Karthikeya 2: 'కార్తికేయ 2' ఇక ఓటీటీలో.. నిఖిల్ ( Nikhil Siddhartha) నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు!
Karthikeya 2: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) నటించిన పాన్ ఇండియా సినిమా 'కార్తికేయ 2' సౌత్‌తో పాటు నార్త్ ఇండియాలోనూ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా ఓటీటీలో రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న 'కార్తికేయ 2' చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5లో 'కార్తికేయ 2' సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ల్రీమింగ్ కానుంది.
నిఖిల్‌కు బ్లాక్ బాస్టర్ హిట్
'కార్తికేయ' సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించారు. 'కార్తికేయ' సినిమా సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రహస్యాల చుట్టూ తిరుగుతుంది. ఇక కృష్ణుడు ఏలిన ద్వారకా నగర రహస్యాల నేపథ్యంలో 'కార్తికేయ 2' సినిమాను నిర్మించారు.
మొదట 'కార్తికేయ 2' (Karthikeya 2) చిత్రాన్ని జూలై 22 తేదిన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత ఈ చిత్రాన్ని ఆగస్టు 12న రిలీజ్ చేయాలని భావించారు. చివరకు 'కార్తికేయ 2' సినిమా ఆగస్టు 13 తేదీన రిలీజ్ అయి.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
'కార్తికేయ 2' సినిమాలో నిఖిల్‌కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ నటించారు. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
నా సినిమా అడ్డుకున్నారన్న నిఖిల్
'కార్తికేయ 2' సినిమా ఆలస్యంగా విడుదల అవడానికి హీరో నిఖిల్ చెప్పిన కారణాలు ఆశ్చర్యం కలిగించాయి. తనకు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు కాబట్టే.. తన సినిమా వాయిదా పడుతూ వచ్చిందన్నారు. తన సినిమా విడుదల కాకుండా కొందరు కావాలనే అడ్డుకున్నారని నిఖిల్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి.
నిఖిల్ నటన అదుర్స్ : ప్రేక్షకులు
'కార్తికేయ 2' సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని నిఖిల్ సినిమా విడుదలకు ముందు పలు సందర్భాల్లో తెలిపారు. నిఖిల్ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారు. ఈ సినిమా విడుదలైన తొలిరోజు నుంచే కాసుల సునామీ సృష్టించింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన మలయాళం వెర్షన్ కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
ఇండియాలోనే కాకుండా అమెరికాలోనూ 'కార్తికేయ 2' మంచి బిజినెస్ చేసింది. 'కార్తికేయ 2' ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 130 కోట్లను వసూళ్లు చేసింది. ఇక బాలీవుడ్‌లో 'బాహుబలి', 'పుష్ప' తరువాత 'కార్తికేయ 2' ఓ రేంజ్‌లో సక్సెస్ సాధించింది. హీరో నిఖిల్ సిద్ధార్థ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.