కామన్ మ్యాన్ నుంచి నేచురల్ స్టార్ వరకు 'ఓ సుదీర్ఘ ప్రయాణం'.. నాని (Nani) నటించిన టాప్‌ టెన్ సినిమాలు ఇవే !

Updated on Aug 01, 2022 06:55 PM IST
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా చేసిన సినిమాల పోస్టర్లు
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా చేసిన సినిమాల పోస్టర్లు

విభిన్నమైన కథలను సెలక్ట్ చేసుకోవడం, అందులోని పాత్రలకు న్యాయం చేయడం నేచురల్ స్టార్ నానికి (Nani) వెన్నతో పెట్టిన విద్య. 'అష్టా – చమ్మా' సినిమాతో టాలీవుడ్‌‌కి పరిచయమై, ఆ తర్వాత క్రమంగా స్టార్ హీరోగా ఎదిగారు. లవ్, యాక్షన్, మాస్, రొమాన్స్, కామెడీ సినిమాలతో యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యారు. ఈ క్రమంలో మనం కూడా నటుడు నాని కెరీర్‌లో చెప్పుకోదగ్గ టాప్‌ టెన్ సినిమాలపై ఒక లుక్కేద్దాం..!

 

నాని (Nani) హీరోగా నటించిన జెర్సీ సినిమా పోస్టర్

జెర్సీ (Jersey)

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన స్పోర్ట్స్‌ డ్రామా సినిమా 'జెర్సీ'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్‌‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించారు. రోహిత్‌ కమ్రా, సత్యరాజ్, హరీష్ కల్యాణ్, సనూష, సంపత్‌ రాజ్, విశ్వంత్ దుద్దుంపూడి కీలకపాత్రలు పోషించారు.

అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించిన 'జెర్సీ' సినిమా 2019 ఏప్రిల్ 19వ తేదీన విడుదలైంది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన జెర్సీ సినిమా సుమారుగా రూ.51 కోట్లు కలెక్ట్ చేసింది.

జెర్సీ సినిమాలో క్రికెటర్‌‌గా నాని అద్భుతంగా నటించారు. కొడుకుపై ఎనలేని ప్రేమ ఉన్న తండ్రిగా, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యే మిడిల్‌ క్లాస్ ఫ్యామిలీ మేన్‌గా నాని ప్రేక్షకుల హృదయాలను కదిలించారు. 2019లో ఉత్తమ చిత్రంగా నిలిచిన 'జెర్సీ' సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

నాని (Nani) హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్‌ సినిమా పోస్టర్

భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magaadivoy)

నాని హీరోగా తెరకెక్కిన 'భలే భలే మగాడివోయ్‌' సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దాసరి మారుతి తెరకెక్కించిన ఈ సినిమాను 'జీఏ2' పిక్చర్స్, 'యూవీ క్రియేషన్స్' నిర్మించింది. 'భలే భలే మగాడివోయ్‌' సినిమాలో నాని సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. గోపీచంద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలోని పాటలు శ్రోతలను అలరించాయి.

మురళీ శర్మ, నరేష్, సితార, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. రొమాంటిక్ కామెడీ జోనర్‌‌లో తెరకెక్కిన 'భలే భలే మగాడివోయ్‌' సినిమా 2015 సెప్టెంబర్‌‌ 4వ తేదీన విడుదలై సూపర్‌‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు రూ.9 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా రూ.50 కోట్లకుపైనే కలెక్ట్‌ చేసింది.

'భలే భలే మగాడివోయ్' సినిమాలో లక్కీ అలియాస్ లక్కరాజు అనే మతిమరుపు వ్యక్తి క్యారెక్టర్‌‌లో నటించి నాని ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ లావణ్యా త్రిపాఠికి తన మతిమరుపు గురించి తెలియకుండా జాగ్రత్తపడే సన్నివేశాల్లో నాని నటన నవ్వులు పూయిస్తుంది.

నాని (Nani) హీరోగా నటించిన పిల్ల జమిందార్ సినిమా పోస్టర్

పిల్ల జమిందార్ (Pilla Zamindar)

నాని కెరీర్‌‌లో నిలిచిపోయే మరో మంచి సినిమా 'పిల్ల జమీందార్'. జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్‌‌పై డీఎస్‌ రావు నిర్మించారు. సెల్వగణేష్‌ సంగీతం అందించిన 'పిల్ల జమీందార్' సినిమా 2011 అక్టోబర్‌‌ 14వ తేదీన విడుదలైంది. హరి ప్రియ, బిందు మాధవి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో రావురమేష్, అవసరాల శ్రీనివాస్, నాగినీడు, ఎమ్మెస్‌ నారాయణ కీలకపాత్రలు పోషించారు.

తాత ఆస్తిని చూసుకొని పొగరుగా ప్రవర్తించే ఓ ధనిక కుర్రాడు, ఆస్తి చిక్కులలో పడడంతో స్కాలర్ షిప్‌తో బతికే విద్యార్థిగా మారతాడు. తర్వాత నిజమైన జీవితమంటే ఏంటో తెలుసుకొని, ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. అదే ఈ  సినిమా కథ. ఈ సినిమాలో పిల్ల జమీందార్  పాత్రలో నాని నటన అందరినీ అలరిస్తుంది. అలాగే, తనకు నచ్చని కాలేజీలో చదివే సమయంలో హీరో  పడే కష్టాలు, ఆఖరికి జీవితంలో డబ్బే ముఖ్యం కాదని తెలుసుకున్న తర్వాత అతనిలో వచ్చే మార్పు.. ఈ సన్నివేశాలు అన్నింటిలో కూడా జనాల హృదయాలను కదిలించేలా నటించారు నాని.

నాని (Nani) హీరోగా నటించిన నానీస్‌ గ్యాంగ్ లీడర్ సినిమా పోస్టర్

నానీస్‌ గ్యాంగ్ లీడర్ (Nani’s Gang Leader)

సీరియస్‌నెస్‌ ఉన్న కథలో కామెడీని కూడా మిక్స్‌ చేసి నాని చేసిన మరో ప్రయోగం 'గ్యాంగ్‌ లీడర్'. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, మోహన్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ‘నానీస్‌ గ్యాంగ్ లీడర్‌‌’ సినిమా 2019, సెప్టెంబర్‌‌ 13వ తేదీన విడుదలైంది.

లక్ష్మి, శరణ్య పొన్వన్నన్‌, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కార్తికేయ నెగెటివ్ క్యారెక్టర్‌‌లో కనిపించారు. అనిరుథ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించిన 'గ్యాంగ్ లీడర్‌‌' సినిమాను దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కంచగా.. సుమారు రూ.45 కోట్లు వసూలు చేసింది.

క్రైమ్ కథలు రాసి పేరు తెచ్చుకోవాలనుకునే రచయిత పెన్సిల్ పార్థసారధి (నాని), అన్యాయం జరిగిన ఆరుగురు మహిళల తరఫున నిలబడి వాళ్లకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో తనకు ఎదురైన పరిస్థితులు ఏంటి? తమ జీవితాలు తలక్రిందులు కావడానికి కారణమైన వ్యక్తి పై, ఎలా ఆ ఆరుగురు మహిళలు పగ తీర్చుకోవడానికి ప్రయత్నించారు? వారికి నాని ఎలా సహకరించారు అనేదే సినిమా కథ. ఈ సినిమాలోని నాని హావభావాలు, సంభాషణలు, మేనరిజం.. ఇవన్నీ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పిస్తాయి, నవ్విస్తాయి కూడా.

నాని (Nani) హీరోగా నటించిన అలా మొదలైంది సినిమా పోస్టర్

అలా మొదలైంది (Alaa Modalaindi)

నాని హీరోగా, నిత్య మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన లవ్‌ అండ్ కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌ ‘అలా మొదలైంది’. ఈ సినిమాతో నందినిరెడ్డి దర్శకురాలిగా పరిచయమయ్యారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌‌పై కేఎల్ దామోదర ప్రసాద్‌ 'అలా మొదలైంది' సినిమాను నిర్మించారు. కల్యాణి మాలిక్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక భూమిక పోషించింది. 

2011, జనవరి 21వ తేదీన విడుదలైన 'అలా మొదలైంది' సినిమా సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  ఈ సినిమాలో ఆశిష్‌ విద్యార్థి, ఉప్పలపాటి నారాయణరావు, స్నేహా ఉల్లాల్, కృతీ కర్బందా, రోహిణి మొదలైనవారు కీలకపాత్రలు పోషించారు.

నిత్యా మీనన్ నటన, నాని పోషించిన పాత్రతో పాటు నందిని రెడ్డి దర్శకత్వం కూడా  'అలా మొదలైంది' సినిమా హిట్‌ కావడానికి ప్రధాన కారణాలు. కథ కూడా విభిన్నంగా ఉండడం, ఈ కామెడీ జోనర్ సినిమాకు ప్లస్‌ అయ్యింది. 

నాని (Nani) హీరోగా నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమా పోస్టర్

ఎవడే సుబ్రహ్మణ్యం (Evade Subrahmanyam)

నాని నటించిన మరో విభిన్న సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం'. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమాలో మాళవికా నాయర్, రీతు వర్మ హీరోయిన్లుగా చేశారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో విజయ్ దేవరకొండ, నాజర్, కృష్ణంరాజు కీలక పాత్రలలో నటించారు. రధన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఇళయరాజా ఒకే ఒక పాటకు బాణీలు సమకూర్చారు. ప్రియాంక దత్‌ నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. 2015, మార్చి 21న ఈ సినిమా విడుదలైంది.

తనను తాను అన్వేషించుకొనే ప్రయాణంలో ఓ కార్పొరేట్ ఉద్యోగికి ఎదురైన అనుభవాలను గూర్చి ఈ చిత్రం తెలియజేస్తుంది. ఇందులో కథానాయకుడి క్యారెక్టర్‌‌లో నాని నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. అలాగే, డబ్బు కంటే మానవత్వానికే విలువ ఎక్కువ అని చాటిచెప్పే క్యారెక్టర్‌‌లో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించారు. ఎవరెస్ట్‌ పర్వతంపై షూటింగ్ జరుపుకొన్న తొలి తెలుగు సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం' కావడం విశేషం.

నాని (Nani) హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా పోస్టర్

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ (Krishna Gaadi Veera Prema Gaadha)

నాని హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెహరీన్ పిర్జాదా హీరోయిన్‌గా నటించారు. 14 రీల్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌‌పై రామ్‌ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‘ సినిమాను నిర్మించారు. 2016, ఫిబ్రవరి 12వ తేదీన రిలీజైన ఈ సినిమాలో హరీష్ ఉత్తమన్, సంపత్‌రాజ్, మురళీ శర్మ, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు.

మెహరీన్, నాని మధ్య తెరకెక్కించిన లవ్ సీన్లు ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‘ సినిమాలో చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లలో నాని తన అమాయకమైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే నాని, సత్యం రాజేష్ మధ్య నడిచే కామెడీ సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

నాని (Nani) హీరోగా నటించిన  జెంటిల్‌మన్ సినిమా పోస్టర్

జెంటిల్‌మన్ (Gentlemen)

రొమాంటిక్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ‘జెంటిల్‌మన్‌‘ సినిమా నాని కెరీర్‌‌లో మరో హిట్. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సురభి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ‘జెంటిల్‌మన్‘ సినిమాలో తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్‌లు కీలకపాత్రలు పోషించారు. దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా సుమారు రూ. 33 కోట్లు వసూలు చేసింది.

రొమాంటిక్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ‘జెంటిల్‌మన్‘ సినిమాలో.. నాని కొంత నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్‌‌లో నటించి మెప్పించారు. నివేదా థామస్, సురభితో లవ్‌ సీన్లలో నాని నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి.

నాని (Nani) హీరోగా నటించిన నిన్ను కోరి సినిమా పోస్టర్

నిన్ను కోరి ( Ninnu Kori)

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మరో మంచి రొమాంటిక్ సినిమా ‘నిన్ను కోరి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్లపై డీవీవీ దానయ్య నిర్మించారు. నివేదా థామస్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషించారు.

రూ.18 కోట్లతో తెరకెక్కించిన ‘నిన్ను కోరి‘ సినిమా 2017 జూలై 7వ తేదీన రిలీజై.. దాదాపుగా రూ.52 కోట్లు కలెక్ట్ చేసింది. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచాయి. ‘నిన్ను కోరి‘ సినిమాలో నివేదా థామస్‌తో కలిసి నటించిన కొన్ని భావోద్వేగా పరమైన సీన్లలో నాని నటనకు అభిమానులు, సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు.

నాని (Nani) హీరోగా నటించిన నేను లోకల్ సినిమా పోస్టర్

నేను లోకల్ (Nenu Local)

నాని నటించిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌ ‘నేను లోకల్‘. నక్కిన త్రినాథ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ‘నేను లోకల్‌‘ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర మరో కీలక పాత్ర చేశారు. 2017 ఫిబ్రవరి 3వ తేదీన రిలీజైన ‘నేను‘ లోకల్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.58 కోట్లు వసూలు చేసింది.

కాలేజీ స్టూడెంట్‌గా కీర్తిసురేష్‌ను ఆటపట్టించే సీన్లలో నాని యాక్టింగ్‌ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. యాక్షన్ సీన్లలో, నెగెటివ్‌ రోల్ పోషించిన నవీన్ చంద్రను ఎదుర్కొనే సీన్లలో నాని చెప్పిన డైలాగ్స్‌ సినిమాకు హైలైట్.

నాని నటించిన సినిమాల్లో మరిన్ని మంచి చిత్రాలు ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ‘ సినిమా నుండి ఇటీవల వచ్చిన‘ అంటే సుందరానికీ‘ సినిమా వరకు నాని కెరీర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. వీటిలో కొన్ని కమర్షియల్‌గా హిట్‌ కాకపోయినా.. ఆ సినిమాలో నటనకుగాను నానికి (Nani) మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ నేచురల్ స్టార్ ‘దసరా’ సినిమాలో నటిస్తున్నారు.

Read More : నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న ‘దసరా’ యాక్షన్‌ సినిమా కాదా? పక్కా లవ్‌స్టోరీ అని ఇండస్ట్రీ టాక్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!