'లైగర్' (Liger) డిజాస్టర్ తో పారితోషికంలో భారీ మొత్తం తిరిగిచ్చేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)..?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఆయన సినిమాలకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హిట్లు, ఫ్లాపుల సంగతి పక్కన పెడితే ఆయన రాసే డైలాగ్స్ కు, స్క్రీన్ ప్లేకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన మూవీ 'లైగర్' (Liger). భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది.
కాగా, 'లైగర్' మూవీని ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ (Charmee Kaur), బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. అత్యంత భారీ అంచనాల మధ్య పాన్ఇండియా మూవీగా ఆగస్టు 25న విడుదలైంది లైగర్ చిత్రం.
అయితే, విడుదలకు ముందు ప్రమోషన్స్ రూపంలో నానా హంగామా చేసింది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) టీమ్. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరిగినప్పటికీ విడుదల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. తొలి షో నుంచే సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ రికార్దులు బద్దలవుతాయనుకున్న సినిమా కాస్తా బొక్కబోర్లా పడింది.
దాదాపుగా రూ.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ (Liger Pre Release Business) చేసిన ఈ సినిమా కనీసం రూ.30 కోట్ల వసూళ్లను కూడా దక్కించుకోలేకపోయింది. విడుదలకు ముందు ఈ మూవీ రూ.200 కోట్లకుపైగా వసూలు చేస్తుందన్న చిత్ర యూనిట్ ఆశలన్నీ అడియాశలయ్యాయి.
ఇదిలా ఉంటే.. అన్ని భాషల్లోనూ 'లైగర్' (Liger Disaster) డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మూవీ నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ తన పారితోషికంతో పాటు లాభాల్లో వచ్చిన తన వాటాలో 70శాతం వెనక్కి ఇచ్చేశాడని సమాచారం. మరో వైపు విజయ్ దేవరకొండ కూడా నష్టాల్లో తన వంతు భాగస్వామ్యం అన్నట్లుగా కొంత మొత్తాన్ని తన పారితోషికం నుండి వెనక్కు ఇచ్చే విషయమై చర్చలు జరుపుతున్నాడట.
'లైగర్' చిత్రానికి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రూ.35 కోట్ల పారితోషికం అందుకున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించాయి. దీంతోపాటు నాన్ థియేట్రికల్ రైట్స్ లో విజయ్ కు సైతం వాటా ఉందని సమాచారం. ఇప్పుడు ఆ వాటాను వద్దని పూరీ, ఛార్మీలకు చెప్పడమే కాకుండా తన పారితోషికంలో రూ.6 కోట్లను వెనక్కి ఇచ్చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన విజయ్ ఫ్యాన్స్అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారట. నష్టాల్లో ఉన్న నిర్మాతలను ఆదుకున్న రియల్ హీరో అని కొనియాడుతున్నారట.