Papam Pasivadu : "పాపం పసివాడు" సినిమా నుండి పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠాలివే ..!

Updated on Nov 08, 2022 02:42 PM IST
 దక్షిణాఫ్రికా చలన చిత్రమైన "లాస్ట్ ఇన్ ది డెసర్ట్" ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నుండి పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి.
దక్షిణాఫ్రికా చలన చిత్రమైన "లాస్ట్ ఇన్ ది డెసర్ట్" ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నుండి పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి.

పాపం పసివాడు (Papam Pasivadu) .. ఈ సినిమా పేరు ఎప్పుడైనా విన్నారా..! 1972 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ రోజులలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. 

వి. రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్వీ రంగారావు తండ్రిగా పోషించగా, ఆయన కుమారుడిగా మాస్టర్ రాము (Master Ramu) ఎడారిలో చిక్కుకుపోయిన ఓ అసహాయ బాలుడి పాత్రలో నటించాడు. దక్షిణాఫ్రికా చలన చిత్రమైన "లాస్ట్ ఇన్ ది డెసర్ట్" ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నుండి పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 

ధైర్యే సాహసే లక్ష్మి : ఈ సినిమాలో బాలుడు క్షయ వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ట్రీట్‌మెంట్ కోసం తన మామయ్యతో కలిసి విమానంలో విదేశాలకు వెళతాడు. కానీ అనుకోని ఓ ప్రమాదం వల్ల ఆ విమానం కుప్పకూలిపోతుంది. ఈ క్రమంలో ప్రాణాలతో బయట పడి ఓ ఎడారిలో చిక్కుకుపోయిన బాలుడు ఎన్నో విపత్తులను దాటి మరీ, తన తల్లిదండ్రులను ఎలా చేరుకుంటాడన్నదే చిత్రకథ. 

ఈ కథ ద్వారా పిల్లలు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు కచ్చితంగా తమను తాము సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. తమకు తామే ధైర్యం చెప్పుకోవాలి. ఆందోళన చెందడం మాని, బుర్రకు ఎలా పదును పెట్టాలో ఆలోచించాలి. 

ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి : ఈ చిత్రంలో పిల్లవాడు ఓ ఎడారిలో చిక్కుకుపోతాడు. తాగడానికి నీరు కూడా దొరకదు. విపరీతమైన ఆకలి కూడా వేస్తుంది. అటువంటి సమయంలో తొలుత మంట ఎలా రాజేయాలో నేర్చుకుంటాడు. తర్వాత అదే మంటలో పిచ్చుక గుడ్లను కాల్చుకుంటూ తింటాడు. అప్పుడప్పుడు అవసరమే మనకు పాఠాలను నేర్పిస్తుంది. ఆ సమయంలో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లడం ఒక్కటే దారి. 

 

Papam Pasivadu

ఆలోచనలకు పదును పెట్టడం : ఈ సినిమాలోని మరో సన్నివేశంలో పిల్లవాడు క్రూర జంతువుల బారి నుండి తప్పించుకోవడం కోసం.. విమానంలో దొరికిన వస్తువులను బయటకు తీసి, వాటి సహాయంతో అగ్గి రాజేస్తూ, తను నిద్రపోయే ప్రాంతం వద్దకు అవి రాకుండా చూసుకుంటాడు. అలాగే ఓ సన్నివేశంలో చెట్లు ఎక్కువగా ఉండే దిశగా నడవడం అలవాటు చేసుకుంటాడు. ఏదైనా జంతువు తన మీద దాడి చేయడానికి సిద్ధపడినప్పుడు, తనకు దగ్గరలోని చెట్టుని ఎక్కేస్తాడు.

తనకు తానే ధైర్యం చెప్పుకోవడం : ఈ చిత్రంలో బాలుడు తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉంటాడు. తన బాధలను తనతో పాటు ట్రావెల్ చేస్తున్న కుక్కపిల్లతో చెప్పుకుంటాడు. అలసటను మర్చిపోవడానికి పాటలు పాడుకుంటాడు. అలా తనలో తానే ప్రేరణను నింపుకుంటాడు.అలాగే తాను గాయాల బారిన పడినప్పుడు, తన బట్టలను చింపి వాటితో కట్టు కట్టుకుంటాడు. అలాగే నీరు నింపడానికి బాటిల్ లభించనప్పుడు, తన దగ్గరున్న లెదర్ బ్యాగ్‌నే బాటిల్‌గా వాడుకుంటాడు. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో.

మనోనిబ్బరం అవసరం : ఏ కష్టాలైనా అనుకోకుండానే వస్తాయి. అటువంటప్పుడు మనోనిబ్బరం అవసరం. నిరుత్సాహపడకుండా, ఓపికగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండడం ముఖ్యం. ఈ సినిమాలో కూడా బాలుడి పాత్ర ద్వారా దర్శకుడు అదే నిరూపించాడు. అందుకే బాలల చిత్రాలలో ఇప్పటికీ Papam Pasivadu (పాపం పసివాడు) సినిమా ఒక ప్రాధాన్యాన్ని సంపాదించుకుంది.

Read More: భార‌త చలనచిత్ర చరిత్ర‌లో నిలిచిన తెలుగు పౌరాణిక చిత్రాలు (టాప్ 10 చిత్ర విశేషాలు)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!