ఇండస్ట్రీ స్టామినాను పెంచిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టాప్ సినిమాలు.. మీకోసం ప్రత్యేకం
మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పవర్‌స్టార్‌గా కోట్ల మంది అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్నారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు పవన్. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారాయన. నటనలోనే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా పవన్‌కు ప్రావీణ్యం ఉంది.
తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, పంజా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో ఒక్కో పాట పాడి అభిమానులను అలరించారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ బిజీబిజీగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో టాప్ సినిమాలపై ఒక లుక్కేద్దాం..
సుస్వాగతం
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమైన పవన్‌కు కమర్షియల్ హిట్ వచ్చింది మాత్రం సుస్వాగతం సినిమాతోనే. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఆర్‌బీ చౌదరి నిర్మించారు. దేవయాని హీరోయిన్‌గా నటించారు. ఎస్‌ఏ రాజ్‌కుమార్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకమైంది. జనవరి 1వ తేదీ 1998లో రిలీజైన ఈ సినిమాలో రఘువరన్ పవన్ తండ్రిగా, ప్రకాష్‌రాజ్ హీరోయిన్ తండ్రి క్యారెక్టర్‌ర్లలో నటించి మెప్పించారు.
దేవయానిని ప్రేమించి విఫలమైన ప్రేమికుడిగా, రఘువరన్ మరణించిన సమయంలో కొడుకుగా, స్నేహితులతో ఎంజాయ్ చేసే యువకుడిగా పవన్ కల్యాణ్ నటన ప్రేక్షకులను మెప్పించింది.
తమ్ముడు
ఒకే ఏడాది రెండు హిట్ సినిమాలతో ఫామ్‌లోకి వచ్చిన పవన్.. తర్వాత ఏడాది మరో బంపర్ హిట్‌తో సినీ ప్రేక్షకులను అలరించారు. 1999 జూలై 15వ తేదీన విడుదలైన తమ్ముడు సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసింది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు సినిమాకు రమణ గోగుల సంగీతం సమకూర్చారు. శ్రీ వేంకటేశ్వరా ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రీతి జింగానియా, అచ్యుత్, అదితి గోవిత్రికర్, చంద్రమోహన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పలు సాహసాలు కూడా చేశారు.
కిక్ బాక్సింగ్‌లో నేషనల్ లెవెల్‌కు వెళ్లిన అన్నయ్య అచ్యుత్‌ను ప్రత్యర్ధులు యాక్సిడెంట్ చేసిన సందర్భంలో, కిక్ బాక్సింగ్ చేసి తండ్రికి మంచి పేరు తేవాలనుకునే సమయంలో కొడుకుగా, మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకునేప్పుడు పవన్ ఎక్స్‌ప్రెషన్స్ రియలిస్టిక్‌గా ఉంటాయి. ఇవన్నీ కలిసి పవన్ కల్యాణ్ కెరీర్‌లో తమ్ముడు సినిమా ఎప్పుడూ స్పెషల్ సినిమాగానే నిలుస్తుంది.
తొలిప్రేమ
కరుణాకరన్ దర్శకుడిగా పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్‌హిట్ సినిమా ‘తొలిప్రేమ’. కీర్తి రెడ్డి హీరోయిన్‌గా పరిచయమైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో ఎన్నో ప్రేమ కథా చిత్రాలకు మార్గదర్శిగా కూడా తొలిప్రేమ సినిమా నిలిచింది. పవన్ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన సినిమాగా కూడా తొలిప్రేమ నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, జనవరి 1న రిలీజైన సుస్వాగతం సినిమాతో హిట్ అందుకున్న పవన్.. అదే ఏడాది జూలై 24వ తేదీన తొలిప్రేమ సినిమాను రిలీజ్ చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్‌లు అందుకున్నారు. దేవా మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు క్లాసిక్స్‌గా నిలిచాయి.
కీర్తి రెడ్డిని ప్రేమించి తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడంలో, ఇంట్లో తండ్రికి భయపడే కొడుకుగా, తను ప్రేమించిన కీర్తి ఎక్కడ తనకు దూరమవుతుందోననే భయంలో పవన్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశారు.
బద్రి
హ్యాట్రిక్ హిట్లు సాధించి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన పవన్ కల్యాణ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో చేసిన సినిమా ‘బద్రి’. టి.త్రివిక్రమ రావు నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామలు అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్‌రాజ్ కీలకపాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాకు కూడా రమణ గోగుల సంగీతం అందించారు. 2000 ఏప్రిల్ 20వ తేదీన రిలీజైన బద్రి సినిమా కూడా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.
యాడ్ ఏజెన్సీ డైరెక్టర్‌గా స్టైలిష్ లుక్‌లో, అమీషా పటేల్‌తో ప్రేమలో ఉన్నప్పుడు, ప్రకాష్‌రాజ్‌తో గొడవ పడే సమయంలో, రేణు దేశాయ్‌తో పందెం వేసినప్పుడు, రేణు దేశాయ్‌కు కేన్సర్ అని తెలిసిన సమయంలో పవన్ కల్యాణ్ యాక్టింగ్, యాటిట్యూడ్, డైలాగ్ డిక్షన్ అన్నీ కొత్తగా ఉంటాయి.
ఖుషి
మూడు సంవత్సరాల్లో నాలుగు బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలతో జోరు మీదున్న పవన్ కల్యాణ్ కెరీర్‌ను మరింత పీక్‌కు తీసుకెళ్లిన సినిమా ‘ఖుషి’. ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్‌ను సెట్ చేసింది. భూమిక హీరోయిన్‌గా నటించిన ఖుషి సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. సూర్య ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలోని పాటలు క్లాసికల్ హిట్స్‌గా నిలిచాయి. 2001 ఏప్రిల్ 26వ తేదీన రిలీజైన ఖుషి సినిమా అప్పటి వరకు పవన్ కల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
అప్పటి వరకు పవన్‌ను మిడిల్ క్లాస్ స్టూడెంట్‌గా కెరీర్‌పై ఆసక్తి లేని స్టూడెంట్‌గా చూసిన అభిమానులు.. ఖుషి సినిమాలో స్టైలిస్ స్టూడెంట్‌గా చూసి ఫిదా అయ్యారు. ఫారిన్ వెళ్లి చదువుకోవాలని అనుకునే సమయంలో యాక్సిడెంట్ కావడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో లోకల్‌లోని కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ పరిచయమైన భూమికను ప్రేమించడం, ఫ్రెండ్ శివాజీ ప్రేమ కోసం రిస్క్ తీసుకునే వ్యక్తిగా పవన్ అద్భుతంగా నటించారు.
గబ్బర్ సింగ్
ఖుషి సినిమా హిట్ తర్వాత కెరీర్‌లో సరైన హిట్ లేక చాలా కాలం ఇబ్బంది పడిన పవన్ కల్యాణ్‌కు ‘గబ్బర్ సింగ్’ సినిమా మంచి కిక్ ఇచ్చింది. 2012, మే 11వ తేదీన రిలీజై సూపర్ డూపర్ హిట్ సాధించడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను కూడా బద్దలు కొట్టి కమర్షియల్ హిట్‌గా బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది గబ్బర్‌సింగ్ సినిమా. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పవన్ అభిమానులతో మాస్ డ్యాన్స్‌లు వేయించాయి. బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు.
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తూనే అందులో కామెడీ పండించే క్యారెక్టర్‌లో పవన్ కల్యాణ్ నటనకు అభిమానులు, సినీ ప్రేమికులు కూడా ఫిదా అయ్యారు. ముఖ్యంగా విలన్లతో పోలీస్ స్టేషన్‌లో అంత్యాక్షరి ఆడిస్తూనే ఇంటరాగేషన్ చేసే సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.
అత్తారింటికి దారేది
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా జల్సా తర్వాత తెరకెక్కిన సినిమా ‘అత్తారింటికి దారేది’. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, బొమన్ ఇరానీ, రావు రమేష్ కీలకపాత్రలు పోషించారు. 2013, సెప్టెంబర్ 27వ తేదీన రిలీజైన అత్తారింటికి దారేది సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలు శ్రోతలను విపరీతంగా అలరించాయి.
ప్రేమ పెళ్లి చేసుకున్న మేనత్తను ఇంటికి తీసుకొస్తానని తాతకు ఇచ్చిన మాట కోసం తపించే మనవడి క్యారెక్టర్‌లో పవన్ కల్యాణ్ నటనకు అభిమానులు ఖుషీ అయ్యారు. నదియా, పవన్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్, బ్రహ్మానందం కామెడీ, పాటలు, బిలియనీర్‌గా పవన్ యాటిట్యూడ్, స్టైల్, ఫైట్స్, డైలాగ్స్ సినిమాకు మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి.
వకీల్‌సాబ్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన సినిమా ‘వకీల్‌సాబ్’ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలకపాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన వకీల్‌సాబ్ సినిమాను శ్రీవేంకటేశ్వరా క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. 2021, ఏప్రిల్ 9వ తేదీన రిలీజైన వకీల్‌సాబ్ సినిమా సినీ ప్రేమికులతోపాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.
ఆడపిల్లలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే క్రమంలో లాయర్‌గా పవన్ కల్యాణ్ అద్భుతంగా నటించారు. మెట్రో ట్రైన్‌లో చిత్రీకరించిన ఫైట్, ఫ్లాష్ బ్యాక్‌లో పవన్, శృతీహాసన్ మధ్య జరిగే సీన్లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
భీమ్లానాయక్
పవన్ కల్యాణ్ హీరోగా దగ్గుబాటి రానా నెగెటివ్ రోల్‌లో నటించిన సినిమా భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2022, ఫిబ్రవరి 5వ తేదీన రిలీజైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన భీమ్లానాయక్ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,400 థియేటర్లలో రిలీజైన ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించారు. థమన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
రానా దగ్గుబాటి, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య జరిగే సీన్లు భీమ్లానాయక్ సినిమాకు మేజర్ హైలైట్లు కాగా.. నిత్యామీనన్ యాక్టింగ్ కూడా అభిమానులను అలరించింది. రానా యాటిట్యూడ్, సముద్రఖని నటన, పాటలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి.
Read More : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించిన ఆసక్తికర విషయాలు.. మీ కోసం ప్రత్యేకం