నాకు నయం కాకపోతే మనుషులను తింటూనే ఉంటా.. ఆసక్తికరంగా వరుణ్ ధావన్ (Varun Dhawan) ‘భేడియా’ (Bhediya) ట్రైలర్
సినిమా బాగుంటే చాలు అది ఏ భాషా చిత్రమనేది చూడకుండా ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులకు మంచి పేరు ఉంది. ఇటీవలే తెలుగులో విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’కు వస్తున్న భారీ వసూళ్లే దీనికి నిదర్శనం. తెలుగు నాట రిలీజైన తొలి రోజే ‘కాంతార’ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక్కడి ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకం ఉంది కాబట్టే పరభాషల నుంచి ఎన్నో సినిమాలు తెలుగులోకి డబ్ అవుతుంటాయి. ముఖ్యంగా తమిళంలోని దాదాపు అన్ని పెద్ద సినిమాలు, మంచి టాక్ తెచ్చుకున్న చిన్న చిత్రాలు ఇక్కడ అనువాదమై రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు మన మార్కెట్‌పై హిందీ హీరోలు కూడా కన్నేశారు.
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వరుణ్
టాలీవుడ్‌లో మార్కెట్ పెంచుకోవాలని హిందీ హీరోలు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు హిందీలో మాత్రమే విడుదలయ్యే వారి సినిమాలు.. ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల తెలుగులో వచ్చిన రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్రం’ మంచి వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమా త్రీడీ వెర్షన్ చూసేందుకు తెలుగు ఆడియెన్స్ మంచి ఆసక్తి కనబర్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. యంగ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) తన ‘భేడియా’ (Bhediya) చిత్రాన్ని ‘తోడేలు’గా టాలీవుడ్‌లో రిలీజ్ చేస్తున్నారు.
ఆసక్తిని పెంచుతున్న సంభాషణలు
‘భేడియా’ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే అంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. తోడేలుగా మారిన వ్యక్తిగా వరుణ్ ధావన్ నటన ఆకట్టుకునేలా ఉంది. పగలు సాధారణమైన యువకుడిగా కనిపిస్తూ.. రాత్రి వేళల్లో తోడేలుగా మారి, ఇతరులపై దాడి చేయడం వంటి సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ‘నాకు నయం కాకపోతే నేను మనుషులను తింటూనే ఉంటా’ అని వరుణ్ చెప్పే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
‘భేడియా’ మూవీకి అమర్ కౌశిక్ దర్వకత్వం వహించారు. సర్‌ప్రైజింగ్ హారర్ కామెడీ అంశాలతో ఆయన ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జోనర్ మూవీగా దీన్ని చెబుతున్నారు. ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ వ్యవహరిస్తున్నారు.