'లైగర్' (Liger) డిజాస్టర్ తో పునరాలోచనలో పడ్డ 'జనగణమన' (Janaganamana) నిర్మాతలు.. సినిమా కథ ముగిసినట్లేనా..?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి సినిమా "లైగర్". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలు వాటిల్లాయి.
దాదాపు 90కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ‘లైగర్’ (Liger) చిత్రం ఇప్పటివరకు 30కోట్ల మార్కును కూడా టచ్ చేయలేకపోయింది. ఈ సినిమా ఫలితం విజయ్, పూరీ జగన్నాధ్‌లను తీవ్రంగా నిరాశపరిచింది.
లైగర్ సినిమాలో పూరి మార్క్ ఎక్కడా కనిపించకపోవడం, హిందీలో షూట్ చేసి తెలుగులో డబ్బింగ్ చేసిన భావన ప్రేక్షకుల్లో కలగడం సినిమాకు పెద్ద మైనస్‌గా నిలిచాయి. విజయ్ పర్‌ఫార్మెన్స్ బాగున్నా.. నత్తి వల్ల తన క్యారెక్టరైజేషన్ దెబ్బతిందని.. ఇక, హీరోయిన్ అనన్యపాండే అటు నటిగా అలరించలేక, ఇటు అందంతో ఆకట్టుకోలేక నానా ఇబ్బందులు పడిందని పలువురు సినీ విమర్శకులు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. లైగర్ ప్రమోషన్లలోనే పూరి-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మరో సినిమా 'జనగణమన' (Janaganamana) ప్రకటన జరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి చివర్లోనే అధికారికంగా ప్రకటించి, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
దర్శకుడు పూరీకి (Puri Jagannadh) ఈ చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో అత్యంత భారీ బడ్జెట్‌తో గ్రాండ్ గా, స్టార్ కాస్ట్‌తో తెరకెక్కించాలని భావించాడు. ఇందులో భాగంగానే జూన్ మొదటి వారంలో షూటింగ్ మొదలు పెట్టి ఒక షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. ఫస్ట్ షెడ్యూల్ కోసం దాదాపు రూ.10కోట్ల వరకు ఖర్చయినట్లు సమాచారం. పూజా హెగ్డేను (Pooja Hegde) హీరోయిన్‌గా ఎంపిక చేసి తనపై కొన్నీ సీన్లను కూడా చిత్రీకరించారు.
కాగా లైగర్ ఫలితం చూశాక కంగుతిన్న 'జనగణమన' (Janaganamana) నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఈ సినిమాను ప్రస్తుతం పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. పూరి జగన్నాథ్.. విజయ్ తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ ను ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పూరి ప్రస్తుతం మరో కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి సారించనున్నారని, త్వరలో దానిపై అధికారిక ప్రకటన వెలువడనుందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.