Avatar : The Way of Water : "అవతార్ 2" సినిమా టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలు
హాలీవుడ్ సినిమా "అవతార్" ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను 2009 లో నిర్మించారు. ప్రస్తుతం అవతార్ సినిమాకు సీక్వెల్‌గా "అవతార్ - ద వే ఆఫ్ వాటర్" (Avatar : The Way of Water)ను జేమ్స్ కామెరాన్ తెరకెక్కించారు.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో పలు భాషల్లో డిసెంబర్ 16న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఓ విజువల్ వండర్ . తెలుగులో కూడా "అవతార్ - ద వే ఆఫ్ వాటర్" ట్రైలర్‌ను విడుదల చేశారు.
ప్రపంచ సినీ రంగంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా "అవతార్ - ద వే ఆఫ్ వాటర్" సినిమాపై టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం !
దర్శకుడు ఎవరంటే
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ "అవతార్ 2" (Avatar : The Way of Water) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2009 లో జేమ్స్ కామెరాన్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో "అవతార్" సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. అవతార్ సినిమాకు సీక్వెల్‌గా జేమ్స్ "అవతార్ - ద వే ఆఫ్ వాటర్" సినిమాను తెరకెక్కిస్తున్నారు.
కథ
పండోరా అనే జాతికి సంబంధించిన కథ. అవతార్ అనే భూమి మీద పండోరా జాతిని రక్షించేందుకు యుద్ధం జరిగితే.. ఈ సీక్వెల్‌లో నీటి అడుగున యుద్ధం జరగనుంది.
సముద్రంపై పండోరా జాతి ప్రయాణం, వారి జీవన విధానం, యుద్ధంలో వారి తెగువను దర్శకుడు జేమ్స్ కామెరాన్ అద్భుతంగా చిత్రీకరించారు. ట్రైలర్ చూస్తేనే ఒళ్లు గగ్గుర పొడిచే సన్నివేశాలు కనిపించాయి. ఇక సినిమాలో యాక్షన్ సీన్లు అదిరిపోనున్నాయి.
టెక్నాలజీ
త్రీడీలోనే కాకుండా 4కె, లైవ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ లాంటి అత్యాధునిక సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావడానికి దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీ పరంగా "అవతార్ 2" సినిమాను పలు వెర్షన్‌లలో విడుదల చేయనున్నారట. 'అవతార్ 2'ను కొత్త టెక్నాలజీతో ప్రదర్శించేలా తమ థియేటర్లను ఆధునికీకరిస్తామని థియేటర్ల యాజమానులు వెల్లడించారు.
నటీనటులు
సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సంగీతం
'అవతార్' సినిమాకు జేమ్స్ రాయ్ హార్నర్ సంగీతం అందించారు. జేమ్స్ మరణించడంతో 'అవతార్ 2' సినిమాకు అతని వద్ద సహాయకుడిగా పనిచేసిన సైమన్ ఫ్రాంగ్లెన్ సంగీతం సమకూర్చారు.
పలు భాషల్లో రిలీజ్
అవతార్ 2 చిత్రాన్ని ఇంగ్లీష్ భాషలో తెరకెక్కించారు. పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఇంగ్లీష్ భాషతో పాటు భారతీయ భాషలైన తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
బడ్జెట్ ఎంతంటే
'అవతార్ - ద వే ఆఫ్ వాటర్' సినిమాను 250 మిలియన్ డాలర్లతో తెరకెక్కించారు. నిర్మాతలుగా జేమ్స్ కామెరూన్, జాన్ లాండౌ వ్యవహరిస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే
'అవతార్ - ద వే ఆఫ్ వాటర్' చిత్రం విజువల్స్ వండర్‌గా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 16వ తేదీన రిలీజ్ కానుంది. '
ప్రపంచంలోనే ప్రత్యేకమైన సినిమా
'అవతార్' సినిమాను ప్రపంచంలోనే ఓ ప్రత్యేకమైన సినిమాగా జేమ్స్ కామెరూన్ నిర్మించారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అంత భారీ బడ్జెట్‌ను ఖర్చు చేసింది కూడా 'అవతార్' సినిమాకే. ఈ సినిమా మొత్తం ఐదు భాగాలుగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం రెండో పార్టు రిలీజ్ కానుంది.
తెలుగు రైట్స్ అన్ని కోట్లా ?
తెలుగు రైట్స్ కోసం స్టార్ డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారట. దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ సినిమా హక్కులను కలిసి కొనాలని ప్రయత్నిస్తున్నారట. దాదాపు రూ.100 కోట్లకు పైగా 'అవతార్ 2' తెలుగు హక్కులు అమ్ముడవుతాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన రోజే భారీ కలెక్షన్ ఉంటుందని అంచనా.