'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాకు ఆస్కార్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు
RRR: 'రౌద్రం, రణం, రుధిరం' సినిమా ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఓ అద్భుతం అంటూ హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం మెచ్చుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ రేంజ్ సినిమా అంటూ ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు. పలువురు సినీ ప్రముఖలతో పాటు ప్రేక్షకులు కూడా 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించాలని కోరుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో #RRRForOscars అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
టాలీవుడ్ నటులు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించడమే ఓ గొప్ప విషయం. అల్లూరి సీతారామరాజును పోలిన పాత్రలో రామ్ చరణ్, కొమురం భీముడిని పోలిన పాత్రలో ఎన్టీఆర్ తమ తమ పాత్రలలో జీవించారు.
అలియా భట్, శ్రియా, అజయ్ దేవగణ్ కూడా ఆర్ఆర్ఆర్‌లో కీలక పాత్రలు పోషించారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1200 కోట్లను వసూలు చేసింది. ఇండియన్ సినిమాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
- 'టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్'లో రాజమౌళి (SS Rajamouli) పాల్గొనడం గొప్ప విషయం. హాలీవుడ్ ప్రముఖులతో రాజమౌళి తన సినిమా 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణపై పలు ఆసక్తికరమైన విషయాలను చర్చించారు. ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకులకు ఇంతగా నచ్చుతుందని అనుకోలేదని రాజమౌళి తెలిపారు.
- హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టులలో ఉత్తమ చిత్రం కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్' (RRR) రెండో స్థానంలో నిలిచింది. ఈ అవార్డుకు ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా పోటీ పడలేదు. 'ఆర్ఆర్ఆర్' ఉత్తమ చిత్ర విభాగంలో మరో 9 హాలీవుడ్ చిత్రాలతో పోటీపడడం గమనార్హం.
- రూసో బ్రదర్స్ వంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువరు సినీ ప్రముఖులు ఈ సినిమా ఓ అద్భుతం అంటూ పోస్టులు పెడుతున్నారు.
- ఓ నేపాల్ వార్తా పత్రిక ఫ్రంట్ పేజీలో 'ఆర్ఆర్ఆర్' సినిమాపై ప్రత్యేక వ్యాసాన్ని రాసింది. స్వాతంత్య్ర పోరాటంలో రామ్, భీమ్‌ల గొప్పదనాన్ని పొగిడారు.
- 'భీమా నిన్ను కన్న నేల తల్లి గర్వపడుతుంది'... అంటూ ఇజ్రాయెల్ పత్రికల్లో ఎన్టీఆర్( NTR)పై కథనాలను ప్రచురించారు. టాప్ హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు దేశభక్తి సినిమాలో నటించడం గొప్ప విషయం అంటూ ప్రశంసించారు.
- వరల్డ్ వైడ్‌గా ఎక్కువసార్లు ట్వీట్ చేయబడిన సినిమా టైటిల్‌గా RRR ప్రథమ స్థానంలో నిలిచి కొత్త రికార్డును తిరగరాసింది.
- ట్రిపుల్ ఆర్ అని గూగుల్‌లో టైప్ చేస్తే ఓ బైక్, ఓ గుర్రం కనిపిస్తాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చేలే అవి అటు ఇటు కదులుతూ ఉంటాయి. 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి గూగుల్ ఇలా సర్‌ప్రైజ్ ఇచ్చింది.
- తమ అభిమానాన్ని చాటుకుంటూ ఎందరో అభిమానులు ఎన్నో క్యారికేచర్స్, పెయింటింగ్స్ వేశారు.
- 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎఫెక్ట్‌తో రామ్, భీమ్‌లను పోలిన గణేష్ విగ్రహాలను తయారు చేసి అమ్మారు. ఈ విగ్రహాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.
- ఓటీటీలో 'ఆర్ఆర్ఆర్' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఓటీటీలో ఈ సినిమా చూసిన పలువురు సోషల్ మీడియా ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ అవార్డు రావాల్సిన అర్హతలు ఉన్నాయంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' సినిమాకు అకాడమీ అవార్డు (ఆస్కార్) రావాలంటూ ఎంతో మంది కోరుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాను భారతీయ స్వాతంత్య్ర పోరాటాల నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం కూడా ఆస్కార్ నామినేషన్‌పై స్పందించే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.