New Releases (కొత్త సినిమాలు) : త్వరలో ప్రేక్షకులను అలరించబోయే చిత్రాలివే !

Updated on May 05, 2022 12:11 PM IST
ప్రేక్షకులను అలరించనున్న పుష్ప 2, సర్కారు వారి పాట, మేజర్‌‌
ప్రేక్షకులను అలరించనున్న పుష్ప 2, సర్కారు వారి పాట, మేజర్‌‌

కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమాలు లేక నిరాశపడిన సినీ అభిమానుల రెండేళ్ల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ, ఈ ఏడాది ఆరంభం నుంచే సినీ జాతర మొదలైంది. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్‌ సినిమాలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌‌–2 కూడా రిలీజై అభిమానులను అలరించాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’తో ప్రారంభమైన బాక్సాఫీస్ రికార్డుల మోత.. మోగుతూనే ఉంది.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) రికార్డుల్ని తిరగరాస్తే, ప్రశాంత్ నీల్ రూపొందించిన కేజీఎఫ్–2 చరిత్ర సృష్టించింది.  రాధేశ్యామ్,  బీస్ట్, ఆచార్య వంటి సినిమాలు కాస్త నిరాశపరిచినా, విడుదలకు సిద్ధమైన పలు సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటివరకు రిలీజైన వాటిని పక్కనపెడితే. త్వరలో మరిన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి  రెడీ అవుతున్నాయి.

రెండేళ్లుగా రిలీజ్ డేట్లు మార్చుకుంటూ వచ్చిన సినిమాలు, త్వరలోనే విడుదల కాబోతున్నాయి. వాటిలో అభిమానులు ఎంతగానో ఆత్రంగా ఎదురుచూస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి. త్వరలోనే రిలీజ్ కాబోయే సినిమాలేంటో చూద్దాం..

మహేష్‌బాబు  ‘సర్కారు వారి పాట’ లేటెస్ట్‌ పోస్టర్‌‌

సర్కారు వారి పాట

సూపర్‌‌స్టార్ మహేష్ బాబు (MaheshBabu), కీర్తి సురేష్  జంటగా విడుదలకు సిద్ధమవుతున్న ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలతోపాటు.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ రోజుల వ్యవధిలో మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. పరశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చిత్రబృందం ప్రమోషన్లు కూడా ప్రారంభించింది.  ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, థమన్ సంగీతం అందించారు.

నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’

అంటే సుందరానికీ..

నేచురల్‌ స్టార్ నాని, నజ్రియా జంటగా నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా జూన్‌ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజైన సినిమా ట్రైలర్‌‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ‘అంటే సుందరానికీ’ సినిమా కంప్లీట్‌ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

అడివి శేష్‌ ‘మేజర్‌‌’ సినిమా పోస్టర్

‘అడివి శేష్‌’ మేజర్

ముంబై ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘మేజర్’. ఈ చిత్రాన్ని జూన్‌ 3వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిలింస్‌ ఇండియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 9న మేజర్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పోస్టర్

ఐకాన్ స్టార్ పుష్ప2..

కరోనా లాక్‌డౌన్ తర్వాత పాన్‌ ఇండియా సినిమాగా రిలీజై.. సూపర్‌‌హిట్‌ సినిమాగా నిలిచింది అల్లు అర్జున్‌ నటించిన పుష్ప. పుష్ప అనే ఓ గంధపు చెక్కల స్మగ్లర్ కింది స్థాయి నుంచి ఎలా ఎదిగాడు అనేది ఫస్ట్‌ పార్ట్‌లో చూపించాడు దర్శకుడు సుకుమార్. ఇక సెకండ్ పార్ట్‌లో  పుష్ప తనకు ఎదురైన ఆటుపోట్లను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశంతో కథ నడుస్తుందని సమాచారం. పుష్ప సినిమా భారీ హిట్‌ సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప 2పై పడింది.

విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్‌, చార్మి

పూరి–విజయ్‌ ‘లైగర్’

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌, యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న మరో పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్’. ఈ సినిమా విడుదల కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి కావడంతో, పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘లైగర్‌‌’పై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

సలార్‌‌లో రెబల్‌స్టార్ ప్రభాస్

రెబల్‌స్టార్ ప్రభాస్‌ ‘సలార్’

రెబల్‌స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌‌గా ఎదిగాడు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమాలన్నీ పాన్‌ ఇండియా రేంజ్‌లోనే విడుదల అవుతున్నాయి. కేజీఎఫ్‌ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌‌పై విజయ్‌ కిరగందూర్‌‌ సమర్పిస్తున్న ‘సలార్’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. కేజీఎఫ్‌తో సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా సలార్‌‌ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా ఇంటర్వెల్‌లో వచ్చే ప్రీ క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాలీవుడ్‌ రేంజ్‌లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

చిన్ని

తమిళంలో సాని కాయిదమ్‌గా, తెలుగులో చిన్నిగా ఏక కాలంలో విడుదల కాబోతోంది ఈ ద్విభాషా చిత్రం. ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో కీర్తి డీగ్లామర్ రోల్‌లో నటించినట్లు తెలుస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని ప్రతిభను నిరూపించుకున్న కీర్తి ఈ సినిమాలో మరో ప్రయోగాత్మక పాత్ర పోషించిందని తెలుస్తోంది.

విక్రమ్‌ (తమిళ్‌)

విశ్వ నటుడు కమల్‌ హసన్, ఫహద్‌ ఫాసిల్, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్‌ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ రూపొందిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌, ఆడియో కూడా‌ మే 15న రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది చిత్ర యూనిట్. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న విక్రమ్‌ సినిమాకు అనిరుథ్‌ రవిచంద్రన్ మ్యూజిక్‌ అందించాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!