Prathyusha Garimella : టాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య .. షాక్‌లో ఇండస్ట్రీ !
Prathyusha Garimella: ప్రముఖ టాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల నుండి డిప్రెషన్‌లో ఉండడం వల్లే, ఆమె ఇలా బలవన్మరణానికి పాల్పడ్డారని తన సన్నిహితులు అంటున్నారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని తన బొటిక్ స్టూడియోలో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె దేహాన్ని శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, స్టూడియో వాష్‌రూంలో కనుగొన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ప్రత్యూష రాసిన సుసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తను కేవలం మానసికంగా ఆవేదన చెంది మాత్రమే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకి ఎవరూ కారణం కాదని ప్రత్యూష ఆ సూసైడ్ నోట్‌లో తెలిపారు. బహుశా ఆమె పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఫొరెన్సిక్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.
జూన్ 10 తేదిన ఇంటి నుండి బయటకు వెళ్లిన ప్రత్యూష, తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నట్లు తెలిపారు. కానీ మరుసటి రోజే ఆమె ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది.
శనివారం ఆమె బోటిక్ స్టూడియోకి వెళ్లిన వాచ్‌మన్, ఎంతసేపు తలుపు కొట్టినా ప్రత్యూష డోర్ ఓపెన్ చేయకపోవడంతో, ఆమె తండ్రికి సమాచారం ఇవ్వడం గమనార్హం. దీంతో ఆయనతో పాటు పలువురు కుటుంబ సభ్యులు స్టూడియోకి వచ్చి బలవంతంగా డోర్ తెరిచి, లోపలికి వెళ్లి చూడగా, ప్రత్యూష విగతజీవురాలై ఉండడంతో వారు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రత్యూష మృతి టాలీవుడ్ ప్రముఖులకు షాక్ కలిగించింది. మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన (Upasana) ప్రత్యూష మృతిపై ఎమోషనల్ అయ్యారు. తన స్నేహితురాలు లేకపోవడం బాధాకరం అంటూ ట్వీట్ చేశారు.
వైరల్ అవుతున్న ఉపాసన ట్వీట్
Prathyusha Garimella : ప్రత్యూష గరిమెళ్ళ టాలెంటెడ్ ఫ్యాషన్ డిజైనర్. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులకు, హీరోయిన్లకు డిజైనర్‌గా ఆమె వ్యవహరించారు. టాలీవుడ్‌కు చెందిన శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాదాస్, కాజల్, కీర్తి సురేశ్, కృతి కర్బందా, ఉపాసన, ప్రగ్యా జైస్వాల్, రానా, రామ్ చరణ్‌లకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఈమె రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు మంచి స్నేహితురాలు కూడా. ప్రత్యూష మరణించాక ఉపాసన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది.
రామ్ చరణ్ కు కాస్ట్యూమ్ డిజైనర్
టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌కు అనేక సినిమాలలో కాస్ట్యూమ్స్‌ను ప్రత్యూష (Prathyusha Garimella) డిజైన్ చేశారు. అలాగే బాలీవుడ్‌లో కూడా టాప్ హీరోయిన్లకు డిజైనర్‌గా వ్యవహరించారు. దీపికా పదుకొనె, పరిణితి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మాధురి దీక్షిత్, విద్యాబాలన్‌లకు ప్రత్యేక దుస్తులు డిజైన్ చేశారు. అయితే కొన్ని రోజుల నుంచి ప్రత్యూష డిప్రెషన్‌లో ఉన్నారు. ఆ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం.
మంచి ఫ్రెండ్‌ను కోల్పోయాను : ఉపాసన
డిజైనర్ ప్రత్యూష మరణ వార్త తెలిసిన ఉపాసన (Upasana) వెంటనే ఆమెకు నివాళులు అర్పించారు. ప్రత్యూష తనకు మంచి స్నేహితురాలని ఉపాసన తెలిపారు. ఈ లోకాన్ని విడిచి త్వరగా వెళ్లిపోయిన ప్రత్యూషకు తన నివాళి అంటూ పోస్ట్ చేశారు. తనకు ప్రతీ విషయంలో స్నేహితురాలిగా ఉండి, నైతికంగా మద్దతు ఇచ్చేవారన్నారు. ప్రత్యూష డిప్రెషన్‌కు గురవడం బాధాకరం అన్నారు. కొన్ని విషయాలు కర్మానుసారం జరుగుతుంటాయని తను ఎమోషనల్ అయ్యారు. ప్రత్యూష ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.
Read More: ఆదర్శప్రాయమైన జంట రామ్ చరణ్ & ఉపాసన .. వీరి విదేశీ టూర్ వెనుక మర్మం ఏమిటి ?