పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan 1) : ఈ చిత్రం గురించి రజనీకాంత్ చెప్పిన టాప్ 10 ఆసక్తికరమైన విషయాలివే !

Updated on Sep 07, 2022 09:11 PM IST
పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan 1) రచయిత కల్కి క్రిష్ణమూర్తి కలం నుండి జాలువారిన అద్భుత రచన. ఈ నవలను మణిరత్నం సినిమాగా తెరకెక్కించారు
పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan 1) రచయిత కల్కి క్రిష్ణమూర్తి కలం నుండి జాలువారిన అద్భుత రచన. ఈ నవలను మణిరత్నం సినిమాగా తెరకెక్కించారు

పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) .. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, జయం రవి, కార్తి, త్రిష .. ఇలా పెద్ద పెద్ద నటులందరూ కూడా భారీ తారాగణంగా ఈ సినిమాలో నటిస్తున్నారు. మణి రత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, తెలుగులో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు మీకోసం ప్రత్యేకం !

నేను ఈ సినిమాలో నటించాలని అనుకున్నా 

పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) చిత్రంలో తాను నటించాల్సి ఉందని, కానీ మణిరత్నం వద్దన్నారని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. ఇటీవలే జరిగిన ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో రజనీ ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. 

ఇక్కడ నందిని.. అక్కడ నీలాంబరి

పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) చిత్రంలోని నందిని పాత్ర, తాను గతంలో నటించిన ‘నరసింహ‘ చిత్రంలోని నీలాంబరి పాత్రను పోలి ఉంటుందని రజనీ తెలిపారు. ఐశ్వర్యారాయ్ కచ్చితంగా ఈ పాత్రకు న్యాయం చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది చాలా శక్తిమంతమైన పాత్ర అని ఆయన తెలిపారు. 

పొన్నియిన్ సెల్వన్ నవలను చదివేంత ధైర్యం లేదు

పొన్నియిన్ సెల్వన్  (Ponniyin Selvan) చిత్రం గురించి మణిరత్నంతో నేను చాలాసార్లు చర్చించాను. ఈ కథ గురించి మేము ఎన్నో సందర్భాలలో మాట్లాడుకున్నాం. ఓ రోజు మణిరత్నంతో ఈ నవలను చదవాలని ఉందని చెప్పాను. కానీ 2500 పేజీల పుస్తకం అనగానే నిర్ఘాంతపోయాను. ఆ తర్వాత పొన్నియిన్ సెల్వన్‌ను చాలా రోజుల వరకు చదివే ధైర్యం చేయలేకపోయాను. 

కార్తి పోషించిన పాత్రను నేను పోషించాల్సింది

పొన్నియిన్  సెల్వన్ (Ponniyin Selvan) చిత్రంలో వల్లవరాయన్ పాత్ర చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ పాత్రలో కార్తి నటిస్తున్నాడు. ఈ పాత్రంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజులలో గనుక నేను ఈ సినిమా చేసుంటే,  కచ్చితంగా ఈ పాత్రనే పోషించేవాడిని. అలాగే కమల్ హాసన్ అరుల్ మోజీవర్మన్ పాత్రకు, విజయకాంత్ ఆదిత్య కరికాలన్ పాత్రకు సరిగ్గా సరిపోయేవారు. అలాగే నందిని పాత్రకు రేఖ తప్పితే, ఆ రోజులలో ఇంకెవరూ న్యాయం చేయలేకపోయేవారు అని రజనీకాంత్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. 

 

Ponniyin Selvan

కల్కి ఈ సినిమాకి మొదటి హీరో

ఈ సినిమాకి కథను అందించిన ప్రఖ్యాత రచయిత కల్కి క్రిష్ణమూర్తి ఈ సినిమాకి మొదటి హీరో అని రజనీకాంత్ తెలిపారు. అలాగే ఇంత భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్న శుభాస్కరన్ రెండవ హీరో అని, అలాగే దర్శకుడు మణిరత్నం మూడవ హీరో అని రజనీకాంత్ కితాబిచ్చారు. 

జయలలిత కూడా నేనే ఆ పాత్రకు కరెక్ట్ అన్నారు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఓసారి మాట్లాడుతూ, ఒకవేళ పొన్నియిన్  సెల్వన్ (Ponniyin Selvan) సినిమాలో నేను నటిస్తే, ఏ పాత్రకు సరిపోతానని అడిగాను. దానికి ఆమె ఏ మాత్రం తడుముకోకుండా  ‘రజనీ.. మీరు వల్లవరాయన్ వందియదేవన్ పాత్రలో చాలా చక్కగా రాణించగలరని‘ చెప్పారు. ఆ పాత్రకు సినిమాలో మంచి స్కోప్ ఉంటుంది అని రజనీకాంత్ తెలిపారు. 

 

Ponniyin Selvan

ఆయన పాదాల మీద పడ్డాను

‘ఈ కథను ఓసారి పూర్తిగా విన్నాను. విన్నాక ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను. ఇంత గొప్ప కథను రాసిన కల్కి క్రిష్ణమూర్తి గారిని ప్రశంసించకుండా ఉండలేకపోయాను. అందుకే ఆయన ఇంటికి వెళ్లి, తన పాదాలకు నమస్కరించాను‘ అంటూ ఈ కథతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు రజనీకాంత్.

ఆ రోజులలో మ్యాగజైన్ కోసం అభిమానులు పడికాపులు కాసేవారు

పొన్నియిన్  సెల్వన్ (Ponniyin Selvan) కథ ఆ రోజులలో ఓ పత్రికలో సీరియల్‌గా వచ్చేది. ఆ పత్రిక కోసం ప్రతీ నెల జనాలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవారు. ఈ కథకు బోలెడుమంది అభిమానులు ఉన్నారు. ఇంత గొప్ప అభిమానగణాన్ని పొందిన పొన్నియన్ సెల్వన్ సినిమాగా ఎందుకు రూపాంతరం చెందలేదని నాకు అనిపించేది.

 

Ponniyin Selvan

ఆ రోజులలో పార్ట్ 2 కాన్సెప్ట్ లేదు

ఆ రోజులలో పార్ట్ 2 కాన్సెప్ట్ లేదు. అందుకే ఎవరూ పొన్నియిన్  సెల్వన్ (Ponniyin Selvan) చిత్రాన్ని తెరకెక్కించే సాహసం చేయలేదు. అందుకే ఇంత మంచి కథ చాలా సంవత్సరాల పాటు మరుగున పడిపోయింది. ఈ రోజు మణిరత్నం చొరవతో మళ్లీ ఈ కథకు మోక్షం లభించిందని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. 

చిన్న పాత్ర చేస్తే.. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు

ఓ రోజు మణిరత్నంతో "సార్. నేను ఈ ప్రాజెక్టులో తప్పకుండా ఉండాలి. ఏదైనా చిన్న పాత్ర అయినా ఇవ్వండి" అన్నాను. దానికి ఆయన "ఎందుకు రజనీ.. అనవసరంగా మీ ఫ్యాన్స్ ఆగ్రహానికి నన్ను గురి చేస్తావు" అంటూ నవ్వుతూ బదులిచ్చారని ఈవెంట్‌లో తెలిపారు రజనీకాంత్. 

ఇవండీ.. పొన్నియిన్  సెల్వన్ 1 చిత్రం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ పంచుకున్న భావాలు

Read More:  Ponniyin Selvan (పొన్నియిన్ సెల్వన్ 1) : ఈ రోజే టీజర్ రిలీజ్.. ఈ సినిమాకు సంబంధించిన టాప్ 10 విశేషాలు ఇవే

 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!