మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఇంద్ర’ సినిమాపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు.. అందుకే నటించలేదు

Updated on Jul 29, 2022 01:29 AM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఇంద్ర సినిమా రిలీజై 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పరుచూరి పలుకుల్లో కామెంట్లు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఇంద్ర సినిమా రిలీజై 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పరుచూరి పలుకుల్లో కామెంట్లు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇంద్ర’. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంద్ర సినిమా విడుదలై 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా, రచయిత పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పరుచూరి పలుకులు’ వేదికగా తన మదిలోని మాటలను బయటపెట్టారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

'ఇంద్ర సినిమాను తెరకెక్కించక పోయి ఉంటే, ఆ వైభవాన్ని అనుభవించే అవకాశాన్ని కోల్పోయేవాళ్లం. సినిమా రిలీజై రెండు దశాబ్దాలు గడిచినా, చిరంజీవి అభిమానులు, సినీ ప్రేమికుల గుండెల్లో ఆ సినిమా ఇప్పటికీ నిలిచిపోయింది. అయితే, ముందుగా ఈ కథతో సినిమా చేయడానికి దర్శకుడు బి.గోపాల్, నిర్మాత అశ్వనీదత్‌ అంగీకరించలేదు'

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఇంద్ర సినిమా రిలీజై 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పరుచూరి పలుకుల్లో ఆసక్తికర వ్యాఖ్యలు

చిరు చెప్పడంతోనే..

‘ఇంద్ర’ సినిమా ఘన విజయాన్ని అందుకోవడానికి కారణం చిన్ని కృష్ణ అందించిన కథ, కథనం. అలాగే పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌, బి.గోపాల్‌ దర్శకత్వ ప్రతిభ ఎంత కారణమో, చిరంజీవి నటన కూడా అంతే కారణం. ఇంత మంచి కథను ముందు బి.గోపాల్‌ వద్దన్నారు. దానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఆయన తెరకెక్కించిన గత చిత్రాలు ‘నరసింహ నాయుడు’, ‘సమర సింహారెడ్డి’ సినిమాల్లో హీరో క్యారెక్టర్‌‌ కొంచెం ఈ సినిమాలో ఉన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి, మళ్లీ అలాంటి పాత్రనే డిజైన్ చేస్తే, ఏమవుతుందోననే భయం వల్లే బి.గోపాల్ వద్దన్నారు. అంతే తప్ప.. కథ బాగాలేదని ఆయన ఎప్పుడూ అనలేదు'

'బి.గోపాల్‌, అశ్వనీదత్‌.. ‘ఇంద్ర’ సినిమా కథ పట్ల సుముఖంగా లేనప్పుడు.. చిరంజీవి (Chiranjeevi) మంచి కథ మిస్‌ అయిపోతున్నారని అనిపించింది. 'ఏం చేయాలా' అని అనుకున్నాను. ఆ సమయంలో ఒకసారి చిరంజీవికి ఫోన్‌ చేశాను. ‘కథ బాగా నచ్చింది. కాకపోతే గోపాల్‌, అశ్వనీదత్‌ సినిమా చేయడానికి భయపడుతున్నారు. ఏం చేయమంటారు’ అని అడిగాను. దానికి ఆయన ‘వాళ్లిద్దరూ (బి.గోపాల్, అశ్వనీదత్) లేకుండా, చిన్నికృష్ణను తీసుకొని రేపు నన్ను కలవండి. ఒకసారి కథ వింటాను’ అన్నారు చిరంజీవి.

తర్వాత రోజే చిరుని కలిసి కథ వినిపించాం. ఫస్టాఫ్‌ చెప్పిన వెంటనే, ఆయన కుర్చీలో నుంచి లేచి ప్రశాంతంగా కిళ్లీ వేసుకొని 'ఇక సెకండాఫ్‌ వినక్కర్లేదు. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుందని' చెప్పారు. ‘కథ విన్నాను. సినిమా హిట్‌ అవుతుంది. చేద్దాం' అని అశ్వనీదత్‌, గోపాల్‌కు కూడా చిరంజీవి చెప్పారు. అలా ఈ సినిమా మొదలైంది’

వాల్మీకి క్యారెక్టర్‌‌ అలా మిస్సయ్యా..

‘ఇంద్ర’లో తనికెళ్ల భరణి పోషించిన వాల్మీకి పాత్రను చిరు ముందు నన్నే చేయమన్నారు. ఆ సమయంలో కాలు నొప్పితో బాధపడుతున్నాను. ప్రయాణాలు చేసేందుకు వీలులేక, ఆ క్యారెక్టర్‌‌ను వదులుకున్నాను. నేను డైలాగ్‌లు చెబితే వినాలని ప్రేక్షకులు అనుకుంటారు. మూగవాడిగా ఉండిపోతే ఆ పాత్ర రక్తికట్టదని భావించి, అదే విషయాన్ని గోపాల్‌కు కూడా చెప్పాను

'కాశీలో చిరంజీవిని (Chiranjeevi) చూడగానే ప్రకాశ్‌రాజ్‌ నమస్కారం చేస్తారు. సినిమాలో ఆ సీన్‌ బాగా పండింది. దాన్ని తెరకెక్కించే సమయంలోనూ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదే సీన్‌ను తాను ‘సమరసింహారెడ్డి’లో చేశానని, మళ్లీ అదే చేస్తే ప్రేక్షకులు అంగీకరించరని గోపాల్‌ అన్నారు. కానీ, నేను దానికి ఒప్పుకోలేదు. కొన్ని సీన్స్‌, కాన్సెప్ట్స్‌ ఏ హీరో చేసినా చూస్తారు అని గట్టిగా నమ్మి.. ఆ సీన్‌ చేసేలా ఒప్పించాను' అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

Read More : మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi ) థ్యాంక్స్ చెబుతూ బాలీవుడ్‌ స్టార్ అమీర్‌‌ ఖాన్ ట్వీట్.. వైరల్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!