Sharada Birthday Special: అలనాటి మేటి నటి 'ఊర్వశి శారద' పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరి !
Sharada Birthday Special: ఉత్తమ నటిగా ఏకంగా మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న అలనాటి మేటి నటి శారద. ఈమె పుట్టింది.. పెరిగింది.. ఆంధ్రప్రదేశ్‌లోనే అయినా, మలయాళ సినిమాలతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు.
జాతీయ అవార్డు 'ఊర్వశి' పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నటి శారద. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా హాస్యం, సెంటిమెంట్‌లతో కూడిన విభిన్నమైన పాత్రల్లో కూడా ఒదిగిపోయిన నటిగా ఆమె పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు.
ఊర్వశి శారద పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరి మీకోసం
బాల్యం
అలనాటి హీరోయిన్ శారద (Sharada) అసలు పేరు తాడిపత్రి సరస్వతి దేవి. శారద 1945 జూన్ 25న జన్మించారు. తండ్రి వేంకటేశ్వర్లు, తల్లి సత్యవతి. గుంటూరు జిల్లా తెనాలి శారద స్వగ్రామం. చిన్నతనంలో శారద భరత నాట్యం నేర్చుకున్నారు. అప్పట్లో నాటకాలకు మంచి డిమాండ్ ఉండేది. నటీనటులంతా నాటకాల ద్వారా సినిమాల్లోకి వచ్చేవారు. ఇదే క్రమంలో నటన పట్ల శారద ఇష్టం పెంచుకున్నారు.
శారద తొలుత నాటకాల్లో నటించాలని అనుకున్నారు. అయితే, ఆమె తండ్రికి తను నాటకాలు వేయడం ఇష్టం లేదు. కానీ శారద ప్రతిభను గుర్తించిన ఆమె తల్లి ధైర్యం చేసి, తన కూతురిని నటనా రంగంలోకి పంపారు. చెన్నైలో శారద వాళ్ల అమ్మమ్మ కుటుంబీకులు ఉండేవారు. చెన్నైకు తరచూ వెళ్లడంతో, అక్కడి సినీ వాతావరణం చూసి.. శారదకు కూడా చలనచిత్రాలలో నటించాలనే ఆసక్తి పెరిగింది.
సినిమా జీవితం
శారద (Sharada) మొదటి సినిమా కన్యాశుల్కం. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన ఈ సినిమాలో శారద బాలనటిగా వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత శారద నటించిన 'రక్తకన్నీరు' సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది.
శారద (Sharada) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక ఎక్కువగా మలయాళ చిత్రాల్లో నటించారు.1968లో విడుదలైన మలయాళ చిత్రం తులాభారంలో శారద నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది. జాతీయ అవార్డు అందుకున్న శారద తెలుగు అమ్మాయని తెలుసుకున్న టాలీవుడ్ దిగ్గజాలు.. ఆమెతో ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. అప్పుడు శారద వరుస తెలుగు సినిమాలతో బిజీ అయ్యారు.
ఊర్వశి శారదగా ఎలా మారారు?
1972లో విడుదలైన 'స్వయం వరం' అనే మలయాళ సినిమాలో నటనకు శారదకు రెండో సారి జాతీయ అవార్డు లభించింది. ఇక తెలుగు సినిమా 'నిమజ్జనం'లో నటనకు 1977లో మూడో సారి శారద ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందారు. అప్పట్లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని 'ఊర్వశి' అవార్డు అని పిలిచే వారు. మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న శారద పేరులో ఊర్వశి వచ్చి చేరింది. దీంతో ఆమె పేరు 'ఊర్వశి' శారద అయింది.
సినిమాలు
బలిపీఠం, శారద, నిమజ్జనం, ఊర్వశి, ఇంద్రధనుస్సు, జస్టిస్ చౌదరి, అనసూయమ్మగారి అల్లుడు, ప్రతిధ్వని, మేజర్ చంద్రకాంత్, అమ్మ రాజీనామా, అత్తాకోడళ్లు, యోగి వంటి చిత్రాల్లో శారద నటించారు. జాతీయ అవార్డులను ఎక్కువసార్లు అందుకున్న నటిగా శారద ఓ చరిత్రనే తిరగరాశారు.
బాలనటిగా వెండితెరకు పరిచయమైన శారద (Sharada) వివిధ భాషల్లోని చలనచిత్రాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. హీరోయిన్ పాత్రలను పోషించడంతో పాటు.. అక్క, చెల్లి, వదిన, అమ్మగా ఎన్నో ఏళ్ల పాటు వెండితెరపై కనిపించే పాత్రల్లో జీవిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచారు.
చలంతో పెళ్లి
సినిమాల్లోకి వచ్చాక శారద (Sharada) నటుడు చలాన్ని పెళ్లి చేసుకున్నారు. చలానికి అప్పటికే పెళ్లయింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భార్య చనిపోవడంతో చలం శారదను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
రాజకీయ జీవితం
తెనాలిలో చేనేత కుటుంబానికి చెందిన శారద 1996లో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెనాలి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి శారద ఎంపీ అయ్యారు. కొన్నేళ్ల తర్వాత వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాజకీయాల నుంచి దూరమైన శారద వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. ఓ చాక్లెట్ కంపెనీని స్థాపించారు. అదీ నష్టాలను మిగల్చడంతో అమ్మేశారు. ప్రస్తుతం శారద తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ రోజు శారద తన 77వ పుట్టినరోజు ను జరుపుకుంటున్నారు