా, ఇతర ఖర్చులకైనా ఆదా చేసిన డబ్బు మాత్రమే అక్కరకొస్తుంది.
3. శ్రద్ధ తీసుకోవాలి
జీవిత భాగస్వామితో చివరి వరకు ఉండేది మీరే. వయసు పెరిగేకొద్దీ వారిపై శ్రద్ధ కూడా పెరగాలి. మీరు చేసే మనీ సేవింగ్స్ మిమ్మల్నే కాదు, అనుకోని విపత్తులో వారిని కూడా రక్షించవచ్చు. అందుకే బీమా పాలసీలతో భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. పొదుపు లెక్కలతో జీవితపు లెక్కలను సులువుగా సమీక్షించుకోవచ్చు.
ఎవరైనా డబ్బు పొదుపు చేస్తున్నారంటే, వారికి జీవితం పట్ల మంచి అవగాహన ఉన్నట్లే. అయితే, పొదుపు చేయాలి కదా అని, మరీ పిసినారితనంగా ఉండటం భావ్యం కాదు. డబ్బు దాచుకోలేకపోయామనే బాధ భవిష్యత్తులో పడకుండా ఉండాలంటే.. మనీ మ్యాటర్స్‌లో జాగ్రత్తలు తీసుకుంటే సరి.