'శివ' నుండి 'బ్రహ్మాస్త్రం' వరకు.. నాగార్జున (Nagarjuna) ప్రతిభకు నిదర్శనం ఈ టాప్ 10 బాలీవుడ్ చిత్రాలు !
Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున .. టాలీవుడ్‌లో కింగ్, మన్మధుడు లాంటి పేర్లతో సుపరిచితుడయ్యారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా 'విక్రమ్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నాగార్జున (Nagarjuna).. ఆ తర్వాత అనతికాలంలోనే సూపర్ స్టార్ హోదాను కైవసం చేసుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా తెలుగు పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ఇదే క్రమంలో కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలలో కూడా అప్పుడప్పుడు నటిస్తూ.. ఆ ప్రాంత సినీ అభిమానులను కూడా ఆకట్టుకున్నారు.
'శివ ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన నాగార్జున (Nagarjuna).. తర్వాత హిందీలో అనేక చిత్రాలు చేశారు. ఇటీవలే ఆయన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర ' చిత్రంలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో నాగ్ నటనా ప్రతిభను సినీ లోకానికి చాటిన టాప్ 10 బాలీవుడ్ సినిమాల సమాహారాన్ని మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం
నాగ్ హిందీలో నటించిన చిత్రాలివే
శివ (Shiva) - 1990 లో తెలుగులో తాను తీసిన 'శివ' సినిమా హిట్ కాగానే, అదే సినిమాని హిందీలో కూడా రీమేక్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అమల ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. హిందీలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాలేజీలో జరిగే గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమా, అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్. ఇది నాగార్జున (Nagarjuna) నటించిన తొలి హిందీ సినిమా కూడా.
ఖుదాగవా (Khuda Gawah) - అమితాబ్ బచ్చన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించిన 1992 చిత్రం 'ఖుదాగవా'లో నాగార్జున (Nagarjuna) ఇన్స్‌పెక్టర్ రాజా మీర్జాగా పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. ముకుల్ ఎస్ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.
ద్రోహి (Drohi)- రామ్ గోపాల్‌వర్మ దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన 'అంతం' సినిమా హిందీ వెర్షనే 'ద్రోహి'. ఈ చిత్రంలో ఊర్మిళ మతోండ్కర్ కథానాయికగా నటించారు. ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) కాంట్రాక్ట్ కిల్లర్‌గా నటించారు.
నాగార్జున క్రిమినల్ హిందీలో పెద్ద హిట్
క్రిమినల్ (Criminal) - మహేష్ భట్ దర్శకత్వంలో 1994 లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'క్రిమినల్'. ఈ సినిమా తెలుగులో కూడా తెరకెక్కింది. అమెరికన్ సినిమా 'ప్యూజిటివ్' ప్రేరణతో తీసిన ఈ చిత్రంలో నాగ్ (Nagarjuna) పోషించిన పాత్ర పేరు డాక్టర్ అజయ్ కుమార్.
ఓ అవయవాల అక్రమ రవాణా మాఫియాని లోకానికి బహిర్గతం చేసే డాక్టర్ కథ ఈ 'క్రిమినల్'. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
మిస్టర్ బేచారా (Mr Bechara) - 1996 లో తమిళ చిత్రం 'వీట్ల విశేషంగ' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన 'మిస్టర్ బేచారా' సినిమాలో అనిల్ కపూర్ హీరోగా నటించారు. అలాగే, నాగార్జున సహాయ పాత్రలో నటించారు. శ్రీదేవి ఈ చిత్రంలో హీరోయిన్.
అంగారే (Angaarey) - 1998 లో మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, నాగార్జున, పూజా భట్ ప్రధాన తారాగణం. ఈ చిత్రంలో రాజా లోఖండే అనే రౌడీ పాత్రలో నాగ్ నటించారు.
జక్మ్ (Zakhm) - 1998 లో తెరకెక్కిన 'జక్మ్' చిత్రంలో హీరో అజయ్ దేవగన్ తండ్రిగా నాగార్జున నటించారు. చాలా కొద్ది సేపు మాత్రమే ఈ పాత్ర సినిమాలో కనిపిస్తుంది.
అగ్నివర్ష (Agni Varsha) - 2002 లో అర్జున సజ్నాని దర్శకత్వంలో తెరకెక్కిన 'అగ్ని వర్ష' చిత్రం గిరీష్ కర్నాడ్ నాటకం 'ది ఫైర్ అండ్ ది రెయిన్' ఆధారంగా రూపొందించబడిది. ఈ చిత్రంలో నాగార్జున యవక్రి అనే పురాణ పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని సాధించలేదు.
ఎల్ఓసీ కార్గిల్ (LOC Kargil) - 2003 లో జేపీ దత్తా దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎల్ఓసీ కార్గిల్' చిత్రంలో మేజర్ పద్మపాణి ఆచార్య పాత్రలో అక్కినేని నాగార్జున నటించారు.
బ్రహ్మాస్త్ర (Brahmastra) - 2022 లో రణ్‌బీర్ కపూర్ హీరోగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో అనీష్ అనే ఓ వైవిధ్యమైన పాత్రలో నాగ్ నటిస్తున్నారు. నంది అస్త్రాన్ని చేతబూనిన ధీరుడి పాత్రలో ఆయన కనువిందు చేయనున్నారు.
ఏదేమైనా, నాగార్జున వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్‌లో కూడా ఎప్పటికప్పుడు తన సత్తా చాటుతున్నారన్న విషయం వాస్తవం. అలాగే హిందీ చిత్ర పరిశ్రమతో కూడా ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సంజయ్ దత్ స్వయంగా నాగార్జున నటించిన 'చంద్రలేఖ' లో అతిథి పాత్ర పోషించారు. అలాగే నాగార్జున నటించిన అనేక తెలుగు సినిమాలు హిందీలో కూడా డబ్ అవుతూ, యూట్యూబ్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
Read More: Annamayya : 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అన్నమయ్య ఓ అద్భుతం