Punnaminagu : చిరంజీవి నటించిన "పున్నమినాగు" చిత్రం గురించిన టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలివే !
పున్నమినాగు (Punnaminagu) .. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం. అతనిలోని నటనా పటిమని సినీ లోకానికి తెలియజేసిన సినిమా. ఈ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) పాత్రకు కాస్త నెగటివ్ ఛాయలున్నప్పటికీ, ఆ పాత్రను రక్తి కట్టించడానికి ఆయన పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఈ రోజు మనం కూడా ఈ సినిమాకు సంబంధించి టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం
రీమేక్ చిత్రాల దర్శకుడు
తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజశేఖర్ ఈ "పున్నమినాగు" చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. వాస్తవానికి ఇది ఓ కన్నడ సినిమా రీమేక్. "హున్నిమేయ రాత్రియల్లి" పేరుతో కన్నడంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ ఎన్నో రికార్డులను తిరగరాసింది. అదే చిత్రాన్ని హిందీలో "జీనే కీ ఆర్జూ" పేరుతో మిథున్ చక్రవర్తి హీరోగా తెరకెక్కించారు.
కథను అందించింది ఫాంటసీ చిత్రాల దర్శకుడు
రామనారాయణన్ పేరు ఎప్పుడైనా విన్నారా? తెలుగులో నాగబాల, గౌరమ్మ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఫాంటసీ చిత్రాలకు ఈయన పెట్టింది పేరు. తమిళంలో ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఈయనే "పున్నమినాగు" చిత్రానికి కథను అందించారు.
నరసింహరాజు పాత్ర
"పున్నమినాగు" చిత్రంలో చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్ర అయినప్పటికీ, నరసింహరాజు కథానాయకుడి పాత్రలో నటించారు. నరసింహరాజు అప్పట్లో విఠలాచార్య చిత్రాలలో ఎక్కువగా నటించేవారు. జానపద చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. చాలా బిజీ ఆర్టిస్టుగా ఉండేవారు.
రతి అగ్నిహోత్రికి తొలి సినిమా
హిందీ నటి రతి అగ్నిహోత్రికి "పున్నమినాగు" (Punnami Nagu) తొలి తెలుగు సినిమా. ఆ సినిమాకి ముందే ఆమె "మరోచరిత్ర" హిందీ రీమేక్ "ఏక్ ధుజే కేలియా"లో కథానాయికగా నటించారు. "పున్నమినాగు" విడుదలయ్యాక రతి అగ్నిహోత్రికి తెలుగులో మంచి పేరు వచ్చింది. వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. దాదాపు ఓ 10 తెలుగు సినిమాలలో ఆమె నటించారు.
ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్‌లో
తమిళ నిర్మాణ సంస్థ అయినా, తెలుగులో కూడా సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఘనత ఏవీఎం సంస్థకే దక్కింది. 1980 లో చిరంజీవితో "పున్నమినాగు" చిత్రాన్ని నిర్మించిన ఏవీఎం సంస్థ, మళ్లీ 1984 లో మళ్లీ చిరుతో "నాగు" అనే సినిమాని నిర్మించింది.
విచిత్రమైన కథ
హారర్ ఫాంటసీ చిత్రాలలో "పున్నమినాగు" చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. చిన్నప్పటి నుండి ఓ బిడ్డకు విషాహారం అలవాటు చేయడం వల్ల, యుక్త వయసు వచ్చాక అదే బాలుడిలో పాము లక్షణాలు కనిపిస్తాయి. సర్ప లక్షణాలతో జీవనం సాగించే ఆ యువకుడు, ఎందరో అమ్మాయిల మరణానికి కారణం అవుతాడు. ఆఖరికి తన మీద జరిగిన ప్రయోగం గురించి తెలుసుకొని, అతను ఆత్మాహుతి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
చిరంజీవికి ఫిల్మ్ ఫేర్ నామినేషన్
"పున్నమినాగు" చిత్రం హిట్ అయ్యాక.. అందులో పాత్రకు గాను చిరంజీవి (Chiranjeevi) తొలిసారిగా ఫిల్మ్ ఫేర్ నామినేషన్ పొందారు. అలాగే తన నటనకు ఎందరో విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. నెగటివ్ రోల్ అయినప్పటికీ, ఓ కొత్త నటుడికి ఆ రోజులలో ఆ స్థాయి ప్రశంసలు లభించడం విశేషమే.
మ్యూజిక్ కూడా సూపర్ హిట్టే
అద్దిరబన్నా ముద్దుల గుమ్మా ముద్దుగా ఉన్నాది, పున్నమి రాత్రి పువ్వుల రాత్రి.. లాంటి సూపర్ హిట్ పాటలు ఈ చిత్రంలోనివే. ఈ సినిమా మ్యూజిక్ కూడా ఆ రోజులలో సూపర్ హిట్ అయ్యింది. చక్రవర్తి స్వరపరిచిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
2009 లో మళ్లీ "పున్నమినాగు" చిత్రం
చిరంజీవితో జేబుదొంగ, కొండవీటి దొంగ, త్రినేత్రుడు, పసివాడి ప్రాణం, రాక్షసుడు, విజేత లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి. ఆయన 2009 లో మళ్లీ "పున్నమినాగు" (Punnami Nagu) టైటిల్‌తోనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ కథానాయికగా నటించింది.
ప్రస్తుతం డిజిటల్ మాధ్యమంలో చూసే అవకాశం
"పున్నమినాగు" చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌తో పాటు యూట్యూబ్‌లో కూడా లభ్యమవుతోంది. ఆసక్తి కలిగిన వారు సినిమాను వీక్షించవచ్చు.
ఇవండీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన "పున్నమినాగు" సినిమాకి సంబంధించిన విశేషాలు
Read More: రాజకీయ కేళిలో నమ్మినవారికి అండగా నిలిచే "గాడ్ ఫాదర్ " !