సక్సెస్ అయ్యాకే.. సొంత బ్యానర్‌లో సినిమా చేస్తా : పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కొడుకు ఆకాష్ !
డాషింగ్ డైరెక్టర్ కొడుకు.. అయితేనేం సొంత టాలెంట్‌తో హీరో కావాలనే తపన.. హీరోగా నిలదొక్కుకున్న తర్వాతే సొంత ప్రొడక్షన్ హౌస్‌లో సినిమా చేయాలన్న నిర్ణయం.. సినిమాలంటే ప్యాషన్‌తో చిన్నప్పటి నుంచే తనకంటూ సొంత మ్యానరిజంను ఏర్పాటు చేసుకున్నాడు.. అతనే పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్. ‘రొమాంటిక్’ సినిమాతో హిట్ అందుకున్న యంగ్ హీరో ఆకాష్.. చోర్ బజార్ సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. ఒక టీవీ షో ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆ కార్యక్రమంలో ఆకాష్ చెప్పిన విశేషాలు మీకోసం తన మాటల్లోనే..
‘చోర్ బజార్’ హీరోగా నాకు మూడో సినిమా. చాలా కష్టపడి నటించాను. డైరెక్టర్ జీవన్ వచ్చి కథ చెప్పినప్పుడు సినిమాలో నా క్యారెక్టర్ పేరు బచ్చన్ సాబ్ అని చెప్పాడు. ఎగ్జైటింగ్‌గా అనిపించింది. సినిమాలో బచ్చన్ సాబ్ అనే టాటూ ఉంటుంది. అమితాబ్‌బచ్చన్ పేరు పెట్టుకోవడంతో అందరూ సాబ్ అని పిలవాల్సిందే కదా.
మా నాన్న కూడా అమితాబ్ బచ్చన్ ఫ్యానే. అర్చన గారి పక్కన నటిస్తున్నాను అని చెప్పగానే అమ్మ నన్ను నిరీక్షణ సినిమా చూడమని చెప్పింది. ఆ సినిమాలో అర్చన గారి నటన చూసి మాటలు రాలేదు. మీ అమ్మకు నాకు పోలికలు ఉంటాయని అర్చన గారు పదేపదే అనేవారు. అర్చన గారు నేను ఒకేలా ఉంటామని చాలా మంది అన్నారని అమ్మ కూడా చెప్పింది.
మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే?
ఒక సినిమాలో నటించినందుకు గాను ప్రకాష్‌రాజ్ గారు రూ.లక్ష ఇచ్చారు. ఆ డబ్బులు ఏం చేయాలని నాన్నను అడిగాను. అమ్మకు, నానమ్మకు చెరో రూ.50 వేలు ఇవ్వమని చెప్పారు. ఇద్దరినీ కూర్చోబెట్టి అలాగే ఇచ్చేశాను. నేను పుట్టకముందే నాన్న ( పూరి జగన్నాథ్ ) డైరెక్టర్ అయ్యారు. దానికంటే ముందే రెండు సినిమాలు మొదలై ఆగిపోయాయి. నాన్న మొదటి సినిమా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’.
ప్రభాస్ ‘బుజ్జిగాడు’లో లవర్‌గా..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన ‘బుజ్జిగాడు’ సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ క్యారెక్టర్‌లో నటించాను. హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్‌లో చెల్లెలు పవిత్ర నటించింది. స్కూల్‌లో అందరూ నవ్వారు. అందుకే బుజ్జిగాడులో నటించనని నాన్నతో చెప్పాను. లవర్ క్యారెక్టర్‌కు పవిత్ర బాగోదని అన్నాను. ఇది యాక్టింగ్ చెయ్ అని నాన్న చెప్పారు. ముందు చిరుత, తర్వాత బుజ్జిగాడు సినిమాలో నటించాను.
రామ్ చరణ్ చిరుత షూటింగ్‌లో..
మదర్స్‌డే రోజు చిరుత సినిమా షూటింగ్‌కు అమ్మ కూడా వచ్చింది. ఆ సినిమాలో జైల్ సీన్‌లో గిన్నె పట్టుకుని వెళ్తుంటే లాగేయడం, అన్నం తినకుండా తీసేయడం చూసి అమ్మ తట్టుకోలేక ఏడ్చేసింది. ఆ సీన్ చూసి అశ్వనీదత్‌గారు కూడా హగ్ చేసుకుని మెచ్చుకున్నారు. సినిమా షూటింగ్ సమయంలోనే రాంచరణ్ అన్న తన హెయిర్ స్టైలిస్ట్‌తో రకరకాల స్టైల్స్ చేయించారు.
ప్రొడక్షన్ బాయ్‌గా పనిచేశా..
పదో తరగతితో చదువు ఆపేశాను. దానికే ఎంబీబీఎస్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇంక చదవనని నాన్నతో చెప్పాశాను. అసిస్టెంట్ డైరెక్టర్ లేక హీరో అవుతానని చెప్పా. అయిపోయింది. చదువు ఆపేశా. ఇక నేను చదవను అని నాన్నతో చెప్పాను. అసిస్టెంట్ డైరెక్టరో, హీరోనో అవుతా అని చెప్పా. ఇంట్లో ఖాళీగా ఉండేవాడిని. దాంతో నాన్న నాకు ఫోన్ చేసి పార్ట్ టైం జాబ్ చూశాను వెళ్లమని చెప్పారు. సరేనని చెప్పాను.
మేనేజర్ జిమ్‌కు తీసుకెళ్లి అక్కడ దింపారు. జిమ్‌లో అతను ఎందుకు పని చేయాలనుకుంటున్నావని అడిగాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్పా. బెంజి కారు, ఐ ఫోన్ వాడుతున్నానని జిమ్ యజమానికి అనుమానం వచ్చింది. పక్కనున్న వాళ్లు పూరి జగన్నాథ్ గారి అబ్బాయి అని చెప్పడంతో పనిలో పెట్టుకోలేదు. నాన్నకు ఫోన్ చేసి.. ‘నేను పని చేస్తానన్నా నన్ను చేయనీయడం లేదు’ అని చెప్పాను.
రెండ్రోజుల్లో మరో జాబ్ చూస్తాలే అని ఫోన్ పెట్టేశారు. తర్వాత రవితేజ నేనింతే సినిమాకు ప్రొడక్షన్ బాయ్‌గా చేయాలని అన్నారు. క్యారావ్యాన్‌లోకి కూడా రావొద్దని చెప్పారు. రవితేజకు టీ ఇవ్వడానికి వెళ్లా. ఏరా బాబూ నువ్వు టీలు ఇస్తున్నావేంటి అని కూర్చోబెట్టుకున్నారు. నాన్న పని చేసుకోమని పంపించారు. అమ్మ పెంపకం కావడంతో గర్వం తలకెక్కలేదు. ప్రొడక్షన్ బాయ్‌గా హ్యాపీగానే పనిచేశాను.
నిద్ర లేవగానే డైలాగులు చెప్పా..
ఒకరోజు ఉదయం నాన్న నిద్ర లేవగానే మంచం దగ్గరకు వెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఇంద్ర సినిమాతో పాటు చాలా సినిమాల డైలాగులు చెప్పాను. సైడ్ యాక్టర్‌గా చాన్స్ ఇవ్వాలని రెండు సంవత్సరాలు నాన్నను బాగా బతిమిలాడాను. నా బాధ భరించలేక ఆంధ్రావాలాలో క్యారెక్టర్ ఇచ్చారు. చాలా ఆనందపడ్డాను. సడెన్‌గా ఫోన్ చేసి క్యారెక్టర్ నువ్వు చేయడం లేదని చెప్పారు. తట్టుకోలేక బాగా ఏడ్చేశాను. నన్ను తొక్కేస్తున్నారని నాన్నతో బాగా గొడవపడ్డాను.
నిర్మాత కావాలని ప్లాన్..
పవిత్ర ఎంబీఏ వరకు చదివింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ లాంటివి ప్లాన్ చేస్తోంది. కొద్ది రోజుల్లో నిర్మాత కావాలనే ఆలోచనలోనూ ఉంది. ఇక, ఇంట్లో నాన్న ఫ్రెండ్‌లాగానే ఉంటారు. అయినా సరే ఆయనంటే నాకు చిన్నప్పటి నుంచి భయం. ఆరో తరగతి చదువుతున్నప్పుడే ఒక అమ్మాయి నచ్చింది లవ్ చేస్తున్నానని అమ్మతో చెప్పాను. తెలిసీతెలియని వయసులో అలా మాట్లాడేసరికి అమ్మ గంటసేపు క్లాస్ పీకింది.
నాన్న ఏం అనలేదు.. దాంతో కసిగా..
ఏడో తరగతి పరీక్షలు బాగానే రాశాను. 50 శాతం మార్కులు వస్తాయని అనుకున్నాను. రిజల్ట్స్ వచ్చిన రోజు వందకు ఏడు మార్కులు మాత్రమే వచ్చాయి. అమ్మ స్కూల్‌కి వచ్చి మాట్లాడింది. ఇంటికి వచ్చాకా నాన్నకు ఫోన్ చేసి చెప్పింది. ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాలేదా..? సరేలే అని అసలు తిట్టకుండానే ఫోన్ పెట్టేశారు నాన్న. దాంతో కసిగా మళ్లీ బాగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకున్నాను.
‘చోర్ బజార్’ కథలో..
‘చోర్ బజార్’ సినిమా కథలో ఏదో మ్యాజిక్ ఉంది. సినిమాలో ప్రతి సీన్ బాగుందే అనిపిస్తుంది. ముంబై హీరోయిన్ నటించింది. సుమారు 5 గంటలు కథ చెప్పారు డైరెక్టర్ జీవన్. అయినా బోర్ కొట్టలేదు. జార్జిరెడ్డి సినిమా చూసిన తర్వాత జీవన్‌రెడ్డిపై నమ్మకం కలిగింది. రాహుల్, విజయ్‌లతో బాగా క్లోజ్‌గా ఉంటాను. రోషన్‌ను ఎక్కువగా మీట్ అవుతాను. ప్రభాస్‌తో సరదాగా మాట్లాడుతూ ఉంటా.
ప్రేక్షకుడిగానే కథ వింటా..
ప్రేక్షకుడిగానే కథ వింటాను. థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే నచ్చుతుందా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తా. చెప్పిన కథను డైరెక్టర్ ఎలా తెరకెక్కిస్తారనేది చాలా ముఖ్యం. కథ, డైరెక్టర్‌నే నేను నమ్ముతాను. ఫస్ట్ లాక్‌డౌన్ తర్వాత నాన్న వచ్చే నెలలో నీతో సినిమా చేద్దామనుకుంటున్నానని చెప్పారు. వద్దు.. బయట అందరూ పూరీ కొడుకు అంటున్నారు. అది పోయాకా సినిమా చేస్తానని చెప్పాను. అప్పుడే చోర్ బజార్ కథ వచ్చింది. ముందు సొంతంగా సక్సెస్ అయ్యాకే నాన్నతో సినిమా చేస్తాను.
Read More: సినీ రంగంలో నిర్మాతగా కొత్త కెరీర్ ప్రారంభిస్తున్న.. పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర !