Dulquer Salman: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్‌లో దుల్కర్ సల్మాన్.. ఈ వార్తల్లో నిజమెంత?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) కి టాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. దేశంలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో ఒకరైన దుల్కర్ సల్మాన్ తెలుగు వారికి కూడా 'మహానటి' సినిమాతో చాలా ఫేవరెట్‌గా మారిపోయాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 'సీతారామం' అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది.
అయితే.. 'సీతారామం' (Sitaramam Promotions) ప్రమోషన్స్‌లో భాగంగా ఆంధ్రలోని కొన్ని ప్రాంతాలకు దుల్కర్ వెళ్లినప్పుడు , భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విశాఖపట్నంలో దుల్కర్ సినిమా ప్రమోషన్ల కోసం కొన్ని షాపింగ్ మాల్స్‌కి వెళ్ళినప్పుడు, అక్కడికి ఆయన అభిమానులు ఊహించని స్థాయిలో హాజరయ్యారు. ఆ రెస్పాన్స్ చూసిన దుల్కర్ సల్మాన్ ఆశ్చర్యపోయాడు. 'నిజంగా ఆ స్థాయిలో జనాల నుంచి తనకు మద్దతు లభిస్తుందని ఊహించలేదు' అని అన్నాడు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయోపిక్ సినిమాలకు సంబంధించి దుల్కర్‌కి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో 'మీ నాన్నగారు వైఎస్సార్ బయోపిక్‌లో నటించారు. మీకు వైఎస్ జగన్ బయోపిక్‌లో (Ys Jagan Biopic) హీరోగా ఛాన్స్ వస్తే నటిస్తారా..?' అనే ప్రశ్న ఎదురైంది.
దీనికి దుల్కర్ సమాధానం ఇస్తూ 'ఏ వయసు నుండి ఏ వయసు వరకు నటించాలి. స్క్రిప్ట్ జనాలకుఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనే విషయంలో క్లారిటీ రావాలి. అప్పుడు వీలుంటే నటిస్తాను. పైగా ఇక్కడి రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. కాబట్టి ఎవరైనా దర్శకుడు నన్ను సంప్రదిస్తారేమో చూడాలి' అని చెప్పుకొచ్చారు.
కాగా, ఇదివరకే దుల్కర్ తండ్రి మమ్ముట్టి (Mammootty), వైఎస్ జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర'లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే వచ్చాయి. అయితే ఆ సినిమాకు కొనసాగింపుగా అనగా సీక్వెల్ రూపంలో జగన్ బయోపిక్ రాబోతున్నట్లు అప్పట్లో చాలా రకాల కథనాలు వచ్చాయి. అయితే, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
Read More: 'సీతారామం' (Sitaramam) చాలా ఒరిజినల్ కథ... క్లాసిక్ మూవీ.. దుల్కర్ సల్మాన్ కీలక వ్యాఖ్యలు!