Movie Review : మత్స్యకారుల జీవన విధానం, భావోద్వేగాల మిళితం నందితా శ్వేత నటించిన ‘జెట్టి’

Updated on Nov 05, 2022 04:19 PM IST
దెయ్యం క్యారెక్టర్లతో పాపులర్ అయిన నందితా శ్వేత హీరోయిన్‌గా నటించిన ‘జెట్టి’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది
దెయ్యం క్యారెక్టర్లతో పాపులర్ అయిన నందితా శ్వేత హీరోయిన్‌గా నటించిన ‘జెట్టి’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది

సినిమా : జెట్టి 
నటీనటులు : మాన్యం కృష్ణ, నందిత శ్వేతా, తేజశ్వని బెహెర, ఎంఎస్‌ చౌదరి

నిర్మాత : కె.వేణు మాధవ్
దర్శకత్వం : సుబ్రహ్మణ్యం పిచ్చుక
సంగీతం : కార్తీక్ కొడకండ్ల
విడుదల తేది : 04–11–2022

రేటింగ్ : 3 / 5

నవంబర్‌‌ మొదటి శుక్రవారం సంఖ్యాపరంగా చాలా సినిమాలే విడుదలయ్యాయి. అయితే వాటిలో పెద్ద సినిమాగా చెప్పుకునేవి లేవు. అయితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కంటెంట్‌ బాగుంటే ఏ సినిమానైనా ఆదరిస్తుంటారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమ కథా చిత్రమ్‌2, 7, అక్షర వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరోయిన్‌ నందితా శ్వేత. ఆమె హీరోయిన్‌గా నటించిన జెట్టి సినిమా థియేటర్లలో శుక్రవారం విడుదలైంది.

కథ ఏంటంటే?
కటారిపాలెం గ్రామంలో కట్టుబాట్లు ఎక్కువ. ఆ కట్టుబాట్లను ఊరి పెద్ద జాలయ్య (ఎంఎస్‌ చౌదరి) కాపాడుతూ ఉంటారు. ఆ ఊరితోపాటు, చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా అండగా ఉంటారు. గ్రామానికి చెందిన మత్స్య కారుల బోట్లు తుఫానుల కారణంగా కొట్టుకుపోయి నష్టపోతుంటారు. ఎలాగైనా జెట్టి (సముద్ర  తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెన‌) నిర్మించి మత్స్య కారులను ఆదుకోవాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే దశరథ రామయ్య(శివాజీ రాజా)ను అడుగుతూ ఉంటారు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో తానూ జెట్టీని కట్టలేనని స్పష్టంగా చెప్పేస్తాడు రామయ్య. జెట్టి నిర్మిస్తే మత్స్యకారులు తమను లెక్క చేయరని విలన్ (మైమ్ గోపి).. దాని నిర్మాణాన్ని అడ్డుకుంటూ ఉంటాడు. కటారిపాలెం గ్రామానికి టీచర్‌‌గా వచ్చిన శ్రీ (కృష్ణ మాన్యం) గ్రామ అభివృద్ధికి సహకరిస్తుంటాడు. జాలయ్య కూతురు మీనాక్షి ( నందిత శ్వేత)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఊరు విడిచి వెళ్లిపోతారు. ఊరి సంస్కృతి సాంప్రదాయం, కట్టు బాట్ల కాపాడే జాలయ్య చాలా బాధపడతాడు. అవమాన భారంతో కుంగిపోతాడు. తనని నమ్ముకున్న మత్స్య కారులకి జెట్టిని ప్రభుత్వం నుంచి సాధించుకున్నారా? ఊరి కట్టుబాట్లని లెక్క చేయకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన కూతురుని ఎం చేసాడు అనేదే జెట్టి సినిమా కథ.

ఎలా ఉందంటే..
వందల గ్రామాలు, కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు, వాళ్ల జీవితాల కోసం చేసే పోరాటమే జెట్టి సినిమా. మారుమూల బ్రతికే మత్స్యకారుల కట్టుబాట్లు, వాళ్ల జీవనశైలి,  జెట్టి కోసం మత్స్యకారులు చేసే పోరాటాన్ని హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకుడు.

జెట్టి అవసరం ఏమిటి అనే కోణంలో ఈ సినిమా కథను తెరకెక్కించారు దర్శకుడు. ఇందులో దర్శకుడు తీర ప్రాంతంలో ఉన్న కటారిపాలెం అనేగ్రామాన్ని తీసుకొని... ఆ ప్రాంతం, దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే సంస్కృతి, సాంప్రదాయాల నేపథ్యంగా సాగే కథనం ఆకట్టుకుంటుంది. వెండితెరపై మత్స్య కారుల జీవితాన్ని ఆవిష్కరించారు. 

 మత్స్య కారులను దోచుకునే ఓ మోతుబరి ఆ ప్రాంతాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంటాడు. అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని రాసుకున్న కథ, కథనాలు ఆసక్తిగానే సాగుతాయి. తండ్రి, కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్‌ క్లైమాక్స్‌లో కంటతడి పెట్టిస్తుంది.  

ఎవరు ఎలా నటించారంటే?

గ్రామ పెద్ద జాలయ్య పాత్రలో ఎమ్మెస్ చౌదరి నటన బాగుంది. తనను నమ్ముకున్న వారికి ఒక గ్రామ పెద్దగా ఎలా సహాయం చేయాలని తపనపడే క్యారెక్టర్‌‌లో జీవించారు ఎమ్మెస్ చౌదరి. టీచర్‌‌గా, గ్రామ అభివృద్ధికి కృషి చేసే వ్యక్తిగా హీరో కృష్ణ మాన్యం ఒదిగిపోయారు. యాక్షన్‌ సీన్లలో కూడా మెప్పించారు. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే చేరువైన నందితా శ్వేత గ్రామీణ యువతిగా, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్‌‌ క్యారెక్టర్‌‌కు తనవంతు న్యాయం చేశారు.  విలన్‌ క్యారెక్టర్‌‌లో మైమ్ గోపి నటన బాగుంది. శివాజీరాజా నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఏ పాత్రకైనా న్యాయం చేయగలిగే నటుడు ఆయన. 

ప్లస్ పాయింట్స్‌ : కథ, కథనం

మైనస్ పాయింట్స్ : మ్యూజిక్, ఎడిటింగ్ మరింత బాగుండాల్సింది

ఒక్క మాటలో.. భావోద్వేగాల ‘జెట్టి’

Read More : MOVIE REVIEW : యువతను ఆకట్టుకునే వినూత్న ప్రయత్నం.. అల్లు శిరీష్ (Allu Sirish) ‘ఊర్వశివో రాక్షసివో’ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!