Relationship Goals : మీ బంధం బలహీనపడుతోందా?
1. మీ భాగస్వామితో తక్కువ సమయం గడుపుతున్నారు?
మీరు ఎంత బిజీగానైనా ఉండండి. కొంత సమయం మీ జీవిత భాగస్వామితో కూడా గడపండి. మీరు మీ భాగస్వామి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయనవసరం లేదు. ఫైవ్ స్టార్ హోటల్స్‌లో డిన్నర్లకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ ప్రియమైన వారికి కొంత సమయం కేటాయించండి చాలు. మీ మదిలో గూడు కట్టుకున్న ఆలోచనలను వారితో పంచుకోండి. మీరూ మీ భాగస్వామి మాటలను కాసేపు వినండి. మీరు జాబ్ పని మీద ఎక్కడికైనా వెళ్లినా సరే, సాయంత్రమైతే చాలు.. ఓ ఫోన్ కాల్‌తో పలకరించండి. అదీ కుదరకపోతే, ఓ చిన్న మెసేజ్ అయినా చేయండి.
2. మీరు ఇచ్చే సమయం విలువైనదా?
మీరు జంటగా జీవిస్తున్నా, కొన్ని కొన్ని సార్లు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మీరు నిజాయితీగా ఉండకపోతే, మీ భాగస్వామికి మీపై ఇష్టం తగ్గవచ్చు. మీరు మీ బంధాన్ని పూర్తిగా గౌరవించగలగాలి. అప్పుడు ఎలాంటి అపార్థాలకు తావుండదు. నిజాయితీతో ఉంటేనే, మీ బంధం ఎప్పుడూ మీకు భరోసానిస్తుంది.
3. సమస్యను పరిష్కరించుకోవడానికి ఇష్టపడటం లేదా?
మీకు మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యా? దానికి పరిష్కారాన్ని వెతకడం మీకు ఇష్టం లేదా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆలుమగలిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోకుంటే, ప్రేమ దానంతట అదే తగ్గిపోతుంది. మీరు మీ మధ్యనున్న మనస్పర్థలతో, ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుకోకూడదు. మీ బంధం నిలబడాలంటే, సాధ్యమైనంత వరకు అవతలి వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించండి. అందుకు తగ్గ సమయాన్ని మీరే కేటాయించండి.
మీ బంధంపై మీకు నమ్మకం ఉండాలి. మీ ఇద్దరి మధ్య అనుమానాలకు తావుండకూడదు. క్షమించే గుణం ఏ బంధానైనా బలపరుస్తుంది. చిన్న చిన్న త్యాగాలు, ప్రతీ బంధంలోనూ అవసరమేనని తెలుసుకుంటే... ఇక ఏ బంధమైనా భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుంది.