Natural Star Nani: భాషలు వేరైనా జాతి ఒకటే.. పాన్ ఇండియా అనేది 'స్టుపిడ్' : నాని
Natural Star Nani: నాచురల్ స్టార్ నాని ఇటీవల 'అంటే సుందరానికి..' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలయిన ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హిరోయిన్‌గా నటించింది.
అంతకుముందు.. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాని మాట్లాడుతూ 'సినిమాను బ్లాక్ బస్టర్ సినిమా చేసాము. ఈ సినిమాని ఎక్కడికి తీసుకెళతారో మీ ఇష్టం.'. అంటూ సినిమా గురించి ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు.
ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటించిన నాని, తన సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇలాంటి ఓ మీడియా సమావేశంలోనే నానికి పాన్ ఇండియా (Pan India Movies) సినిమాల గురించి ఓ ప్రశ్న ఎదురయింది.
సంచలనమైన నాచురల్ స్టార్ నాని మాటలు
ఇప్పటికే జాతీయ భాష హిందీ అనే విషయం గురించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న సమయంలో. నాని పాన్ ఇండియా సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పుష్ప, కేజీఎఫ్ సినిమాలు బాగా ఆడాయి : నాని
నాని మాట్లాడుతూ.. సినిమాలను భాషాలకు అతీతంగా ఎంజాయ్ చేయాలని అన్నాడు. హిందీ మాట్లాడే ప్రాంతాల్లో సైతం ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 (KGF2) వంటి సినిమాలు బాగా ఆడాయని అతడు ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ 38 ఏళ్ల నటుడు ఈ మధ్య కాలంలో తన ‘జెర్సీ’ సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. సినిమా రంగాన్ని బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ అని విభజించుకోవడం 'స్టుపిడ్' అని అభిప్రాయపడ్డాడు.
ఆయన ఇచ్చిన ఇంటర్వూలో మన భాషలు వేరైనా జాతి ఒకటే అన్నాడు. "ఈ విభజన మూర్ఖత్వం. ఇప్పుడు ఏం జరిగినా సినిమా గెలుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ (Tollywood), కోలీవుడ్ - ఇవి హాలీవుడ్ నుండి అరువు తెచ్చుకున్న పేర్లలా ఉన్నాయి. మనల్ని మనం వేర్వేరు పరిశ్రమలు అని ఎందుకు పిలుస్తామో నాకు అర్థం కాలేదు. భాషలు వేరుగా ఉండవచ్చు. కానీ మనది ఒకే దేశం." అని పేర్కొన్నాడు.
పాన్ ఇండియా సినిమా అంటే కథను ప్లాన్ చేసి, సినిమాని తెరకెక్కించి పాన్ ఇండియా అంటే సరిపోదు. మనం చేసిన సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరించినప్పుడే.. అది పాన్ ఇండియా సినిమా అవుతుంది అంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉదాహరణకు సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలోనూ అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎక్కడో చిత్తూరులో పెరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
కథ నచ్చితే ఏ భాషా చిత్రం అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు అంటూ ఈ సందర్భంగా నాని పాన్ ఇండియా సినిమాల గురించి వెల్లడించారు. కాగా, నాని తన తదుపరి చిత్రంగా శ్రీకాంత్ ఓధేల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇప్పటికే 30 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది.
Read More: Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ ఎపిసోడ్ లో మెరిసిన రానా, సాయి పల్లవి!