V. V. Vinayak: మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ "వి.వి. వినాయక్"(బర్త్ డే స్పెషల్)
టాలీవుడ్ దర్శకుల్లో వి.వి.వినాయక్ డైరెక్షన్ కాస్త భిన్నంగా ఉంటుంది. మాస్, యాక్షన్ సినిమాల ద్వారా మంచి మెసేజ్ ఇవ్వడం వి.వి.వినాయక్ (V. V. Vinayak) స్పెషాలిటీ. ఎన్టీఆర్ హీరోగా నటించిన "ఆది" సినిమాతో వినాయక్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు.
టాలీవుడ్ అగ్ర హీరోలతో బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించారు. తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. వి.వి. వినాయక్ పుట్టినరోజు సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరి.
మొదటి సినిమాతోనే నంది అవార్డు
వినాయక్ 1974 అక్టోబరు 9 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే హీరో చిరంజీవి అంటే ఎంతో అభిమానం. ఆ అభిమానమే వి.వి. వినాయక్‌ను సినిమాల వైపు నడిపించింది. సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చారు. దర్శకుడు సాగర్ దగ్గర కో - డైరెక్టర్‌గా కొన్ని రోజులు పని చేశారు. ఆ తరువాత తొలి సారిగా ఎన్టీఆర్ హీరోగా "ఆది" సినిమాకు దర్శకత్వం వహించారు.
మొదటి సినిమాతోనే నంది అవార్డును సొంతం చేసుకున్నారు వి.వి. వినాయక్. ఆ తర్వాత రెండో సినిమాగా బాలకృష్ణతో "చెన్నకేశవరెడ్డి" తీశారు. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఇక నితిన్ హీరోగా నటించిన "దిల్" సినిమాతో నిర్మాత దిల్ రాజును పరిచయం చేశారు.
చిరంజీవితో "ఠాగూర్", అల్లు అర్జున్‌తో "బన్నీ", వెంకటేష్‌తో "లక్ష్మి".. ఇలా వి.వి. వినాయక్ తెరకెక్కించిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. సాంబ, యోగి, కృష్ణ, అదుర్స్, బద్రీనాధ్, నాయక్, అల్లుడు శీను, అఖిల్, ఖైదీ నెంబర్ 150, ఇంటిలిజెంట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.
చిరంజీవి (Chiranjeevi) అభిమానిగా
దర్శకుడు వి.వి. వినాయక్‌కు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలను చూస్తూ పెరిగారు. తన ఏడవ తరగతి నుంచి చిరంజీవి అభిమాన సంఘంలో సభ్యుడిగా ఉన్నానని వి.వి. వినాయక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వి.వి.వినాయక్ తండ్రికి ఓ థియేటర్ ఉండేది. ఆ థియేటర్‌లో చిరంజీవి పుట్టిన రోజున ఆయన సినిమాలు ప్రదర్శించేవారట. వి.వి.వినాయక్ తండ్రి కూడా చిరు ఫ్యానేనట.
రాజమండ్రిలో చిరంజీవి కొత్త సినిమా రిలీజ్ అయితే యాభై పైగా టికెట్లు తీసుకొచ్చి.. తన గ్రామంలోని చిరు అభిమానులను సినిమాకు తీసుకెళ్లేవారట. చిరంజీవి అంటే ఎనలేని అభిమానం గల వి.వి. వినాయక్ దర్శకుడిగా చిరుతో "ఠాగూర్, ఖైదీ నెంబర్ 150" వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించి మరోసారి తనను తాను నిరూపించుకున్నారు.
ఇక రీమేక్ సినిమాల విషయానికి వస్తే.. కథ గురించి ఆలోచించాలే గానీ, రివ్యూలు ఎలా రాస్తారో అన్న భయంతో ఒరిజినల్ కథను మార్చకూడదంటారు వి.వి. వినాయక్. అలాగే ఈ రోజు బాయ్ కాట్ ట్రెండింగ్ కొందరికి ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారిందని వి.వి. వినాయక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
బాలీవుడ్ ఎంట్రీ
ప్రస్తుతం దర్శకుడు వి.వి.వినాయక్ "సీనయ్య" అనే సినిమాలో నటిస్తున్నారు. లీడ్ రోల్‌లో నటిస్తూ తన స్వీయ దర్శకత్వంలోనే ఈ "సీనయ్య" చిత్రాన్ని తెరకెకిస్తున్నారు. అలాగే సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన బెల్లంకొండ శ్రీనివాస్‌తో "ఛత్రపతి" సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన "ఛత్రపతి"లో ప్రభాస్ హీరోగా నటించారు.
ఈ సినిమా హిందీ రీమేక్‌తో వి.వి.వినాయక్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే వినాయక్ ప్రధాన పాత్రలో "సీనయ్య" చిత్రం కూడా ఓ సందేశాత్మక చిత్రమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా వి.వి. వినాయక్ మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించాలని పింక్ విల్లా కోరుకుంటుంది.