Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ 'రాక్ స్టార్' దేవిశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర విషయాలివే!
నేడు టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ పుట్టిన రోజు (Devi Sri Prasad Birthday). చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలో అడుగుపెట్టి ఎన్నో మధురమైన గీతాలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు దేవి శ్రీ ప్రసాద్. 19ఏళ్లకే తన సంగీతంతో శ్రోతలను అలరించడం ప్రారంభించిన దేవి... ఇప్పటి వరకు 100కు పైగా సినిమాలకు సంగీతాన్ని అందించాడు.
దేవి శ్రీ ప్రసాద్ కెరీర్ ప్రారంభించిన తొలి నాళ్లలో ‘కుర్రాడు.. వీడేం మ్యూజిక్ కొడతాడు?’ అంటూ హేళనలు ఎదుర్కొన్నాడు. కానీ.. ఆ తర్వాత 'దేవి' సినిమా (Devi Movie) పాటలు రిలీజ్ అయ్యాక.. ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. అప్పట్లో దేవీ గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది.
సంగీతానికి వయసు ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యం అని నిరూపించాడు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad). అయతే.. చాలామంది అనుకుంటున్నట్లుగా ఆ సినిమా టైటిల్ కారణంగా ఆయనకి ఆ పేరు రాలేదు. ఆయన అమ్మమ్మ, తాతయ్యల పేర్లను కలిపి ఆయనకు ‘దేవీశ్రీప్రసాద్’ గా చిన్నతనంలోనే నామకరణం చేశారు. ఆయన పూర్తి పేరు ‘గొర్తి దేవిశ్రీప్రసాద్’.
దేవి శ్రీ ప్రసాద్ 1979 ఆగస్టు 2న సత్యమూర్తి, శిరోమణి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి చూపిస్తుండటంతో మాండొలిన్ శ్రీనివాస్ (Mandolin Srinivas) దగ్గర మాండొలిన్ నేర్పించారు.
ఆ తర్వాత ఇండస్ట్రీలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) దగ్గర శిష్యరికం చేశారు. అయితే, ముందుగా దేవిలో టాలెంట్ ఉందని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి దర్శకుడు కోడి రామకృష్ణ. తన ‘దేవి’ సినిమాలో శ్రీ ప్రసాద్ కి సంగీత దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చారు.
అభిమానులందరూ ‘రాక్‌స్టార్’గా (Rockstar) పిలుచుకునే దేవీశ్రీ సంగీత దర్శకుడిగానే కాకుండా, గాయకునిగా కూడా అలరించారు. ఇప్పటివరకు 60పాటలు పాడారు. దాదాపు 20పాటలకు సాహిత్యమందించారు. ఇక, ఆయన కెరీర్ లో సంగీత దర్శకుడిగా చేసిన వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు (Bommarillu Movie) చిత్రాలకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. పవర్ స్టార్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకి నంది అవార్డు అందుకున్నారు.
దేవి శ్రీ ప్రసాద్.. తన కెరీర్ లో ఐదు సైమా అవార్డులు సైతం అందుకున్నాడు. ఇంకా తన కెరీర్‌లో ప్రేక్షకులతో విజిల్స్ వేయించి, సంవత్సరం మొత్తానికి ‘హిట్ ఆల్బమ్’లుగా నిలిచిన చిత్రాలెన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి. 2015వ సంవత్సరంలో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ (Kumari 21F) చిత్రంలో ‘బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్’ పాటకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఒక పాటకు ఆయనే సంగీతమందించి, ఆలపించి, నృత్యాన్ని సమకూర్చాడు. అంతే కాకుండా ఎనిమిది చిత్రాలలో అతిథి పాత్రలో కనిపించారు.
ఇక, ఐటమ్ సాంగ్ లకి దేవి స్పెషలిస్ట్. ‘ఆర్య2’ (Arya2 Item Song) లోని ‘రింగ రింగ’ పాటని అన్ని భాషల్లో రీమేక్ చేశారు. ఇంకా ఆ అంటే అమలాపురం, కెవ్వుకేక, డియ్యాలో డియ్యాలో విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఇటీవల దేశవ్యాప్తంగా వినిపించిన ‘ఊ అంటావా మామా’ పాట దేవీశ్రీ స్వరపరిచిందే. ఇక ఇన్ని సినిమాల్లో వందల పాటల్లో దేవికి ‘నాన్నకు ప్రేమతో’ పాట అంటే చాలా ప్రత్యేకం. తన తండ్రి పై ఉన్న ప్రేమతో 'నాన్నకు ప్రేమతో..' పాటను రాసి తానే స్వయంగా పాడారు.
తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అగ్ర హీరోలందరికీ మ్యూజిక్ అందించిన రికార్డు దేవిశ్రీకి ఉంది. ఇంకా వారి వారసుల సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్ అందించడం విశేషం. ఇలా రెండు తరాలకు సంగీతం అందించిన అతి కొద్దిమంది తెలుగు సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. తాజాగా ‘పుష్ప’ సినిమాతో దేశ, విదేశాల్లో తన మ్యూజిక్ మ్యాజిక్‌ను మరోసారి రుచి చూపించాడు. ఇటీవల ‘ది వారియర్’ (The Warrior) సినిమాలోని బుల్లెట్ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
Read More: చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలతో తలపడనున్న మంచు విష్ణు 'జిన్నా'(Ginna)