Movie Review : ‘మది’ (Madhi)ని మైమరపించే ప్రేమకథ.. యువతను ఆకట్టుకునే ప్రయత్నం

Updated on Nov 11, 2022 10:12 AM IST
ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన శ్రీరామ్ నిమ్మల (Shreeram) హీరోగా నటించిన లవ్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘మది’
ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన శ్రీరామ్ నిమ్మల (Shreeram) హీరోగా నటించిన లవ్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘మది’

సినిమా : మది

నటీనటులు : శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి

దర్శకత్వం : నాగ ధనుష్

సంగీతం : పీవీఆర్‌‌ రాజా

నిర్మాత : ఎన్‌ఆర్‌‌కే రామ్ కిషన్

విడుదల తేదీ : 11–11–2022

రేటింగ్ : 3 / 5

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు యంగ్ హీరో శ్రీరామ్ నిమ్మల (Shreeram Nimmala). ఇప్పటికే ఈ ఏడాది శ్రీరామ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అక్టోబర్ చివరి వారంలో విడుదలైన రుద్రవీణ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అంతేకాదు, ప్రస్తుతం మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు శ్రీరామ్. యువ దర్శకుడు నాగ ధనుష్‌, ముంబై భామ రిచా జోషి ‘మది’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఈ శుక్రవారం (11–11–2022) థియేటర్‌‌లో విడుదలైంది.

కథ ఏంటంటే..

శ్రీరామ్ నిమ్మల (అభి), రిచా జోషి (మధు) పక్కపక్కన ఇళ్లలోనే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఒకే కాలనీలో ఉంటున్నా.. ఒకానొక సందర్భంలో మధుని చూసి ఇష్టపడతాడు అభి. కొన్నాళ్లకు మధు కూడా అభిని ప్రేమించడం మొదలుపెడుతుంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంటారు. చదువు పూర్తైన తర్వాత అభికి వైజాగ్‌లో ఉద్యోగం వస్తుంది.

మధుని వదిలి వెళ్లలేక వెళ్లలేక వెళ్తాడు అభి. దూరంగా ఉండడంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుంది. ఉద్యోగం రావడంతో మధుని పెళ్లి చేసుకుంటానని వాళ్ల నాన్నకు అడుగుతాడు అభి. కులం పేరుతో పెళ్లికి నిరాకరిస్తాడు మధు తండ్రి. వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేస్తారు. అంతేకాదు, కులం పరువు పోతుందనే కోపంతో అభిని చంపేయడానికి ప్లాన్ కూడా చేస్తాడు. అసలు మధు పెళ్లి జరిగిందా ? పెళ్లి తర్వాత కూడా ప్రేమించుకోవాలనుకునే వాళ్ల నిర్ణయం సరైనదేనా ? తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ? అనేది ‘మది’ సినిమా కథ.

ఉత్తర, సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన శ్రీరామ్ నిమ్మల (Shreeram) హీరోగా నటించిన లవ్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘మది’

ఎలా ఉందంటే ?

ప్రేమ, రొమాన్స్, పెళ్లి ఇదే లైన్‌లో సాగుతుంది సినిమా. చదువు, మంచి ఉద్యోగం, ఫారిన్ వెళ్లి స్థిరపడాలని కలలు కంటాడు హీరో. ఈ క్రమంలోనే హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. మంచి ఉద్యోగం వచ్చిన ఆనందంలో ఉండగానే హీరోయిన్‌కు వేరే వ్యక్తితో పెళ్లి కుదిరిపోతుంది. ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని హీరోయిన్‌ను అడుగతాడు హీరో. తన తండ్రికి భయపడి హీరోతో వెళ్లడానికి నిరాకరిస్తుంది హీరోయిన్‌. ఇక్కడి వరకు జరిగిన కథతో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సమయంలో హీరోహీరోయిన్లు తీసుకునే డెసిషన్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అంతేకాదు వాళ్లిద్దరూ ఒకరినిఒకరు ఎంతగా ప్రేమించుకున్నారు అనేది తెలుస్తుంది. సెన్సిబిలిటీ ఉన్న కథను సెలెక్ట్ చేసుకోవడంతోపాటు దానిని తెరకెక్కించడంలో కూడా సక్సెస్ అయ్యారు దర్శకుడు.హీరో కోసం హీరోయిన్.. హీరోయిన్ గురించి హీరో పరస్పరం త్యాగం చేసుకోవాలని తపిస్తూ ఉంటారు. ఈ ఔట్‌ అండ్ ఔట్‌ లవ్‌, రొమాంటిక్ ఎంటర్‌‌టైనర్‌ యూత్‌కు ముఖ్యంగా స్టూడెంట్స్‌కు తప్పకుండా నచ్చుతుంది.    

ఎవరెలా నటించారంటే ?

శ్రీరామ్ నిమ్మల తన వయసుకు తగిన పాత్రలో నటించారు మది సినిమాలో. లవ్, రొమాన్స్ నిండిన క్యారెక్టర్‌‌లో బాగానే మెప్పించారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అన్నింటినీ మేనేజ్‌ చేసే యువకుడిగా శ్రీరామ్ నటన బాగుంది. ప్రేమ, జీవితం గురించి హీరో చెప్పే డైలాగ్స్ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. హీరోయిన్ రిచా జోషి నటన ఆకట్టుకుంటుంది. ప్రేమించిన వ్యక్తికి దూరమయ్యే సమయంలోనూ, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే సన్నివేశాల్లో తన పాత్రకు న్యాయం చేశారు రిచా. ఇక, సినిమా కథ మొత్తం ఇద్దరి చుట్టూనే ఎక్కువగా ఉండడంతో వేరే క్యారెక్టర్లకు నటించే అవకాశం అంతగా ఉన్నట్టు అనిపించదు. అయినప్పటికీ ఎవరి పాత్రలకు వాళ్లు న్యాయం చేశారు. 

ఇక, దర్శకుడు నాగ ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కథ రాసుకున్న తీరు, కథనాన్ని నడిపించిన పద్దతి ఆకట్టుకుంటాయి. ఇక, సినిమాకు హైలైట్ మాత్రం మ్యూజిక్. లవ్, రొమాంటిక్‌తోపాటు ట్రాజెడీ సీన్లలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చిన్న చిన్న పాటలు గుండెలను తాకుతాయి.

ప్లస్ పాయింట్స్ : కథ, మ్యూజిక్, డైరెక్షన్

మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్‌ నెమ్మదిగా కొనసాగడం

ఒక్క మాటలో.. యూత్ ప్రధానంగా తెరకెక్కిన ‘మది’

Read More : మహిళలకు బాగా దగ్గరయ్యే కాన్సెప్ట్ ‘యశోద’ (Yashoda).. సమంత (Samantha) నటన మెప్పిస్తుంది‌‌– దర్శకులు హరి, హరీష్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!