Top 10 Tollywood movies based on Friendship: స్నేహానికి చిరునామాలు ఈ 'సినిమాలు'
స్నేహానికి మించిన బంధం ఉండదు. స్నేహం లేని బంధం కూడా ఉండదు. నాటిన మొక్క , పెంచుకున్న స్నేహం రెండూ అపురూపమైనవే. ఒకటి నీడ నిచ్చి సేద తీరుస్తుంటే మరొకటి ఎప్పుడూ తోడుగా ఉంటూ మనసుకు ఆనందానిస్తుంది. స్వార్థం లేని స్నేహం చిరకాలం నిలుస్తుంది.
అలాంటి స్నేహం విజయాలకు చిరునామాగా మారుతుంది. నిజ జీవితంలోనే కాదండోయ్, వెండితెరపైన కూడా మెరిసిన స్నేహాలు హిట్లు సాధించాయి. ఫ్రెండ్ షిప్ గురించి తెలిపే తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి.
ఆర్ ఆర్ ఆర్ (RRR)
RRR చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. రౌద్రం రణం రుథిరం అనే డిఫరెంట్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాకు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. మట్టి కోసం ఒకరు ... మల్లి కోసం మరొకరు చేసే పోరాటమే ఈ చిత్రం. ఇద్దరు పోరాట యోధులు కలిసి బ్రిటిష్ వారిని సైతం తరిమి కొట్టడమే ఈ సినిమా ప్రధాన కథనం.
మహర్షి (Maharshi)
ప్రిన్స్ మహేష్ బాబు, అల్లరి నరేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. మహేష్ బాబు తన తెలివితేటలతో ఓ పెద్ద కంపెనీకి సీఈఓ అవుతాడు. తన ఎదుగుదల కోసం స్నేహితుడు చేసిన సాయాన్ని తెలుసుకుంటాడు. ఆ స్నేహితుడు ఊరి కోసం చేసే పోరాటంలో చేయి కలుపుతాడు. ఇద్దరు స్నేహితులు కలిసి ఊరికి మంచి చేస్తారు. అదే ఈ చిత్రకథ. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.
ఉన్నది ఒకటే జిందగీ (Vunnadi Okate Zindagi)
రామ్, శీ విష్ణు కలిసి నటించిన సినిమా 'ఉన్నది ఒకటే జిందగీ'. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చే స్నేహం ఈ సినిమాలోని కథానాయకులది. ఓ అమ్మాయి కారణంగా విడిపోయిన ఈ స్నేహితులు.. మళ్లీ ఎలా కలుస్తారనేది ఈ సినిమా స్టోరి. కిశోర్ తిరుమల ఈ మూవీని డైరెక్ట్ చేశారు.
స్నేహితుడు (Snehitudu)
ఆల్ ఈజీ వెల్ అంటూ విజయ్ ఈ సినిమాలో ఓ మంచి స్నేహితుడిగా కనిపిస్తాడు. స్నేహమంటే ప్రాణమిచ్చే ఓ స్నేహితుడి కథ ఇది. 'స్నేహితుడు' సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. హిందీలోని 'త్రీ ఇడియట్స్' సినిమాకు ఈ చిత్రం అధికారిక రీమేక్. ఆడుతూ.. పాడుతూ .. సరదాగా ఉండే విజయ్ తన స్నేహితుల కోసం ఏం చేస్తాడు?.. ఇదే క్రమంలో తాను జీవితంలో ఎలా పైకొస్తాడో తెలుసుకోవాలంటే 'స్నేహితుడు' సినిమా చూడాల్సిందే.
ఓ మై ఫ్రెండ్ (Oh My Friend)
సిద్దార్థ్, శ్రుతిహాసన్ కలిసి నటించిన సినిమా 'ఓ మై ఫ్రెండ్'. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య ఏర్పడే స్నేహం జీవితాంతం కొనసాగుందా? అనే కథతో ఈ సినిమా తీశారు. పెళ్లి అయ్యాక కూడా స్త్రీ, పురుషుల మధ్య స్నేహ బంధమనేది అలాగే ఉంటుందా? అనేది ఈ సినిమాలోని ప్రధాన అంశం. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
హ్యాపీ డేస్ (Happy Days)
వరుణ్ సందేశ్, తమన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంజనీరింగ్ చదివే వయస్సులో ఏర్పడే స్నేహాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో మనకు చూపించారు. మన ఫ్రెండ్స్ కోసం మనమే మంచి చేయకపోతే.. ఇంకెవరు చేస్తారనే కాన్సెప్ట్‌తో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించారు. యూత్‌ని ఆకర్షించిన సినిమాల్లో ఈ సినిమా ఒకటి.
వసంతం (Vasantam)
వెంకటేష్, కళ్యాణిలు స్నేహితులుగా ఈ సినిమాలో నటించారు. ఆడ, మగ మధ్య ఏర్పడే స్నేహ బంధం ఎంత గొప్పగా ఉంటుందో తెలిపే చిత్రమిది. ఈ సినిమాలో ఇద్దరు మిత్రులు తమ స్నేహాన్ని అపార్థం చేసుకునే వారికి, తమ వ్యక్తిత్వంతో అవే అపార్థాలను తొలగిస్తారు. ఈ సినిమాకు విక్రమన్ దర్శకత్వం వహించారు.
నీ స్నేహం (Nee Sneham)
స్నేహమంటే ఓ వరం అంటూ సాగే చిత్రం 'నీ స్నేహం'. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ తన స్నేహితుడి లక్ష్యాన్ని తన లక్ష్యంగా మార్చుకుంటాడు. ప్రేమించిన అమ్మాయి కంటే స్నేహమే గొప్పది అనుకుంటాడు. స్నేహమా లేక ప్రేమ..? అనే కథనంతో ఈ సినిమా తీశారు. పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
స్నేహం కోసం (Sneham Kosam)
చిరంజీవి, విజయ్ కుమార్‌లు ఈ సినిమాలో ప్రాణ స్నేహితులుగా నటించారు. చిన్నతనంలో చిగురించిన స్నేహం వయస్సు పైబడిన తర్వాత కూడా ఉంటుందా? అనే కథతో ఈ సినిమా నిర్మించారు. స్నేహ బంధానికి అంతస్థులు అడ్డురావనే కథనంతో ఈ చిత్రం సాగుతుంది. రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ప్రేమదేశం (Prema Desam)
స్నేహానికి సంబంధించిన సినిమా అంటే వెంటనే గుర్తుకు వచ్చేది 'ప్రేమదేశం'. అబ్బాస్, వినీత్, టబులు ఈ సినిమాలో నటించారు. ఇద్దరు మిత్రులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. అయితే, ఆ అమ్మాయి ఇద్దరినీ మంచి స్నేహితులగానే చూస్తుంది. ఈ క్రమంలో ఆ ఇరువురి మిత్రుల మధ్య ఏర్పడిన వివాదం ఎలా పరిష్కారమైందో తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఓ మంచి స్నేహ బంధం గురించి తెలిపే ఈ చిత్రానికి కదిర్ దర్శకత్వం వహించారు.