Sardar Movie Review : భావోద్వేగాలతో మిళితమైన యాక్షన్ స్పై డ్రామా "సర్దార్" ..!
నటీనటులు: కార్తి, రాశిఖన్నా, రజిషా, చుంకీ పాండే, లైలా
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: జార్జ్ విలయమ్స్
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్
దర్శకత్వం : పీఎస్ మిత్రన్
రేటింగ్ : 3/5
యుగానికొక్కడు, నా పేరు శివ, ఊపిరి, ఖాకీ, ఖైదీ, చినబాబు లాంటి హిట్ సినిమాలతో తెలుగు నాట కూడా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించున్న నటుడు కార్తి (Karthi). రాశి ఖన్నా, రజీషా విజయన్‌లు కథానాయికలుగా .. కార్తి ఇటీవలే నటించిన చిత్రం "సర్దార్".
విడుదలకు ముందే ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మనం కూడా ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందామా
కథ :
విజయ్ (కార్తి) ఓ పోలీసాఫీసర్. లాయర్ షాలిని (రాశి ఖన్నా)ని చిన్నతనం నుండీ ప్రేమిస్తుంటాడు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే పోలీస్‌గా ఇతనికి పబ్లిక్‌లో మంచి పాపులారిటీ ఉంటుంది. మీడియా పబ్లిసిటీ కోసం ఏదైనా చేసే విజయ్, ఓ రోజు యూనివర్సిటీలో మాయమైన ఓ ఫైల్‌ను కనుగొనే కేసును టేకప్ చేస్తాడు.
ఆ ఫైల్‌లో సైనిక రహస్యాలు ఉంటాయి. ఈ కేసును చేధించే ప్రయత్నంలోనే విజయ్ తన తండ్రి సర్దార్ (కార్తి) గురించి తెలుసుకుంటాడు. అప్పటికే దేశద్రోహిగా ముద్ర పడిన సర్దార్ కొడుకుని కలిశాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నదే ఈ చిత్రకథ.
సానుకూల అంశాలు :
కార్తికి (Karthi) ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ఈ సినిమాలో ఓ వైపు తండ్రిగా.. మరో వైపు కొడుకుగా రెండు విభిన్న పాత్రలను కార్తి చాలా చక్కగా పోషించాడు. రెండు పాత్రలలోనూ వైవిధ్యాన్ని కనబరిచాడు. అలాగే యాక్షన్ సన్నివేశాలలో కూడా చాలా సూపర్బ్‌గా నటించాడు. తన గత చిత్రాలను గుర్తుకుతెచ్చాడు.
ఇక ఈ చిత్రంలో కథానాయికగా నటించిన రాశిఖన్నా (Raashi Khanna) కూడా మంచి పరిణితితో కూడిన నటనను కనబరిచింది. అలాగే కార్తి తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ లైలా ఆకట్టుకుంటుంది. మరో హీరోయిన్ రజీషా కూడా తన పరిధి మేరకు మంచి నటననే కనబరిచింది. అదేవిధంగా నటుడు చుంకీ పాండేకి ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ లభించింది. ఆసక్తికరంగా ఉంటుంది ఈ పాత్ర.
మంచి నిర్మాణ విలువలు కలిగిన సినిమా ఈ "సర్దార్". అలాగే ఈ చిత్రంలోని సంగీతం కూడా బాగుంది. జీవి ప్రకాష్ కుమార్ అందించిన బాణీలు ఆకట్టుకుంటాయి. స్పై డ్రామాలు, యాక్షన్ సినిమాలు చూసేవారికి ఈ చిత్రం ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రతికూల అంశాలు
ఈ సినిమా కథను దర్శకుడు బాగానే రాసుకున్నా.. కథనం విషయంలోనే కాస్త తడబడ్డాడేమో అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ ఈ సినిమాని ప్రేక్షకుడికి మరో కోణంలో చూపిస్తుంది. ఆ ట్రీట్ మెంట్ వర్కవుట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. అలాగే సినిమాలో భావోద్వేగ సన్నివేశాలకు పెద్ద పీట వేసినప్పటికీ.. సరైన ట్విస్టులు లేకపోవడంతో సగటు ప్రేక్షకుడు ఎక్కడో ఆ ఫీల్‌ను మిస్సవుతాడు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ :
ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీమ్‌ను కచ్చితంగా అభినందించాలి. ముఖ్యంగా జార్జి విలియమ్స్ అద్భుతమైన సినిమాటోగ్రఫీతో యాక్షన్ సినిమాకు కావాల్సిన ఎఫెక్ట్స్‌ను బాగా చిత్రీకరించాడు. అలాగే పోరాట దృశ్యాలను కూడా స్టంట్ మాస్టర్లు అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ సినిమాకి అవసరమైన మంచి ఔట్ పుట్‌ను అందించారు.
ఫైనల్ వర్డ్ :
ఈ సినిమా భావోద్వేగాలతో మిళితమైన ఓ యాక్షన్ స్పై డ్రామా. యాక్షన్ సినిమాలంటే పడి చచ్చే జనాలకు ఈ సినిమా బాగానే నచ్చుతుంది. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం ఆకట్టుకుంటుందని చెప్పలేం.