"నేను మోసం చేసింది ప్రేక్షకులను.. మళ్లీ సినిమా తీసి వారిని ఎంటర్టైన్ చేస్తా" : పూరి జగన్నాథ్ (Puri jagannath)
టాలీవుడ్ మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri jagannath) దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “లైగర్” (Liger). ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలైన పలు చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. 'లైగర్' సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో ఈ మూవీ విషయంలో ఎగ్జిబిటర్లకు పూరి జగన్నాథ్ కు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
తాము నష్టపోయామని.. తమ నష్టాలను పూరి జగన్నాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తీ చేయాలంటూ ఆయనను బెదిరిస్తున్నట్లుగా ఆడియో లీక్ అయింది. దీంతో వారి పోరు తట్టుకోలేకపోయిన పూరి జగన్నాథ్.. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఫైనాన్షియర్లు అందరూ కలిసి ఇకపై పూరీ సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే భవిష్యత్తులో పూరీ తీసే ఏ సినిమానూ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆయనను బాయ్ కాట్ చేయాలనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ (Puri jagannath) ఓ ఎమోషనల్ లెటర్ ద్వారా తనలోని బాధను, ఆవేశాన్ని వెళ్లగక్కాడు. తాను మోసం చేసింది ప్రేక్షకులను మాత్రమే అని.. వారి పట్ల మాత్రమే బాధ్యత వహిస్తాననని అందులో పేర్కొన్నారు. మళ్లీ సినిమా తీసి వాళ్లను ఎంటర్టైన్ చేస్తా అంటూ లేఖలో చెప్పుకొచ్చారు పూరి.
ఆ లెటర్ లోని చివరి పేరాలో.. "నేను నిజాయితీ పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పొతే మనలన్ని పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ ని తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదు" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ (Puri jagannath Letter) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.