God Father Movie Review : రాజకీయ కేళిలో నమ్మినవారికి అండగా నిలిచే "గాడ్ ఫాదర్ " !

Updated on Oct 06, 2022 03:22 PM IST
God Father  : 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని ఎడిటర్ మోహన్ కుమారుడైన దర్శకుడు మోహన్ రాజా  తెరకెక్కించారు. ఈ చిత్రం మలయాళ చిత్రం "లూసిఫర్" కు రీమేక్.
God Father : 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని ఎడిటర్ మోహన్ కుమారుడైన దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు. ఈ చిత్రం మలయాళ చిత్రం "లూసిఫర్" కు రీమేక్.

నటీనటులు : చిరంజీవి, నయనతార, సత్యదేవ్, సర్వదమన్ బెనర్జీ, మురళీ శర్మ, సునీల్, గెటప్ శ్రీను, సల్మాన్ ఖాన్, గంగవ్వ, షఫీ, దివి, కస్తూరి, 

నిర్మాణం : సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ 

సంగీతం : ఎస్ ఎస్ తమన్

దర్శకత్వం : మోహన్ రాజా 

రేటింగ్ : 3/5

కథ : పీకేఆర్ (సర్వదమన్ బెనర్జీ) ఓ నిస్వార్థ రాజకీయనాయకుడు. ఆదర్శ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రజలలో మంచి పేరు ఉంటుంది. అయితే పీకేఆర్ హఠాన్మరణంతో ఆయన పార్టీలో చీలికలు మొదలవుతాయి. 

ఈ క్రమంలో పీకేఆర్ అల్లుడు జయదేవ్ (సత్యదేవ్) పార్టీ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధమవుతూ, ఫండింగ్ కోసం ఓ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో చేతులు కలుపుతాడు. అయినప్పటికీ పీకేఆర్ కుమార్తె, జయదేవ్ సతీమణి అయిన సత్యప్రియ (నయనతార) తన భర్త మంచివాడనే నమ్ముతుంది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని జయదేవ్ మరిన్ని ఆగడాలకు పాల్పడతాడు.

ఈ క్రమంలో పార్టీతో పాటు తన చెల్లెలిని కూడా కాపాడడానికి రంగంలోకి దిగుతాడు బ్రహ్మ (చిరంజీవి). ఆయన ఓ అనాథ శరణాలయం నడుపుతూ ఉంటాడు. 

కొన్ని కారణాల వల్ల అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న బ్రహ్మ ఎందుకు సడెన్‌గా బయటకు వస్తాడు? అతడి జీవితంలోని అతి పెద్ద రహస్యం ఏమిటి?  అతను సమస్యల్లో ఉన్నప్పుడు ఎందుకు స్నేహితుడైన మసూమ్ ఖాన్ (సల్మాన్ ఖాన్) సహాయం తీసుకుంటాడు? 

దేశ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ రాజకీయాలలో కూడా ముఖ్య పాత్ర పోషించే బ్రహ్మ ఎందుకు ఓ మీడియా కంపెనీకి రూ.45 కోట్లు చెల్లిస్తాడు? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్ర పోషించిన పూరీ జగన్నాథ్ .. బ్రహ్మ గీసే మాస్టర్ ప్లాన్‌లో ఎలా భాగమవుతాడు? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఎవరెలా నటించారంటే..

మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ఈ సినిమాలో పాలిటిక్స్‌లో తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కింగ్ మేకర్ పాత్రలో చిరు ఒదిగిపోయారు. ఆయన హావభావాలు, డైలాగ్ డెలివరీ సినిమాకి  ప్లస్ అని చెప్పవచ్చు. అలాగే చిరంజీవి తండ్రి పీకేఆర్ పాత్రలో సర్వదమన్ బెనర్జీ, చెల్లెలి పాత్రలో నయనతార (Nayanthara) ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు. 

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సత్యదేవ్ గురించి. సాఫ్ట్ విలనిజాన్ని ఆయన బాగా పండించారు. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో పూరీ జగన్నాథ్, టీవీ రిపోర్టర్ పాత్రలో అనసూయ తమ పరిధి మేరకు బాగా నటించారు. 

బిగ్ బాస్ ఫేం దివి కూడా ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర పోషించారు. ఒక రకంగా కథకు చాలా కీలకం ఈ పాత్ర. సినిమాని మలుపు తిప్పే పాత్ర ఇది. అలాగే నటుడు సునీల్ ఈ చిత్రంలో కాస్త నెగటివ్ ఛాయలున్న పాత్రలో నటించారు. ఇక మురళీ శర్మ, గెటప్ శ్రీను, షఫీ, గంగవ్వ మొదలైనవారికి కూడా మంచి పాత్రలే లభించాయి. 

మలయాళ చిత్రం "లూసిఫర్"కు రీమేక్ అయిన ఈ సినిమాలో ఒరిజినల్‌తో పోల్చుకుంటే, చాలా మార్పులు ఉంటాయి. అయితే కథనాన్ని మాత్రం పక్కదోవ పట్టించలేదు. ఒరిజనల్ కథనాన్నే తీసుకున్నారు. ఇక సల్మాన్ ఖాన్ (Salman Khan) పాత్ర ఈ సినిమాకు అనవసరమేమో అనిపిస్తుంది. 

అయితే బాలీవుడ్ మార్కెట్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని సినిమాను నిర్మించారు కాబట్టి, సల్లూ భాయ్‌‌కు ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ ఇచ్చారు. అయితే ఆయన ఎంట్రీ కాస్త సినిమా కథా గమనానికి బ్రేక్ పడేలా చేస్తుంది. కానీ మాస్ ప్రేక్షకులకు ఆయన ఎంట్రీ కచ్చితంగా నచ్చుతుంది. ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి డ్యాన్స్ చేస్తుంటే, ఫ్యాన్స్ ఆనందానికి అంతేముంటుంది?

సాంకేతిక వర్గం గురించి

మోహన్ రాజా (Mohan Raja) ఈ "గాడ్ ఫాదర్" చిత్రాన్ని తనదైన స్టైల్‌లో భాగానే తెరకెక్కించారు. రీమేక్ చిత్రమైనా, మన నేటివిటికి తగ్గ విధంగానే కథను నడిపించారు. లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ కూడా సినిమాకి బలం చేకూర్చాయి. నీరవ్ షా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరో హైలెట్. అలాగే తమన్ అందించిన మ్యూజిక్ కూడా ఫరవాలేదు. అనంతశ్రీరామ్ రచించిన నజభజజజర సాంగ్ లిరిక్స్ కూడా బాగున్నాయి. 

ప్రతికూల అంశాలు 

"లూసిఫర్" సినిమాకి ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ.. హీరో ఎలివేషన్ సీన్లతోనే "గాడ్ ఫాదర్" (God Father) చివరి వరకూ సాగిందా? అని మనకు అనిపించకమానదు. సెకండాఫ్‌లో స్లో నేరేషన్ కూడా సినిమాకి కాస్త మైనస్ అయ్యింది. అలాగే సినిమా చివరిలో చిరు క్యారెక్టరైజేషన్‌కు సరైన జస్టిఫికేషన్ ఉండదు. బహుశా, దర్శకుడు "గాడ్ ఫాదర్" పార్ట్ 2 తీసే ఉద్దేశంలో ఉంటే, పై ప్రశ్నకు జవాబు దొరికే అవకాశం ఉంటుంది. 

ఫైనల్ వర్డ్ : మెగాస్టార్ చేసిన మరో రీమేక్ ప్రయత్నం ఈ "గాడ్ ఫాదర్"


 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!