ఉత్తమ దర్శకుల్లో మీరు కూడా ఒకరు.. లింగుసామికి సారీ చెప్పిన రామ్ పోతినేని (Ram Pothineni)

Updated on Jun 23, 2022 06:45 PM IST
రామ్ పోతినేని, డైరెక్టర్ లింగుసామి
రామ్ పోతినేని, డైరెక్టర్ లింగుసామి

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని (Ram Pothineni). తక్కువ టైంలోనే మాస్, క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌.. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌‌, రెడ్‌ సినిమాలతో మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. తాజాగా ‘ది వారియర్‌‌’ సినిమాలో హీరోగా నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘ది వారియర్’ సినిమాను కోలీవుడ్‌ డైరెక్టర్ లింగుసామి తెరకెక్కించారు.

‘ది వారియర్’ సినిమాలో రామ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలను చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసింది. రిలీజైన టీజర్, ‘బులెట్’, ‘దడ దడమని గుండెల శబ్దం’ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ మరో కొత్త పాటను విడుదల చేసింది.

ది వారియర్‌‌ సినిమా పోస్టర్

ఈ పాట విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ది వారియర్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన పలు సంఘటనలను రామ్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘విజిల్‌’ సాంగ్‌ తనకు బాగా నచ్చిందని, ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ అందించిన దేవిశ్రీ ప్రసాద్‌, సింగర్స్‌, నిర్మాతలతోపాటు చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ చెప్పారు రామ్. అయితే ఆయన స్టేజ్‌పై ఇచ్చిన స్పీచ్‌లో దర్శకుడు లింగుసామి గురించి మాట్లాడడం మర్చిపోయారు.

ఈ విషయాన్ని గ్రహించిన రామ్‌ ట్విట్టర్‌‌లో లింగుసామికి క్షమాపణలు చెప్పారు. ‘ది వారియర్ సినిమాను తెరకెక్కించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్‌, డైరెక్టర్‌ లింగుసామి! ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ని మీ భుజాలపైకి ఎత్తుకున్నారు. నేను పనిచేసిన ఉత్తమమైన దర్శకుల్లో మీరూ ఒక్కరిగా ఉన్నందుకు ధన్యవాదాలు. సారీ అండ్‌ లవ్‌ యూ’ అని రామ్‌ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ది వారియర్‌‌ సినిమా పోస్టర్

ఎప్పటికీ మరచిపోలేను..

రామ్‌ పెట్టిన ట్వీట్‌పై లింగుసామి స్పందించారు. ‘నాతో కలిసి పనిచేయడాన్ని నువ్వు ఎంతగా ఇష్టపడ్డావో తెలుసు. సినిమా చూసిన అనంతరం నువ్వు నన్ను ఆత్మీయంగా కౌగిలించుకున్నావ్‌ కదా.. ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోను. మనం మరింత దూరం ప్రయాణించాలని కోరుకుంటున్నా’ అని రామ్‌ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు లింగుసామి. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ నిర్మించిన ది వారియర్‌‌ సినిమాలో రామ్‌ పోతినేని (Ram Pothineni) పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. విలన్‌గా ఆది పినిశెట్టి నటించారు.

Read More : రామ్‌ పోతినేని (Ram Pothineni) వారియర్‌‌లో ‘బులెట్‌’ పాటకు స్టెప్పులేసిన అలనాటి డైరెక్టర్ భారతీరాజా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!