దళపతి విజయ్ (Thalapathy Vijay) : బీస్ట్ డిజాస్టర్ తర్వాత.. టాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరో
దళపతి విజయ్ (Thalapathy Vijay) కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈయన తమిళ నటుడైనా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ ఉంది. పలు టాలీవుడ్ రికార్డులు చూశాక, తన కెరీర్‌లో ఎన్నో కొన్ని తెలుగు సినిమాలను కూడా చేయాలని విజయ్ ఫిక్స్ అయ్యారట. తెలుగులో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని తపిస్తున్న ఈ హీరో.. ఓ డైరెక్టర్‌ని కూడా ఫిక్స్ చేశారని టాక్. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనకున్న కథా, కమామీషు అంటో మనమూ తెలుసుకుందాం..!
తమిళ నటుడు దళపతి విజయ్ ( Thalapathy Vijay) ఇటీవలే హీరోగా నటించిన బీస్ట్ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ క్రమంలో విజయ్ తన లక్‌ను మరోసారి పరీక్షించుకోవాలని భావిస్తున్నాడు. అందుకు టాలీవుడ్‌ను టార్గెట్ చేశారట. తెలుగులో దళపతి విజయ్ ఓ డైరెక్ట్ సినిమాలో నటించడానికి సైన్ చేశారట.
దళపతి విజయ్‌కి ఉండే మాస్ ఫాలోయింగ్ అందరికీ తెలుసు. కానీ బీస్ట్ తర్వాత ఈయనకు, కచ్చితంగా ఒక హిట్ సినిమా అనేది అవసరమే. అందుకే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగులో ఓ మంచి ఫ్యామిలీ డ్రామా చేయనున్నారని వార్తలు వచ్చాయి. దిల్ రాజు విజయ్ కొత్త సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారని.. రష్మిక మందన విజయ్‌కు జోడిగా నటిస్తోందని కథనాలు వచ్చాయి. ఇటీవలే విజయ్, దిల్ రాజును కలవడంతో ఈ వార్త నిజమేనని రూఢీ అయ్యింది.
విజయ్ కొత్త సినిమా అప్డేట్ ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కుటుంబ బంధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్. కుటుంబ కథా చిత్రాలకు తెలుగు సినిమా అనేది కేరాఫ్ అడ్రస్ లాంటిది. ఆనాటి గుండమ్మ కథ దగ్గర నుండి నేటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఇండస్ట్రీ ఇది. అందుకే విజయ్ కూడా ఆ ఫార్ములాతోనే తెలుగులో హిట్ కొట్టాలని చూస్తున్నారట. అందుకే వంశీ పైడిపల్లి ఓ కథ చెప్పగానే.. విజయ్ ఓకే చేశారట. ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుందనేది దిల్ రాజ్ అభిప్రాయం. అందుకే ఆయనే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని భావించారట.
మరి.. తెలుగులో విజయ్ చేస్తున్న మొదటి సినిమా, తనకు ఎలాంటి హిట్ ఇస్తుందో మనమూ చూద్దాం. అసలే ఈ మధ్యకాలంలో, టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ చేస్తోంది. వంశీ పైడిపల్లి కూడా తమిళనాట మాస్ ఇమేజ్ ఉన్న హీరో విజయ్ (Thalapathy Vijay) తో తీసే ఈ సినిమా, మరి పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తారా, లేదా అన్నది పెద్ద ప్రశ్నే ?