Kiara Advani: చావు అంచుల వరకు వెళ్లా.. హారర్ సినిమాలంటే భయం అంటున్న కియారా ఆడ్వాణీ

Updated on Jun 20, 2022 03:04 PM IST
కియారా ఆడ్వాణీ (Kiara Advani)
కియారా ఆడ్వాణీ (Kiara Advani)

అందం, అభినయం కలగలిసిన హీరోయిన్ కియారా ఆడ్వాణీ (Kiara Advani). ‘ధోని -ది అన్‌టోల్డ్‌ స్టోరి’, మహేష్‌బాబు హీరోగా నటించిన ‘భరత్‌ అను నేను’, రాంచరణ్‌ హీరోగా వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది ఈ బాలీవుడ్‌ భామ. హారర్‌ సినిమాలంటే భయం అంటూనే హారర్‌ థ్రిల్లర్‌ ‘భూల్‌భులయా 2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే కియారా నటించిన జుగ్‌జుగ్‌ జీయో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలతోపాటు తన వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంది కియారా.. ఆ ముచ్చట్లు మీకోసం..

కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్‌ అందరూ కలిసి ధర్మశాల విహారయాత్రకు వెళ్లాం. అక్కడ విపరీతమైన మంచు కురిసింది. దాదాపు నాలుగు రోజులు రూమ్‌లోనే ఉండిపోయాం. నీళ్లు లేవు. రూమ్‌లో వేడిగా ఉండడం కోసం వేసిన క్యాంప్‌ఫైర్‌ ఆరిపోయింది. ఒకరోజు పడుకున్నాక మంచం పక్కనే ఉన్న కుర్చీకి మంట అంటుకుంది. మా ఫ్రెండ్‌ లేచి సమయానికి మంటలను ఆర్పేసింది.

కియారా ఆడ్వాణీ

తలుపులు పగులగొట్టి..

అప్పటికే గది నిండా పొగ వ్యాపించింది. ఎటూ వెళ్లడానికి లేదు. చనిపోవడం తప్పదని అనుకున్నాం. గట్టిగా కేకలు వేయడంతో పక్క రూముల్లోని వాళ్లు తలుపులు పగులగొట్టి మమ్మల్ని కాపాడారు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను. అప్పుడే ప్రాణాల విలువ తెలిసింది. ఆ సంఘటన తర్వాత నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. 

హారర్‌ సినిమాలంటే చాలా భయం. ఆ సినిమాలను ఒంటరిగా చూసే ధైర్యం చేయను.  రొమాంటిక్‌ ఫీల్‌ ఉండే సినిమాలంటే ఇష్టం. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘పి.ఎస్‌. ఐ లవ్‌ యూ’, ‘ది డెవిల్‌ వేర్స్‌ ప్రద’ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నాకిష్టమైన సినిమాల లిస్ట్‌ పెద్దదే. పాటలు వినడం కూడా ఇష్టమే. అయితే ఎప్పటికప్పుడు నాకిష్టమైన పాటలు మారుతూ ఉంటాయి. పుస్తకాలకంటే స్క్రిప్టులే ఎక్కువగా చదివాను.

భూల్‌ భూలయ్యా2 సినిమా పోస్టర్

చెప్పాలంటే భయం..

చిన్నప్పటి నుంచీ డాన్స్‌ చేయడం, పాటలు పాడడం ఇష్టం. స్కూల్‌, కాలేజీలో జరిగే కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేదాన్ని. అయితే నటిని అవుతానని చెప్పాలంటే భయం వేసేది. మేముండేది వెస్ట్‌ ముంబైలో. ఆ ప్రాంతంలో హిందీ సినిమాలను ఎక్కువ మంది చూడరు.

అందుకే హీరోయిన్‌ అవుతానని చెప్తే ఎగతాళి చేస్తారని భయం వేసేది. అయితే కాలేజీ రోజుల్లో ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నా. అప్పుడే నటిని కావాలని నిర్ణయించుకున్నాను. యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుని ఇలా ఈరోజు మీ ముందున్నా.

తల్లితో కియారా ఆడ్వాణీ

అన్ని విషయాలూ షేర్ చేసుకుంటాం..

ఏదైనా సినిమా చూసినప్పుడు అందులో నటించిన హీరోయిన్‌ పాత్ర నచ్చితే తనకు వెంటనే కాల్‌ చేసి శుభాకాంక్షలు చెబుతా. నాకూ చాలా మంది ఫోన్‌ చేస్తూ ఉంటారు. అలా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వల్ల మంచి వాతావరణం ఉంటుంది. నిజానికి మగవారికంటే ఆడవాళ్లే స్నేహితులతో ఎక్కువ ఆనందంగా గడుపుతారు. ‘గిల్టీ’ సినిమాలో నాతోపాటు నటించిన ఆకాంక్ష మంచి ఫ్రెండ్. అలియా భట్‌, అనన్య పాండే, జాన్వీ కపూర్‌.. ఎక్కడ కలిసినా బాగా మాట్లాడుకుంటాం. అన్ని విషయాలనూ షేర్ చేసుకుంటాం.

నా ధైర్యం, రోల్‌ మోడల్‌ మా అమ్మ. ఇప్పుడు నా స్థితికి కారణం కూడా ఆవిడే. నాలోని టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించింది. ఈ క్రెడిట్‌ అంతా అమ్మకే దక్కుతుంది. ‘మనం సంతోషంగా ఉండాలనుకుంటే హాయిగా నవ్వగలగాలి. అప్పుడే మెదడు మనం సంతోషంగా ఉన్నామని భావిస్తుంది. అది మంచి ఆలోచనలకు, ప్రశాంతతకు దారి తీస్తుంది’ అనేది అమ్మ చెప్పిన మాట. ఇప్పటికీ అదే ఫాలో అవుతా.

జగ్‌జగ్‌ జీయో సినిమా పోస్టర్

అది నా అదృష్టం..

ఇంత మంది అభిమానుల్ని సంపాదించుకోవడం నా అదృష్టం. నేను చాలా సెన్సిటివ్‌. మొదట్లో రూమర్స్‌, ట్రోలింగ్‌ గురించి బాధపడేదాన్ని. కానీ సినిమా ఇండస్ట్రీలో అదంతా మామూలే. నేనేంటో తెలియని వాళ్లు, నాకు తెలియని వాళ్లు మాట్లాడిన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

బలమైన బంధానికి కావలసింది అర్థం చేసుకునే మనస్తత్వం, నమ్మకం. ఒకరినొకరు గౌరవించుకోవాలి. దాపరికం లేకుండా అన్ని విషయాలనూ పంచుకోగలగాలి. మాట్లాడుకోవడానికి ఏదీ అడ్డురాకూడదు. అప్పుడే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగుతుంది. నాకు కాబోయే భాగస్వామిలోనూ ఈ క్వాలిటీస్‌నే కోరుకుంటాను అని చెప్పింది కియారా ఆడ్వాణీ (Kiara Advani). 

Read More : ఒక్క సీన్‌లో అయినా వైట్‌ షర్ట్‌తో చిరు..రిలీజ్‌కు ముందు దర్గాకు మహేష్‌..టాలీవుడ్ (Tollywood) తారల సెంటిమెంట్స్

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!