క్లాసికల్ సినిమాలకు కేరాఫ్‌.. మణిరత్నం (Mani Ratnam).. డైరెక్టర్లలో ఆయనొక దళపతి

Updated on Jun 02, 2022 11:54 PM IST
మణిరత్నం (Mani Ratnam) డైరెక్ట్‌ చేసిన కొన్ని క్లాసిక్స్
మణిరత్నం (Mani Ratnam) డైరెక్ట్‌ చేసిన కొన్ని క్లాసిక్స్

మణిరత్నం.. సినిమాల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వాళ్లకైనా పరిచయం అక్కర్లేని పేరు. మణిరత్నం తీసిన సినిమాలన్నీ రత్నాల వంటివే. భారతదేశ సినిమా చరిత్రలో గర్వించదగిన దర్శకుల్లో మణిరత్నం పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. రోజా, దళపతి, నాయకుడు, దిల్‌ సే, సఖి, రావణ్‌, గురు, గీతాంజలి, అంజలి.. ఇలా చెప్పుకుంటూ పోతే మణిరత్నం తీసిన ప్రతి సినిమా గురించి చెప్పుకోవాలి. తన సినిమాలను విజువల్‌గానే కాకుండా మ్యూజికల్‌గా కూడా ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా ఉండేలా చూసుకుంటాడు మణి. అటువంటి సినిమాలు తెరకెక్కించిన ఘనత మణిరత్నం సొంతం.

1956 జూన్‌ 2వ తేదీన మధురైలో పుట్టాడు గోపాల రత్నం సుబ్రమణియం. దర్శకుడిగా, ప్రొడ్యూసర్‌‌గా స్ర్కీన్‌రైటర్‌‌గా సత్తా చాటుకున్నాడు మణిరత్నం. తండ్రి గోపాల రత్నం సినిమా డిస్ట్రిబ్యూటర్‌‌గా ఉండేవారు. దీంతో సులువుగానే ఇండస్ట్రీలోకి వచ్చిన మణిరత్నం 1983వ సంవత్సరంలో పల్లవి అను పల్లవి అనే కన్నడ సినిమా తీశాడు. ఆ సినిమా ఫలితం నిరాశపరచడంతో కొన్ని అవకాశాలు దూరమయ్యాయి. అయితే మణిరత్నం తీసిన 5వ సినిమా మౌనరాగం 1986లో రిలీజైంది. దీంతో ఆయన తమిళంలో లీడింగ్‌ డైరెక్టర్ అయ్యాడు. తరువాత వరుసగా రోజా, బొంబాయి, దిల్‌ సే వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీసి నంబర్ వన్‌ డైరెక్టర్‌‌గా ఎదిగాడు మణిరత్నం. ఈ క్రమంలోనే అప్పటి హీరోయిన్ సుహాసినిని పెళ్లి చేసుకున్నాడు మణిరత్నం.

అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం  చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న  డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam)

సినిమాల్లోకి ఎలా..

చదువు పూర్తయిన తర్వాత కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేసేవాడు మణిరత్నం. ఈ క్రమంలో తన స్నేహితుడు డైరెక్టర్‌‌ బీఆర్‌‌ పంతులు కొడుకు రవిశంకర్‌‌ సినిమా తీసే ప్రయత్నాలు చేస్తున్నాడు. వీరిద్దరూ, ఎస్‌.బాలచందర్ కొడుకు రామన్‌ కలిసి ఒక సినిమా స్క్రిప్ట్‌ తయారుచేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతున్న సమయంలో కన్సల్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసిన మణిరత్నం.. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. దాని తర్వాత తీసిన పలు సినిమాలు కూడా మణిరత్నాన్ని నిరాశపరిచాయి. ఇక తనే సొంతంగా సినిమా తీయాలని నిర్ణయించుకుని, పల్లవి అను పల్లవి అనే కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది.

నాయకుడు సినిమా షూటింగ్ సమయంలో కమల్‌ హాసన్‌తో డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam)

కమల్‌ హాసన్‌ ‘నాయకుడు’తో బ్రేక్

అప్పటికే నాలుగు సినిమాలు తీసి మంచిపేరు తెచ్చుకున్నాడు మణిరత్నం. అయితే ఆయన తీసిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయాయి. ఈ క్రమంలో దర్శకుడిగా మణిరత్నం కీర్తి ప్రపంచానికి తెలిసేలా చేసిన సినిమా కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కించిన నాయకుడు. ఇంగ్లీష్‌ సినిమా గాడ్ ఫాదర్ స్పూర్తితో తీసిన ఈ సినిమాలో తన ప్రతిభను సినిమా ఇండస్ట్రీకి చూపించాడు మణి.  

ఈ సినిమా టైమ్‌ మ్యాగ్‌జైన్‌ ఆల్‌ టైమ్‌ 100 గ్రేటెస్ట్‌ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో సత్యజిత్‌ రే తీసిన ది అపు ట్రైలాజి, గురు దత్‌ తీసిన ప్యాస సినిమాలు మాత్రమే ఆ వంద సినిమాల్లో చోటు దక్కించుకున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతోపాటు మూడు నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. బెస్ట్‌ యాక్టర్‌‌గా (కమల్‌ హాసన్‌), బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్, బెస్ట్‌ ఆర్ట్‌ డైరెక్షన్‌ అవార్డులు దక్కాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే 60వ అకాడమీ అవార్డుల్లో బెస్ట్‌ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఇండియా నుంచి ఆస్కార్‌‌ బరిలో అఫీషియల్‌గా చోటు దక్కించుకుంది నాయకుడు.

గీతాంజలి సినిమా షూటింగ్ సమయంలో నాగార్జునతో  డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam)

‘గీతాంజలి’ మరో అద్భుతం

అక్కినేని నాగార్జున సినీ కెరీర్‌‌లో మరపురాని సినిమాల్లో ఒకటిగా నిలిచే సినిమా గీతాంజలి. ఈ సినిమాను తెరకెక్కించింది మణిరత్నం. తెలుగులో ఆయన తీసిన ఏకైక సినిమా ఇది. గిరిజా షెట్టర్ హీరోయిన్‌గా నటించింది. అనారోగ్యంతో బాధపడే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ కావ్యాన్ని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులతో కన్నీరు పెట్టించాడు మణిరత్నం. గీతాంజలి సినిమాకు బెస్ట్ పాపులర్‌‌ సినిమాగా నేషనల్ అవార్డు దక్కింది.

‘అంజలి’తో ఆస్కార్‌‌ బరిలోకి..

బేబి షామిలితో ‘అంజలి’ సినిమా తీసి 63వ అకాడమీ అవార్డుల్లో మరోసారి ఆస్కార్‌‌ బరిలో ఇండియన్ సినిమాను నిలిపాడు మణిరత్నం. ఈ సినిమా రిలీజైన తర్వాత రజినీకాంత్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించిన దళపతి సినిమాను తెరకెక్కించాడు మణిరత్నం. దళపతి సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కూడా కాసులు కురిపించింది. 39వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో బెస్ట్‌ డైరెక్టర్‌‌గా మణిరత్నం అవార్డు అందుకున్నాడు. ఇదే సినిమాకు బెస్ట్‌ మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఇళయరాజా అవార్డు అందుకున్నారు.

ఇళయరాజా,  డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam)

ఇళయరాజా నుంచి ఏఆర్‌‌ రెహ్మాన్‌కు..

అప్పటివరకు మణిరత్నం తీసిన సినిమాలకు దాదాపుగా ఇళయరాజా సంగీతం అందించారు. అయితే 1992లో తీసిన రోజా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఏఆర్‌‌ రెహ్మాన్‌ను సెలెక్ట్‌ చేసుకున్నాడు మణిరత్నం. రోజా సినిమా సక్సెస్‌తో మణిరత్నం ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఆ సినిమాకు 18వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్‌ సెయింట్ జార్జి అవార్డు దక్కింది. ఈ సినిమా తర్వాత రాం గోపాల్ వర్మ రాసిన తిరుడ తిరుడ అనే కామెడీ సినిమాను తెరకెక్కించాడు మణి. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలకు భిన్నంగా తిరుడ తిరుడ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. అంతేకాకుండా టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు.

డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam), ఏఆర్‌‌ రెహ్మాన్

‘గాయం’ సినిమాకు స్క్రీన్‌ప్లే..

ఆ తరువాత మరోసారి రాంగోపాల్ వర్మతో కలిసి పనిచేశాడు మణిరత్నం. ఈ సారి వర్మ తీసిన గాయం సినిమాకి స్క్రీన్‌ప్లే అందించాడు. అనంతరం మణి తీసిన బొంబాయి సినిమా సూపర్ హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న బొంబాయి సినిమా ఎన్నో అవార్డులను సాధించింది.

నిర్మాతగా తొలి సినిమా..

తన భార్య సుహాసినిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఇందిర అనే సినిమాను నిర్మించాడు మణిరత్నం. మోహన్‌లాల్, ఐశ్వర్యారామ్, టబు, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బెల్‌గ్రేడ్‌లో జరిగిన ఫెస్టివ్‌ ఆఫ్‌ ఆటియర్‌‌ ఫిల్మ్‌ అవార్డు గెలుచుకుంది. ఇక, 1998లో షారూక్‌ఖాన్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో మణిరత్నం తీసిన సినిమా ‘దిల్‌ సే’. ఈ సినిమా ఓవర్సీస్‌లో సత్తా చాటినా ఇండియాలో మాత్రం పెద్దగా విజయం సాధించలేదు.

డైరెక్టర్ ఆర్జీవీ, మణిరత్నం (Mani Ratnam)

క్లాసికల్ సినిమాలకు కేరాఫ్‌..

రోజా నుంచి సఖి, రావణ్ సినిమాల వరకూ మణిరత్నం తీసిన సినిమాలు ఆయన కెరీర్‌‌లో ఆణిముత్యాలు. క్లాసిక్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన మణిరత్నం.. ఆ తర్వాత మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు షిఫ్ట్ అయ్యాడు. అమృత, యువ సినిమాలు తీసి ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించాడు. ఆ తర్వాత భారీ బడ్జెట్‌తో తీసిన రావణ్‌ కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. 

‘గురు’తో అభిషేక్‌కు గుర్తింపు..

అభిషేక్ బచ్చన్‌కు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చింది మణిరత్నం ‘గురు’ సినిమా. మణి తీసిన సినిమాలు కమర్షియల్‌గా హిట్‌ కాకపోయినా, కథ, కథనం పరంగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కార్తీక్ కొడుకు గౌతమ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సఖి వంటి రొమాంటిక్ సినిమాను తెరకెక్కించనున్నట్టు టాక్. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు మణిరత్నం. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Read More: కమల్‌ హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్‌’ సినిమా సూపర్.. బ్లాక్‌బస్టర్‌‌ అని ట్వీట్ చేసిన ఉదయనిధి స్టాలిన్

దిల్‌సే షూటింగ్‌లో షారుక్‌ఖాన్‌, మణిరత్నం (Mani Ratnam)

భార్య సుహాసినితో మణిరత్నం (Mani Ratnam)

 
 
మరెన్నో క్లాసికల్ సినిమాలను తెరకెక్కించాలని కోరుకుంటూ.. డైరెక్టర్‌‌ మణిరత్నంకు పింక్‌విల్లా తరఫున
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!