Chiranjeevi: చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. గోపీచంద్ తండ్రి నన్నెంతో సపోర్ట్ చేశారు , ఆయన నాకు సీనియర్ !
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు చెబితే అభిమానులే కాదు.. సినీ ప్రేమికుల గుండెలు కూడా గర్వంతో నిండిపోతాయి. అట్టడుగు స్థాయి నుంచి మెగాస్టార్‌గా ఎదిగిన నటుడు ఆయన. మిడిల్ క్లాస్ రేంజ్‌లో జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి.. ఇప్పుడు కోట్ల మంది అభిమానులకు దేవుడు, అంతకు మించిన స్ఫూర్తిదాయకుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పే చిరు.. హైదరాబాద్‌లో ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై పలు విషయాలపై మాట్లాడారు.
గోపీచంద్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే హైదరాబాద్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
గోపీచంద్‌తో ఏంటి సంబంధం?
గోపీచంద్‌కు, నాకు ఏంటి సంబంధం? అని మీలో చాలా మందికి అనుమానం వచ్చి ఉంటుంది. గోపీచంద్ నాన్న టి. కృష్ణ అద్బుతమైన దర్శకుడు. ఆయన బీకాం ఫైనలియర్ చదువుతున్న సమయంలో.. నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. సీఎస్ఆర్ శర్మ కాలేజీ ఒంగోలులో చదువుకునే టైంలో..'ఎవరో కొత్తగా వచ్చాడు ఈ అబ్బాయి.. ఒకసారి రమ్మనండి' అని టి కృష్ణ సీనియర్ స్టూడెంట్స్‌తో నన్ను పిలిపించారు.
'ఇక్కడ స్టూడెంట్ ఫెడరేషన్‌కు లీడర్‌గా నేను నిలబడుతున్నాను. నీ మద్దతు కావాలి. ఇక్కడ ఎలాంటి సపోర్టు కావాలన్నా.. మా నుంచి నీకు ఉంటుంది అని, ఒక సోదరుడిలా నాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు' అని చెప్పారు చిరంజీవి.
'అప్పట్లో ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. టీ కృష్ణ గారు నాకు ఎప్పుడూ హీరోలాగానే కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లో కలిశాం. చాలా సినిమాలు తెరకెక్కించి అద్భుతమైన పేరు సంపాదించారాయన. సినిమా ఇండస్ట్రీ మీద ఆయనకు ఉన్న ప్రేమ, అభిమానం గోపీచంద్ ద్వారా కొనసాగుతోంది' అని చెప్పుకొచ్చారు చిరంజీవి (Chiranjeevi).
Read More : ప్రభాస్ (Prabhas) అడిగితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను: హీరో గోపీచంద్ (Gopichand)