Movie Review : కామెడీతోపాటు ఎమోషన్ కలిసిన సినిమా అలీ (Ali) నటించిన ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’
సినిమా: అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
నటీనటులు : అలీ (Ali), నరేష్, పవిత్రా లోకేశ్, మౌర్యాని, మంజు భార్గవి
నిర్మాణ సంస్థ : అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకత్వం : శ్రీపురం కిరణ్
సంగీతం : రాకేష్ పళిడమ్
విడుదల తేది: అక్టోబర్ 28, 2022 (ఆహా ఓటీటీ) (Aha)
రేటింగ్ : 3 / 5
సీనియర్ కమెడియన్ అలీ (Ali), సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘వికృతి’ సినిమాకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించారు. కమెడియన్ అలీ సొంత బ్యానర్ అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా రూపొందింది. అక్టోబర్ 28వ తేదీన ప్రముఖ ఓటీటీ ఆహా (Aha)లో ఈ సినిమా విడుదలైంది.
కథ ఏంటంటే..
శ్రీనివాసరావు(నరేష్), పవిత్ర లోకేష్ (సునీత) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తలు. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా అన్యోన్యంగా ఉంటారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. మరోవైపు సమీర్(అలీ (Ali)) ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడు. దుబాయ్ వెళ్లి చాలా రోజుల తర్వాత తిరిగి ఇండియా వస్తాడు. కుటుంబాన్ని చక్కగా చూసుకునే సమీర్‌కి సెల్ఫీలు, సోషల్ మీడియా అంటే పిచ్చి. ఏ విషయాన్నైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.
ఆ పిచ్చి కారణంగా శ్రీనివాసరావు జీవితం చిక్కుల్లో పడుతుంది. సోషల్ మీడియాలో సమీర్ పెట్టిన ఒక పోస్ట్‌తో శ్రీనివాసరావు జీవితమే మారిపోతుంది. సొసైటీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. ఇంతకీ సోషల్ మీడియాలో సమీర్ పెట్టిన పోస్ట్ ఏంటి? దాని వల్ల శ్రీనివాస్ రావు ఫ్యామిలీ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేది సినిమా కథ.
ఎలా ఉందంటే..
మలయాళ సూపర్‌హిట్ సినిమా ‘వికృతి’కి తెలుగు రీమేక్‌గా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో మార్పులు చేసి సినిమాను రూపొందించారు దర్శకుడు శ్రీపురం కిరణ్. సోషల్ మీడియాలో పెట్టే తప్పుడు పోస్టుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. వాటి వల్ల కొంతమంది జీవితాలు ఎలా తలకిందులు అవుతున్నాయనే విషయాలను స్క్రీన్‌పై చక్కగా చూపించారు దర్శకుడు. నరేష్, పవిత్ర లోకేష్ మధ్య వచ్చే ప్రతీ సీన్ ఆకట్టుకునేలా ఉంది. కథ ఎమోషనల్‌గా సాగుతున్నప్పటికీ కామెడీ కూడా ఉండేలా ప్లాన్ చేశారు. కానీ కథ నెమ్మదిగా సాగడం ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది. సినిమా థియేటర్లలో విడుదలైతే ఎలా ఉంటుందనే విషయం గురించి పక్కనపెడితే.. ఓటీటీలో రిలీజ్ కావడంతో ఇంట్లో కూర్చుని చూడడానికి ఏ మాత్రం తీసిపోని సినిమా అని చెప్పచ్చు. అయితే ఓటీటీలో రిలీజ్ కావడంతో అశ్లీలత ఉంటుందని అనుకుంటే పొరపాటే.
ఎవరెలా నటించారంటే..
కమెడియన్ అలీ (Ali) నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎన్నో సంవత్సరాలుగా తన నటనతో మనల్ని ఆకట్టుకుంటున్నారాయన. ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా ఒదిగిపోయి నటించగలిగే సత్తా ఉన్న నటుడు అలీ. తన కామెడీతో ఎంతగా నవ్వులు పూయించగలరో.. ఎమోషనల్స్ సీన్స్‌ను కూడా అదే రేంజ్‌లో పండించగలరు. ఈ సినిమాలో తన నటనతో సమీర్ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.
ఇక సినిమాలో కీలకపాత్రలు పోషించిన నరేష్, పవిత్ర లోకేష్ కూడా తమ పరిధిలో బాగా నటించారు. సినిమా కథ మొత్తం వీళ్ల చుట్టూనే తిరుగుతుంది. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతాయి. కథను మలుపు తిప్పే మరో కీలక పాత్రలో లాస్య చక్కగా నటించారు. ఇక, మనో, తనికెళ్ల భరణితోపాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఈ సినిమాకు మ్యూజిక్ ప్లస్ అనే చెప్పాలి. ఎమోషనల్ సీన్లలో మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ అందించారు మ్యూజిక్ డైరెక్టర్ రాకేష్ పళిడమ్. సాంకేతికంగా కూడా సినిమా బాగానే ఉంది.
ప్లస్ పాయింట్స్ : అలీ (Ali), నరేష్ నటన, మ్యూజిక్
మైనస్ పాయింట్స్ : కథ నెమ్మదిగా సాగడం
ఒక్క మాటలో.. ఓటీటీకి సరిపోయే సినిమా ‘అందరూ బాగుండాలి’
Read More : టాలీవుడ్ (Tollywood)లో చిన్న సినిమాల సందడి.. నవంబర్‌లో రిలీజ్ కానున్న చిత్రాలు!