53rd IFFI Event: కె. విశ్వనాథ్ తీసిన క్లాసిక్ హిట్ ‘శంకరాభరణం’ (Sankarabharanam) సినిమాకు మరో అరుదైన గౌరవం
తెలుగు చిత్రపరిశ్రమ అందించిన గొప్ప దర్శకుల్లో కళాతపస్వి కే విశ్వనాథ్ (K. Viswanath) ఒకరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన తీసిన ప్రతి చిత్రం ఓ ఆణిముత్యం అనే చెప్పాలి. తెలుగు సినిమా బతికున్నంత కాలం విశ్వనాథ్ కీర్తి అజరామరంగానే ఉంటుంది. విశ్వనాథ్ సినిమాల్లో ‘శంకరాభరణం’ ఓ కల్ట్ క్లాసిక్. ఈ మూవీ ఒక అద్భుతమైన కళాఖండం. ఇందులోని నేపథ్యం, పాటలు, సంగీతం, నటీనటుల ప్రదర్శన ఇలా ప్రతిదీ ఉన్నత స్థాయిలో ఉంటుంది. అప్పట్లో చిన్న చిత్రంగా విడుదలై అఖండమైన విజయాన్ని సాధించిన ఈ చిత్రం.. వసూళ్లతోపాటు ఎన్నో పురస్కారాలను దక్కించుకుంది. అలాంటి ఈ సినిమాకు ఇప్పుడు దేశస్థాయిలో మరో గుర్తింపు వచ్చింది.
గోవాలో జరిగే 53వ ఐఎఫ్ఎఫ్ఐ–2022 (53rd IFFI Event) కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రాన్ని రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్స్ విభాగంలో ఎంపిక చేశారు. మన దేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి, భద్రపరిచే కార్యక్రమంలో భాగంగా.. తెలుగులో విశేషాదరణ పొందిన ‘శంకరాభరణం’ (Sankarabharanam) సినిమాను నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. ఈ విభాగంలో తెలుగు నుంచి సెలెక్ట్ అయిన ఏకైక చిత్రం ఇదే కావడం గమనార్హం.
పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ‘శంకరాభరణం’ సినిమా 80వ దశకంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. మాస్ సినిమాలు, యూత్‌ను ఆకట్టుకునే లవ్ మూవీస్ రావడం ఊపందుకున్న ఆ సమయంలో ‘శంకరాభరణం’ సినిమాకు వసూళ్లు రావని భావించారు. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని అంతా అనుకున్నా.. దర్శక నిర్మాతలు మాత్రం ధైర్యం చేసి రిలీజ్ చేశారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ హిట్ చేశారు. ఈ సినిమాను ఓ క్లాసిక్‌లా నిలబెట్టేశారు. గోవాలో మరోమారు ప్రదర్శితం కాబోతున్న ‘శంకరాభరణం’ స్పెషల్ ప్రీమియర్‌కు.. చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.
Read more: Chiranjeevi: చిరంజీవి ఓ విలక్షణమైన నటుడు.. మెగాస్టార్ మీద ప్రధాని మోడీ (Narendra Modi) ప్రశంసల వర్షం