Sonu Sood: తెలంగాణలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటనపై స్పందించిన సోనూసూద్!
Sonu Sood: హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అమ్నీషియా పబ్ వద్ద ఓ బాలికకు నిందితులు మాయమాటలు చెప్పి.. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో రియల్ హీరో సోనూసూద్ తాజాగా దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న అత్యాచారాల పై స్పందించారు. రీల్ లైఫ్ లో విలన్ రోల్స్ చేసే సోనూసూద్.. నిజ జీవితం లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా సమయంలో సొంత డబ్బుతో ఎంతోమందిని కాపాడి.. కనిపించే దేవుడయ్యాడు. ప్రస్తుతం ఎవరు ఆపదలో ఉన్న స్పందిస్తూ వారికీ సాయం చేస్తూ వస్తున్నాడు.
ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్ రేప్ (Jubilee Hills Pub Rape Case) కేసుపై సోనూసూద్ స్పందించారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగందనే విషయాన్ని న్యూస్ లో చూసి షాక్ కు గురయ్యానన్నారు. ఇలాంటి నేరాలకు పబ్ లు కారణమవుతున్నాయని అనడం సరైంది కాదని సోనుసూద్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. మనం ఆలోచించే విధానంలోనే మార్పు రావాలన్నారు. తప్పుగా ఉంటే.. చెడు ఆలోచనలే వస్తాయని అన్నారు. ఇది చాలా పెద్ద నేరమని అన్నారు. అత్యాచారానికి పాల్పడింది మేజర్లా లేక మైనర్లా అనేది ముఖ్యం కాదని… వారు ఎలాంటి నేరం చేశారనేదే ముఖ్యమని చెప్పారు. ఘటనకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి..' అని సోనూసూద్ అన్నారు.
కాగా, ఈ ఘటనకు పాల్పడ్డ కామంధులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులోని నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితులను రిమాండ్‌లోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసుల.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసి మరింత లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. నిందితులను కఠిన శిక్షించాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.