Gopichand Birthday Special (హీరో గోపీచంద్ జన్మదినం) : తండ్రి విప్లవ చిత్రాల దర్శకుడు.. కొడుకు కమర్షియల్ హీరో !
టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు గోపీచంద్ (Gopichand). ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కుమారుడైన గోపిచంద్, సినిమాలలోకి రాకముందు విదేశాలలో చదువుకున్నారు. టి. కృష్ణ ఇండస్ట్రీలో విప్లవ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో అవార్డు విన్నింగ్ సినిమాలు తీశారు. ఆయన బాటలోనే కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయమైన గోపిచంద్, మంచి కమర్షియల్ హీరోగా ఎదిగారు.
నిజం, జయం, వర్షం.. లాంటి సినిమాలతో విలన్‌గా కెరీర్ ప్రారంభించిన గోపీచంద్.. ఆ తర్వాత హీరోగానూ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు, మరోసారి తన యాక్టింగ్ పవర్ ఏంటో చూపించేందుకు గోపీచంద్ 'పక్కా కమర్షియల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆరడుగుల బుల్లెట్‌లా అదరగొట్టే సినిమాలు చేస్తున్న గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం
గోపీచంద్ తండ్రి బడా డైరెక్టర్
గోపీచంద్ 1979 జూన్ 12న జన్మించారు. ప్రకాశం జిల్లాలోని కాకతూరివారి పాలెం సొంతూరు. గోపీచంద్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్సోయారు. ఆ తర్వాత చదువుల కోసం రష్యా వెళ్లారు. తన తండ్రికి సినిమాలపై ఉన్న ఇష్టం గోపీచంద్‌కు బాగా తెలుసు. అందుకు సాక్ష్యం టి. కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాలే. గోపీచంద్ మొదటిసారిగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో 'తొలివలపు' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ మేనకోడలు 'రేష్మ'ను గోపీచంద్ పెళ్లి చేసుకున్నారు. గోపీచంద్, రేష్మలకు ఇద్దరు కుమారులు.
విలన్ ఎలా అయ్యారు ?
హీరోగా తొలి సినిమాకే గోపీచంద్ మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ వరుస ఆఫర్లు మాత్రం రాలేదు. గోపీచంద్ కటౌట్ చూసిన కొందరు దర్శకులు విలన్ పాత్ర చేస్తారా? అని అడిగారు. ఆయన నటనపై ఉన్న ప్రేమతో ఓకే చెప్పారు. 'జయం' సినిమాలో విలన్ పాత్ర పోషించి అదుర్స్ అనిపించుకున్నారు. నిజం, వర్షం సినిమాల్లో గోపీచంద్ నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుందంటే.. అందుకు గోపీచంద్‌కు నటనపై ఉన్న ప్రేమే కారణం.
'జయం'లో విలన్‌గా మెప్పించిన గోపిచంద్.. బెస్ట్ విలన్ కేటగిరిలో ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 'యజ్ఞం' సినిమాతో హీరోగా తన తొలి సక్సెస్ సాధించారు. 'ఆంధ్రుడు'తో తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకున్నారు. అలాగే 'రణం' కూడా ఆయన కెరీర్ గ్రాఫ్‌ను పెంచి, సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. 'ఒక్కడున్నాడు'లో గోపీచంద్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక 'లక్ష్యం' సినిమా అనేది గోపీచంద్ చేసిన తొలి మల్టీ స్టారర్. అలాగే 'లౌక్యం'తో కమర్షియల్ హిట్ సాధించారు.
ఫ్లాప్‌లతో కుంగిపోని హీరో గోపీచంద్
ఒంటరి, శంఖం సినిమాలు గోపీచంద్ కెెరీర్‌లో ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి. కానీ సినిమాపై తన ఇష్టాన్ని మాత్రం గోపీచంద్ వదులుకోలేదు. 'గోలీమార్'తో ప్రేక్షకులకు వినోదం పంచారు. యాక్షన్ సినిమాలలో తనకు తిరుగులేదని అనిపించుకున్నారు. 'వాంటెడ్' లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఆ తర్వాత మొగుడు, సాహసం సినిమాలతో కొత్త ప్రయోగాలు కూడా చేశారు గోపీచంద్. కానీ ఈ సినిమాలు గోపీచంద్‌కు సరైన హిట్ ఇవ్వలేదు. పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రాలుగా తెరకెక్కిన జిల్, సౌఖ్యం, గౌతమ్ నందా, ఆక్సిజన్ సినిమాలు కూడా ఫ్లాపులుగానే మిగిలాయి.
మారుతి దర్శకత్వంలో కొత్త సినిమా
ఇక 'సీటిమార్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు గోపీచంద్ (Gopichand). ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' సినిమాలో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల లేటయింది. మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' జూలై 1న విడుదల కానుంది.
Read More: Gopichand: గోపిచంద్ 'పక్కా కమర్షియల్' పక్కా హిట్ సాధిస్తుందన్న చిత్ర యూనిట్