ఓటీటీల వంటివి ఎన్ని వచ్చినా.. థియేటర్లకు ఆదరణ తగ్గదు: కమల్ హాసన్ (Kamal Haasan)
ఇండియన్ సినిమాలో ప్రయోగాలు చేసే నటుడు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు కమల్ హాసన్. నటుడిగా ఆయన చేయని, చేయలేని పాత్ర ఉండదు అంటే అతిశయోక్తి కాదు. కమల్ హాసన్ ఇటీవల నటించిన సినిమా ‘విక్రమ్’. శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అభిమానులు, సినీ ప్రేమికులకే కాకుండా ఇండస్ట్రీకి కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ (Kamal Haasan) మీడియాతో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన అంశాలతోపాటు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన, వస్తున్న మార్పుల గురించిన కమల్ హాసన్ అభిప్రాయాలు. ఆయన మాటల్లోనే..
రజినీకాంత్‌తో బంధం గురించి..
రజినీకాంత్‌కు నాకు ఉన్న అనుబంధం సుమారు నలభై ఏళ్ల నాటిది. మేమిద్దరం అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాం. అయితే చాలాకాలం తర్వాత ఇటీవల కలిశాం. దాంతో అదొక పెద్ద వార్త అయిపోయింది. సినిమాలకు సంబంధించిన విషయాలపైనే చర్చించుకున్నాం. మా ఇద్దరి మధ్యా రాజకీయాల గురించి ప్రస్తావన ఎప్పుడూ రాదు. ఎందుకంటే మా ఇద్దరి భావజాలాలు పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటాయి. రాజకీయాల కంటే స్నేహానికే ఎక్కువగా విలువనిస్తాను.
‘విక్రమ్’ ఎలా ఉండబోతోందంటే..
డ్రగ్స్ వాటి సంబంధించిన అంశాల్లో మాఫియా గురించి విక్రమ్ సినిమాలో వివరించాం.మన ప్రమేయం లేకుండానే డ్రగ్స్ మాఫియాలో చిక్కుకుని ఎలా బాధితులుగా మారుతున్నారనే విషయాలను తెలియజేశాం. కాంక్రీట్ జంగిల్స్‌గా మారిపోతున్న నగరాల్లో కూడా వేటగాళ్లు ఉంటారనే కోణాన్ని చూపించే విధంగా సినిమా తీశాం. కథ బాగా కుదిరి, ప్రేక్షకులు ఆదరించడం చాలా కష్టమవుతోంది. మంచి సినిమాలు తీస్తే బాగా ఆడవనే అభిప్రాయం పెరిగిపోతోంది. సినిమా హిట్ అయ్యిందా.. ప్లాప్ అయ్యిందా అనే విషయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీసే వాళ్లు ఈ రోజుల్లో లేరు. బాలచందర్, విశ్వనాథ్ వంటి వాళ్లు ధైర్యంగా సినిమాలు తీసేవారు.
నేషనల్ ఫిల్మ్ మేకింగ్ హబ్‌గా హైదరాబాద్..
సౌత్ సినిమాలకు కేంద్రంగా ఒకప్పుడు చెన్నై ఉండేది. ప్రస్తుతం ఆ స్థాయికి హైదరాబాద్ చేరుకుంటోంది. రాబోయే రోజుల్లో నేషనల్ ఫిల్మ్ మేకింగ్ హబ్‌గా హైదరాబాద్ మారే అవకాశం ఉంది. అందుకు కావలసిన అన్ని సౌకర్యాలు, అర్హతలు హైదరాబాద్‌కు ఉన్నాయి. భాషా భేదాలు లేకుండా ఇండియన్ సినిమా అని పిలవడమే నాకు ఇష్టం.
చేతికి పెట్టుకునే వాచ్ లాంటిది.. ఓటీటీ..
థియేటర్లు ఎత్తైన క్లాక్ టవర్ల వంటివి. ఓటీటీ.. చేతికి పెట్టుకునే వాచ్ లాంటిది. ఈ రెండూ టైమ్ తెలుసుకోవడానికే ఉపయోగపడతాయి. తిరుపతి క్యాలెండర్ ఇంట్లో ఉంచుకుంటే సరిపోదు కదా? గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటే వచ్చే అనుభూతి వేరుగా ఉంటుంది. అలాగే ఎన్ని వేదికలు వచ్చినా థియేటర్‌లో సినిమా చూస్తేనే బాగుంటుంది.
ముందు ఇబ్బందిగానే ఉంటుంది కానీ..
ఓటీటీ వంటి కొత్త వేదికల్ని అంగీకరించడానికి ముందుగా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కొద్దికొద్దిగా అలవాటవుతుంది. పిజ్జా అలవాటైనంత మాత్రాన.. మన ఉలవచారును మర్చిపోలేం కదా? సినిమాలు చూడడానికి ఎన్ని వేదికలు వచ్చినా థియేటర్లకు మాత్రం ఎప్పటికీ ఆదరణ తగ్గదు.
పాన్ ఇండియా సినిమాలు అప్పట్లోనే..
అగ్ర నిర్మాత నాగిరెడ్డిగారు విజయవాహిని బ్యానర్‌లో తెలుగు, తమిళం, హిందీ సినిమాలు తీశారు. ఏవీఎమ్ సంస్థ కూడా ‘చంద్రలేఖ’ వంటి తొలి పాన్ ఇండియా సినిమా చేసింది. నా దృష్టిలో సౌత్ వాళ్లు పాన్ ఇండియా సినిమాలను ఎప్పుడో తెరకెక్కించారు. రామానాయుడు గారు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు తీశారు. ఆ రోజుల్లోనే సౌత్ వాళ్లు పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్‌గా రాణించారు.
నా టాలెంట్ మరింత పెరుగుతుంది
అభిమానులు, ప్రేక్షకులు నా నుంచి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నారు. టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేస్తే నా టాలెంట్ కూడా పెరుగుతుందని అనుకుంటున్నాను. ఈ ఏడాదిలోగా భారతీయుడు2 సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని కమల్ హాసన్ (Kamal Haasan) చెప్పుకొచ్చాడు.