Boycott Pathan: షారుఖ్ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ ట్రోలింగ్.. దీపిక (Deepika Padukone) పైనా నెటిజన్స్ ట్రోల్స్
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. వరుసగా పరాజయాలు పలకరించడంతో కొన్నాళ్లు సినిమాలకు షారుఖ్ దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడాయన స్పీడు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో తన అభిమానులను పలకరించేందుకు కింగ్ ఖాన్ రెడీ అవుతున్నారు. ‘పఠాన్’, ‘జవాన్’, ‘డుంకీ’ సినిమాలను ఆయన లైన్‌లో పెట్టారు.
‘జవాన్’ చిత్రాన్ని కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ‘డుంకీ’ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా చిత్రీకరణ కూడా వేగంగా జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజూ’ లాంటి చిత్రాలను రూపొందించింది హిరానీ అనేది తెలిసిందే.
‘జవాన్’, ‘డుంకీ’ సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు ఇంకా టైమ్ ఉంది. అయితే ‘పఠాన్’తో త్వరలో ఆడియెన్స్‌ను అలరించనున్నారు షారుఖ్. ఈ మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇటీవలే రిలీజైన ‘పఠాన్’ (Pathan Movie) టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఆ చిత్రం నుంచి బేషరమ్ రంగ్ సాంగ్ విడుదలైంది. ఈ పాట కూడా ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో దీపిక (Deepika Padukone)–షారుఖ్ మధ్య రొమాన్స్ కాస్త శ్రుతి మించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
బేషరమ్ రంగ్ (Besharam Rang) పాటలో దీపిక బికినీలో కనిపించడం, షారుఖ్‌తో ఆమె కెమిస్ట్రీ సీన్స్ ఎబ్బెట్టుగా ఉండటంతో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మహిళలు తమకు నచ్చినవి ధరించొచ్చు.. కానీ సినిమా కోసం ఇలాంటి డ్రెస్సింగ్ అవసరమా’ అంటూ దీపికను ఉద్దేశించి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మన సంస్కృతి ఏంటో తెలుసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. ‘ఇండియాలో ఈ సినిమాను బ్యాన్ చేయాల్సిందే’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో బాయ్‌కాట్ పఠాన్ (Boycott Pathan) అనే ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతోంది. మరి, జనవరి 25న థియేటర్లలోకి వస్తున్న ‘పఠాన్’ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.