Srikanth: విడాకుల పుకార్లను ఖండించిన శ్రీకాంత్.. అసత్య వార్తలను ప్రచారం చేయడంపై సీనియర్ హీరో సీరియస్

Updated on Nov 22, 2022 03:59 PM IST
ఫేక్ న్యూస్ చూసి తన భార్య ఊహ (Ooha) ఆందోళనకు గురయ్యారని టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) చెప్పారు
ఫేక్ న్యూస్ చూసి తన భార్య ఊహ (Ooha) ఆందోళనకు గురయ్యారని టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) చెప్పారు

టాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు శ్రీకాంత్ (Srikanth) తన సతీమణి ఊహ (Ooha)కు విడాకులు ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై శ్రీకాంత్ స్పందించారు. తాను–ఊహ విడాకులు తీసుకుంటున్నామంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కొన్ని వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానల్స్‌ తమ గురించి అసత్య వార్తలను ప్రచారం చేయడంపై శ్రీకాంత్ ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘ఊహకు నేను విడాకులు ఇస్తున్నట్లు పలు వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానళ్లలో ప్రచారం జరుగుతోంది. ఈ ఫేక్‌ న్యూస్‌ చూసి ఊహ ఆందోళనకు గురైంది. ఈ ప్రచారంపై బంధువుల నుంచి ఫోన్లు వస్తుంటే వివరణ ఇచ్చుకోలేకపోతున్నా. నాపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానళ్లపై సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తా. నిరాధారమైన పుకార్లు ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి’ అని శ్రీకాంత్‌ చెప్పుకొచ్చారు.

కొన్ని వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానల్స్‌ తమ గురించి అసత్య వార్తలను ప్రచారం చేయడంపై శ్రీకాంత్ ఫైర్‌ అయ్యారు

గతంలోనూ పుకార్లు సృష్టించారు: శ్రీకాంత్ 
గతంలో తాను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి.. తన కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇప్పుడు తాము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నామంటూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొన్ని వెబ్‌సైట్స్‌లో వచ్చిన ఈ వార్తలను చూసి తన స్నేహితులు ఊహకు ఫార్వర్డ్ చేయడంతో ఆమె కంగారుపడుతూ ఆ పోస్టులను తనకు చూపించిందన్నారు. దీంతో తాను ‘ఇలాంటివి ఏమాత్రం నమ్మొద్దు. ఆందోళన పడొద్దు’ అని ఊహను ఓదార్చానన్నారు. 

మా కుటుంబానికి చిరాకు తెప్పిస్తున్నాయ్
‘ఏవో కొన్ని చిల్లర వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానల్స్ వాళ్లు చేసిన ఈ అసత్య ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. దీంతో మా బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్‌గా అనిపిస్తోంది. నేను, ఊహ నిన్న చెన్నై వచ్చి.. ఇక్కడి నుంచి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ పుకార్లు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తున్నాయి. ఇది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నా. నా మీదే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేస్తున్న ఆ వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానల్స్‌పై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని శ్రీకాంత్‌ తన లేఖలో స్పష్టం చేశారు. ఇకపోతే, శ్రీకాంత్–ఊహ దంపతులకు ముగ్గురు పిల్లలు. అందులో ఒకరు ‘రోషన్’ . ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంతో రోషన్ సినీరంగ ప్రవేశం కూడా చేశారు. ఆయన నటించిన ‘పెళ్లి సందD’ మూవీ గతేడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది.  

Read more: Rajinikanth: రజినీకాంత్‌ నటించిన 'బాబా' చిత్రం టాప్ 10 ఆసక్తికర విశేషాలు ..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!