తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker)‌ కొత్త సినిమా ‘కీడా కోలా’.. అదుర్స్ అనేలా ఫస్ట్‌ లుక్!

Updated on Jun 23, 2022 09:05 PM IST
తరుణ్‌ భాస్కర్‌‌ చేసిన సినిమాలు
తరుణ్‌ భాస్కర్‌‌ చేసిన సినిమాలు

షార్ట్ ఫిలింస్‌తో కెరీర్‌ స్టార్ట్‌ చేసి ‘పెళ్ళి చూపులు’ సినిమాతో ద‌ర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker). మొదటి సినిమాకే నేష‌నల్ అవార్డును అందుకున్నాడు త‌రుణ్. ఎటువంటి అంచనాలూ లేకుండా విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గర సంచల‌నం సృష్టించింది. ఈ సినిమాతో త‌రుణ్ భాస్కర్ పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోయింది.

త‌రుణ్ రైటింగ్‌కు, టేకింగ్‌కు ప్రశంస‌లు దక్కాయి. ఈ సినిమా త‌ర్వాత ఏ స్టార్ హీరోతో సినిమా తీస్తాడు? ఎలాంటి సినిమా తీస్తాడు?  అనే క్యూరియాసిటీ అంద‌రిలో నెలకొంది. అయితే అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ  పెద్దగా ప‌రిచ‌యం లేని యాక్టర్లతో ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ కొట్టాడు తరుణ్.

కీడా కోలా సినిమా పోస్టర్

హీరోగా.. గెస్ట్‌ రోల్స్‌లో..

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా తర్వాత ‘మీకు మాత్రమే’ చెప్తా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తరుణ్‌ భాస్కర్. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు చేరువ కాకపోయినా తరుణ్‌ న‌ట‌న‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. ఈ క్రమంలో ప‌లు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల‌కు వినోదాన్ని పంచుతున్నారు తరుణ్‌.

అయితే తరుణ్‌ మళ్లీ ద‌ర్శకుడిగా సినిమాలు తీయాల‌ని చాలా మంది ఎదురు చూస్తున్నారు. త‌రుణ్ మెగా ఫోన్ ప‌ట్టి దాదాపు నాలుగేళ్లు దాటింది. కార‌ణాలేంటో తెలియ‌దు కానీ ఫుల్ లెంగ్త్ సినిమాను ఇప్పటివ‌ర‌కు తెర‌కెక్కించ‌లేదు. నెట్‌ఫ్లిక్స్ సంస్థ నిర్మించిన ‘పిట్టక‌థ‌లు’ సినిమాలో ఒక ఎపిసోడ్‌ను తెర‌కెక్కించారు తరుణ్. ప్రస్తుతం శ‌ర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’, విశ్వక్ సేన్ ‘ఓరిదేవుడా’ సినిమాల‌కు డైలాగ్స్ రాస్తున్నారు.

క్రైమ్..కామెడీ..

తాజాగా తరుణ్‌ తన తర్వాతి సినిమాను ప్రక‌టించారు. క్రైమ్ కామెడీ నేప‌థ్యంలో తర్వాత సినిమాను తెరకెక్కించనున్నట్టు వెల్లడించి అందరినీ మరోసారి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమాకు ‘కీడా కోలా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తూ పోస్టర్‌ విడుద‌ల చేశారు. తాజాగా విడుద‌లైన ‘కీడా కోలా’ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.

‘కీడా’ అంటే ఆరు కాళ్లు ఉన్న పురుగు, కోలా అనేది సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ పేరు. ఈ టైటిల్ లుక్ పోస్టర్‌లో సాఫ్ట్ డ్రింక్ సీసా క్యాప్‌పై టైటిల్ రాసి ఉంది. డ్రింక్‌కి బదులు రక్తం పొంగుతూ బయటికి రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. పోస్టర్‌లో ఒక బొద్దింక‌ కూడా కనిపిస్తోంది. ఫ‌స్ట్‌లుక్‌తోనే ప్రేక్షకుల‌ను ఇంప్రెస్ చేశాడు త‌రుణ్ (Tharun Bhascker). ఈ చిత్రంలోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించ‌నున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుపుకుంటున్న ‘కీడా కోలా’ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

Read More : Krithi Shetty: మరోసారి నాగచైతన్యతో బేబమ్మ.. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కృతి శెట్టి!


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!