ఆ ఇండిగో ఉద్యోగి ప్రవర్తన నాకు నచ్చలేదు : పూజా హెగ్డే (Pooja Hegde)
పూజా హెగ్డే (Pooja Hegde).. టాలీవుడ్ టాప్ హీరోయిన్. ముకుంద, ఒక లైలా కోసం లాంటి చిత్రాలతో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠాపురం లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆమె కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేశాయి.
అయితే, ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ లాంటి చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో.. ఇటీవలి కాలంలో పూజ జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ఇక టాలీవుడ్ సంగతి పక్కనే పెడితే.. బాలీవుడ్ ప్రాజెక్టులతో బాగా బిజీ అయ్యారు పూజ. సర్కస్, కబీ ఈద్ కబీ దివాలీ లాంటి హిందీ సినిమాలలో ఆమె నటిస్తున్నారు.
కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో పూజ ప్రాతినిధ్యం
ఇటీవలే జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు కూడా పూజ ప్రాతినిధ్యం వహించారు. భారత్ నుంచి కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు అధికారిక ప్రతినిధిగా ఆమె హాజరయ్యారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆమె పాపులారిటీ ఎంత పెరిగిందో. ప్రస్తుతం మన దేశంలోని పేరెన్నిక గల సినీ కథానాయికలలో పూజ కూడా ఒకరు.
తాజాగా పూజ హెగ్డే (Pooja Hegde) చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆమెకు కోపం తెప్పించే ఘటన ఒకటి విమానాశ్రయంలో జరిగిందట. ఆ విషయాన్ని పూజానే సోషల్ మీడియాలో తెలిపారు. ఇండిగో విమాన సంస్థకు చెందిన ఉద్యోగి ప్రవర్తన తనకు నచ్చలేదంటూ పూజ హెగ్డే ట్వీట్ చేశారు.
అతను దురుసుగా ప్రవర్తించాడు - పూజ హెగ్డే
ఇండిగో విమానంలో పూజ హెగ్డే (Pooja Hegde) ఈ మధ్యకాలంలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో ఓ ఘటనపై పూజ సీరియస్ అయ్యారు. ఇండిగో విమాన సంస్థకు చెందిన ఉద్యోగి ఆమెతో దురుసుగా ప్రవర్తించారట.
దీంతో, ఆ ఉద్యోగి పేరుతో సహా ట్వీట్ చేసి తన ఆగ్రహాన్ని చూపించారు పూజ. విపుల్ నక్షే అనే పేరుగల ఇండిగో విమానయాన సంస్థ ఉద్యోగి అనవసరంగా ప్రయాణికులపై నోరు పారేసుకున్నాడని.. ఆ ఘటన తనకు ఎంతో కోపాన్ని తెప్పించిందని పూజ తెలిపారు. అతని ప్రవర్తన సరిగ్గా లేదంటూ పోస్ట్ చేశారు.
క్షమాపణలు తెలిపిన ఇండిగో
సాధారణంగా ఇలాంటి ఘటనలు బయటకు చెప్పడం తనకు నచ్చదని పూజ అన్నారు. అయితే తనకు ఎదురైన భయంకరమైన పరిస్థితి గురించి అందరికీ తెలియాలని ఇలా ట్వీట్ చేశానన్నారు. ముంబై నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో, విపుల్ నక్షే అమర్యాదగా వ్యవహరించాడని పూజ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీంతో, పూజ హెగ్డే (Pooja Hegde) ఫ్యాన్స్ ఇండిగో ఉద్యోగి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నక్షీని వెంటనే ఉద్యోగంలోంచి తొలిగించాలంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. పూజ హెగ్డే (Pooja Hegde) పోస్టు చూసిన ఇండిగో సంస్థ వెంటనే ఆమెను క్షమాపణలు కోరింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Read More: వెంకీ (Venkatesh) చెల్లిగా నటించనున్న పూజ హెగ్డే(Pooja Hegde)