Chinmayi Sripada: చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ జంటకు ఆనందాల పంట.. పండంటి కవలలకు జన్మనిచ్చిన మేటి గాయని !
ప్రముఖ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi) గత రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘‘ద్రిప్త మరియు శర్వస్... మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చి, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు’’ అంటూ తన చిన్నారుల చేతులను ప్రేమతో ఒడిసిపట్టుకున్న ఫోటోలను ఆయన షేర్ చేస్తూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారగా, సెలబ్రిటీలు, నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు.
కాగా.. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran), చిన్మయిల వివాహం జరిగి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. మొత్తానికి ఈ రోజు వారింట్లో సంబరాలు అంబరాన్నంటాయి. పుట్టగానే ఈ దంపతులు తమ పిల్లల పేర్లు కూడా చెప్పేశారు. కవలల్లో బాబు, పాప ఉన్నారు.
అయితే సింగర్ చిన్మయి తన ప్రెగ్నెన్సీ విషయాన్ని, ఇంత వరకు ఎక్కడా కూడా ప్రకటించలేదు. బిడ్డలు పుట్టాకే, ఆ విషయాన్ని బహిర్గతం చేయడంతో ఆందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. మామూలుగా అయితే సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను ముందుగానే తమ అభిమానులతో షేర్ చేసుకుంటారు.
దీనిపై చిన్మయి బదులిస్తూ "అందరూ నాకు పర్సనల్‌గా మెసేజ్‌లు పెడుతున్నారు. కానీ ఇన్‌స్టా నా మీద బ్యాన్ ఇంకా ఎత్తేయలేదు.. అందుకే అందరికీ రిప్లైలు ఇవ్వలేకపోతున్నా. క్షమించండి" అంటూ చిన్మయి తన సన్నిహితులకు, స్నేహితులకు మెసేజ్ ఇచ్చారు. "సరోగసి ద్వారా బిడ్డను కన్నావా?" అని కొందరు అడుగుతున్నారు. ఎందుకంటే నేను తల్లిని అయినట్టు ప్రకటించలేదు. బేబీ బంప్ పిక్స్ (Chinamayi Baby Bump) కూడా పెట్టలేదు.ఎందుకంటే నేను నా వ్యక్తిగత జీవితాన్ని పర్సనల్‌గానే ఉంచాలని భావించాను. నా ప్రెగ్నెన్సీ గురించి, నాకు దగ్గరగా ఉన్న సన్నిహితులకు మాత్రమే తెలుసు. మీరు ఎక్కువగా ఆలోచించకండి.. నా బిడ్డల గురించి ప్రార్థించండి.. వారి ఫోటోలను దాదాపుగా పెట్టను. వారి ఫోటోలను సోషల్ మీడియాలో ఈ మధ్య షేర్ చేయను అంటూ" చిన్మయి చెప్పుకొచ్చింది.
కాగా మే 5, 2014న చెన్నైలో హిందూ సంప్రదాయ ప్రకారం చిన్మయి, రాహుల్‌ల వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. ఇండస్ట్రీలో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి పేరు పొందగా, నటుడిగా, దర్శకుడిగా రాహుల్ స్ధిరపడ్డాడు. నటి సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించిన చిన్మయి తెలుగులో పలు పాటలు పాడారు. బాయ్స్, శివాజీ, ఆరెంజ్ (Orange Movie), ఏమాయ చేశావె, ఊసరవెల్లి, రంగం, ఎందుకంటే ప్రేమంట, గోవిందుడు అందరి వాడేలే నుంచి ఇటీవల విడుదలైన "మేజర్" వరకు ఎన్నో సినిమాల్లో ఆమె పాటలు పాడారు.
ఇక చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) హీరోగా, సహాయనటుడిగా ఎన్నో మంచి పాత్రలు చేశారు. "శ్యామ్‌సింగరాయ్" సినిమాలో ఆయన పోషించిన రాహుల్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలే దక్కాయి. ‘చి..ల..సౌ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు.