Macherla Niyojakavargam Review : నితిన్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామాలో ట్విస్టులెన్నో.. కథ విషయానికి వస్తేనే ??

Updated on Aug 12, 2022 07:30 PM IST
 'మాచర్ల నియోజకవర్గం'  చిత్రంలో కథానాయకుడు నితిన్ గుంటూరు జిల్లా కలెక్టరుగా ఓ విభిన్న పాత్ర పోషించారు.
'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలో కథానాయకుడు నితిన్ గుంటూరు జిల్లా కలెక్టరుగా ఓ విభిన్న పాత్ర పోషించారు.

నటీనటులు: నితిన్, కృతిశెట్టి, కేథరిన్ ట్రెసా, సముద్రఖని 
సంగీత దర్శకుడు: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
దర్శకత్వం : ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి

రేటింగ్ : 2.5/5


నితిన్ (Nithiin) .. తెలుగువారికి బాగా సుపరిచితమైన కథానాయకుడు. 'జయం' సినిమా ద్వారా టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన నితిన్ ఆ తర్వాత అనేక హిట్ సినిమాలలో నటించి, మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు. కానీ కొద్ది కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆయన నటించిన “మాచర్ల నియోజకవర్గం” సినిమా రిలీజైంది. 

ఎం.ఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతిశెట్టి, కేథ‌రిన్ కథానాయికలుగా నటించారు. మరి ఈ సినిమా, జనాలను ఎంతవరకు రంజింపజేసిందో మనమూ తెలుసుకుందాం !

కథ :

'మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam)' అనేది ఒకానొక పెత్తందారు కనుసైగలలో నడిచే ప్రాంతం. అతడే రాజప్ప (సముద్రఖని). తనకు అడ్డువచ్చిన ప్రతీ ఒక్కరినీ చంపుకుంటూ, అతడే ఆ ఏరియాని శాసిస్తుంటాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్ రెడ్డి (నితిన్) అనే యువకుడు ఐఏఎస్ పరీక్షలలో ఉత్తీర్ణుడై, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో స్వాతిని (కృతి శెట్టి) చూసి ప్రేమలో పడతాడు సిద్ధార్థ్. 

అయితే మాచర్ల నుండి వచ్చిన కొందరు వ్యక్తులు స్వాతిపై హత్యాయత్నం చేస్తారు. ఇక్కడే సినిమాలో ఓ అనుకోని ట్విస్ట్ ఎదురవుతుంది. అసలు రాజప్పకి, స్వాతికి ఉన్న సంబంధం ఏమిటి? 

అనుకోకుండా గుంటూరు జిల్లాకి కలెక్టరుగా వచ్చిన సిద్ధార్థ్ మాచర్లలో పరిస్థితులను ఎలా విధంగా చక్కదిద్దాడు? స్వాతిని ఎలా కాపాడాడు?  ఇదే క్రమంలో ప్రజలలో ఏ విధమైన ప్రేరణను నింపాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే, ఈ సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా  రాజప్పకు, సిద్ధార్థ్‌కు మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారన్నదే ఈ చిత్రకథ. 

నటీనటుల పనితీరు:
నితన్ గత చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. పక్కా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో, నితిన్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. అలాగే కృతి శెట్టి కేవలం డ్యాన్సులకే పరిమితం కాకుండా, కథలో సైతం కీలక పాత్ర పోషించింది. ఇక కేథరిన్ కనిపించేది కొంత సేపైనా, తన నటనతో ఆకట్టుకుంది.

అలాగే ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సముద్రఖని (Samuthirakani) గురించి. విలన్ పాత్రలో ఆయన తన హావభావాలతో, నటనతో క్యారెక్టర్‌ని బాగా రక్తి కట్టించాడు. ఇక మురళీ శర్మ, రాజేంద్రప్రసాద్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పుకోవచ్చు. రాను రాను కిషోర్ టాలీవుడ్ పరిశ్రమకే ఒక ముఖ్యమైన కమెడియన్‌గా మారిపోతున్నాడు అనడంలో సందేహం లేదు. 

ప్రతికూల అంశాలు :
పొలిటికల్ డ్రామా అయినప్పటికీ, దర్శకుడు రాజశేఖర్ రెడ్డి కథని సరైన పద్థతిలో నడపలేకపోయారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. అలాగే కొన్ని సీన్స్ మరీ సాగదీసినట్లు ఉండడంతో, కథ ముందుకు సాగడం లేదన్న భావన కలుగుతుంది. సముద్రఖని లాంటి బలమైన విలన్ సినిమాలో ఉన్నప్పటికీ, ఆ పాత్రను సరిగ్గా వాడుకోలేదేమో? అని జనాలకు కచ్చితంగా అనిపిస్తుంది. 

పొలిటికల్ డ్రామా కాబట్టి కథానాయకుడికి, ప్రత్యర్థికి మధ్య ఎత్తులు, పై ఎత్తులు సహజమే. కానీ కొన్ని ఓవర్ ది టాప్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. 

టెక్నికల్ అంశాలు
ఈ సినిమాలో ఏవైనా చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయంటే, అవి సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక పాటలు కూడా ఫర్వాలేదనిపించాయి

ఫైనల్ వర్డ్ :
పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా కొంతలో కొంత ఆకట్టుకోవచ్చు. అంతే తప్ప, రెగ్యులర్ ఆడియన్స్‌ను ఈ మాచర్ల నియోజకవర్గం  (Macherla Niyojakavargam) ఎంతవరకు అలరిస్తుందో చెప్పడం కష్టమే. 

Read More: నితిన్ తొలి సినిమాకి 20 ఏళ్లు ! 'జయం' అప్పట్లో ఓ సంచలనం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!