Neetho Movie Review : భావోద్వేగాలకు పెద్ద పీట వేసిన ప్రేమకథా చిత్రం "నీతో"

Updated on Oct 17, 2022 02:05 PM IST
"నీతో".. (Neetho) సున్నితమైన అంశాలను స్పృశిస్తూ దర్శకుడు బాలు శర్మ రాసుకున్న ఈ సినిమా కథాంశం నేటి కుర్రకారుకి ఖచ్చితంగా నచ్చుతుంది.
"నీతో".. (Neetho) సున్నితమైన అంశాలను స్పృశిస్తూ దర్శకుడు బాలు శర్మ రాసుకున్న ఈ సినిమా కథాంశం నేటి కుర్రకారుకి ఖచ్చితంగా నచ్చుతుంది.

నటీనటులు : అభిరామ్ వర్మ, సాత్విక రాజ్, రవివర్మ, సుంజిత్ అక్కినేపల్లి, నేహా కృష్ణ, కావ్య రామన్, అపూర్వ శ్రీనివాసన్, రాజీవ్ కనకాల

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

సినిమాటోగ్రఫీ: సుందర్ రామ్ కృష్ణన్

సంగీతం: వివేక్ సాగర్

నిర్మాతలు: పృథ్వీ క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్

దర్శకత్వం : బాలు శర్మ

రేటింగ్ : 3/5

యువ నటీనటులు అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ ప్రధాన పాత్రలలో , దర్శకుడు బాలు శర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా "నీతో". కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. మరి ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మనమూ చూద్దాం..

కథ :

వరుణ్ (అభిరామ్ వర్మ) ఓ బీమా సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ప్రతి నెల కొత్త పాలసీదారులను చేర్పించాల్సిన బాధ్యత తన మీద ఉంటుంది. కానీ వరుణ్ టార్గెట్స్ పూర్తి చేయకపోవడంతో.. అతనితో పాటు అతని సహోద్యోగుల జాబ్ కూడా రిస్క్‌లో పడుతుంది. ఇలాంటి సమయంలో వరుణ్‌కి మేఘన (సాత్విక రాజ్) నుండి ఓ విచిత్రమైన ఆఫర్ వస్తుంది. తన మ్యారేజ్ ఈవెంట్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ చేయమని ఆమె వరుణ్‌ని అడుగుతుంది. 

2 కోట్ల రూపాయల విలువైన ఈ పాలసీతో వరుణ్‌తో పాటు, అతని ఫ్రెండ్స్ జాబ్స్ కూడా సేఫ్ అవుతాయి. అయితే, అనుకోకుండా జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మేఘన పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అనంతరం వరుణ్, మేఘన‌ల మధ్య కొత్త రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతుంది.

అయితే తమ మధ్య ఉంది ప్రేమా లేదా స్నేహమా? అన్న విషయంలో వారికి క్లారిటీ రాదు. తమలో ఒకరిపై ఒకరికి ఏర్పడిన ఫీలింగ్స్‌కు గల సరైన నిర్వచనం ఏమిటో వారు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. చివరకు ఈ ప్రేమకథ ఎలా ముగిసిందో తెలుసుకోవాలంటే.. "నీతో" సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ :

"నీతో".. (Neetho) సున్నితమైన అంశాలను స్పృశిస్తూ దర్శకుడు బాలు శర్మ రాసుకున్న కథాంశం బాగుంది. అలాగే తమ మధ్యన ఏర్పడిన ప్రేమ బంధానికి సరైన నిర్వచనాన్ని వెతకడానికి నాయకా, నాయికలు ప్రయత్నించే తీరు ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం ఇమోషనల్‌గా సాగుతుంది.

ఈ సినిమా హీరో విషయానికి వస్తే, కథానాయకుడు అభిరామ్ వర్మ్  (Abhiram Varma) చాలా ఈజ్‌తో నటించాడు. కొన్ని సీన్స్‌‌లో ఫీల్‌ను కళ్ళతో బాగా ఎలివేట్ చేశాడు. అలాగే కథానాయిక సాత్విక రాజ్ కూడా మంచి పరిణితితో కూడిన నటనను కనబరిచింది. హీరో చిన్నాన్న పాత్రలో రాజీవ్ కనకాల కూడా బాగా నటించారు. ఆయన నటనానుభవం ఆ పాత్రలో ప్రస్ఫుటితంగా కనిపించింది. ఇక రవివర్మ, సుంజిత్ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. 

సాంకేతిక విభాగం

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిర్మాణ విలువల గురించి. అలాగే సుందర్ రామ్ కృష్ణన్ కెమెరా వర్క్ చిత్రానికి మరో బలం. ఇక పాటలకు వివేక్ సాగర్ అందించిన బాణీలు కూడా వినసొంపుగా ఉన్నాయి. అయితే ఎడిటింగ్ ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేది. 

ఫైనల్ వర్డ్ :

"నీతో" .. ఈ చిత్రం ఓ పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం.  ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి భావోద్వేగ సన్నివేశాలే ప్రధానమైన బలం. అలాగే గ్రిప్పింగ్ నేరేషన్ ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. వెరైటీ ప్రేమకథలను ఇష్టపడే కుర్రకారు తప్పక చూడాల్సిన చిత్రమిది. 

Read More: రాజకీయ కేళిలో నమ్మినవారికి అండగా నిలిచే "గాడ్ ఫాదర్ " !

 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!