ప్రముఖ టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ నోయెల్ (Noel Sean) ఇంట విషాదం !
ప్రముఖ గాయకుడు, ర్యాప్ సింగర్, బిగ్‌బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ నోయెల్ సీన్ (Noel Sean) కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నోయెల్ తండ్రి శామ్యూల్ ఈ రోజు పలు అనారోగ్య కారణాల వల్ల తుదిశ్వాస విడిచారు. ఈ విషయం సోషల్ మీడియాలో పోస్టు అవ్వగానే, పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు నోయెల్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నోయెల్ (Noel) అనేక తెలుగు సినిమాలలో పాటలు పాడారు. జై సింహా, డిస్కో, పూలరంగడు, లవ్లీ, అహనాపెళ్లంట, మంత్ర, విక్రమార్కుడు మొదలైన చిత్రాలలో నోయెల్ పాటలు పాడారు. అలాగే అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకుడిగా కూడా నటించారు.
కుమారి 21 ఎఫ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, ప్రేమమ్ లాంటి సినిమాలలో నోయెల్ పాత్రలకు మంచి పేరొచ్చింది. ఇటీవలే విడుదలైన పంచతంత్ర కథలు సినిమాలో కూడా నోయెల్ నటించారు.
నోయెల్ (Noel) వివాహం నటి ఎస్తేర్‌తో 2019 లో జరిగింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట కొద్ది రోజులకే విడాకులు తీసుకుంది. నోయెల్‌కు తన తండ్రితో ఉండే అనుబంధం చాలా ఎక్కువ. తన తండ్రితో సరదాగా దిగిన ఫోటోలను నోయెల్ ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండేవారు.
నోయెల్ తండ్రి శ్యామూల్ మరణవార్త వినగానే, పలువురు సెలబ్రిటీలు ఆయన ఇంటికి తరలివెళ్లారు. రాహుల్ సిప్లిగంజ్, ఎంఎం కీరవాణి మొదలైనవారు శామ్యూల్‌కు నివాళులు అర్పించారు.
Read More: సినీ సంగీత ప్రపంచాన అద్భుత వాణి.. మరకతమణి కీరవాణి !