Highway Movie Review : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ‘హైవే’ సినిమా ఓ డీసెంట్ థ్రిల్లర్
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా నటించిన ‘హైవే’ సినిమా తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కేవీ గుహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల చేశారు. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘హైవే’ సినిమా గురించి తెలుసుకుందాం.
కథ ఏంటంటే:
విష్ణు(ఆనంద్ దేవరకొండ) ఒక ఫోటోగ్రాఫర్. జాబ్ కోసం బెంగళూరుకి బయలుదేరుతాడు. తులసి (మానస రాధాకృష్ణన్) తన తల్లితో కలిసి ఒక పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తుంది. ఓనర్ పెట్టే వేధింపులు భరించలేక అక్కడ నుంచి పారిపోతుంది. సీరియల్ కిల్లర్ డి అలియాస్ దాస్ (అభిషేక్ బెనర్జీ) వరుసగా అయిదుగురు మహిళలను హత్య చేస్తాడు. అతడిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తూ ఉంటారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దాస్, పారిపోయే క్రమంలో తులసి, బెంగళూరు వెళుతూ విష్ణు.. వీరు ముగ్గురూ ఎక్కడైనా ఎదురవుతారా? ఎదురైతే ఆ సైకో కిల్లర్ ఏం చేస్తాడు? అన్నదే హైవే సినిమా స్టోరీ.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వారి పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇదివరకు నటించిన పాత్రలతో పోలిస్తే చాలా మెచ్యూర్డ్ గా ఉంది ఆనంద్ దేవరకొండ నటన. ఈ సినిమాలో ఆనంద్ నటనకు మంచి గుర్తింపు వస్తుంది. ఇక, తన అందం, నటనతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా నటించారు హీరోయిన్ మానస రాధాకృష్ణ. విలన్ పాత్ర పోషించిన అభిషేక్ బెనర్జీ మ్యానరిజమ్, ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయి.
ఇక కథ, కథనాన్ని నడిపించడంలో దర్శకుడు కేవీ గుహన్ మంచి మార్కులే వేయించుకున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లాజిక్స్‌తో క్యారెక్టర్లను కలపడం.. వాటికి మంచి ముగింపును ఇవ్వడంతో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక డైలాగులు ఫర్వాలేదనిపించాయి. అయితే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్టోరీపై ఆసక్తిని పెంచే క్రమంలో.. కొన్ని సన్నివేశాల్లో విఫలమైందని అనిపించింది.
ప్లస్ పాయింట్స్: కథ, నటీనటుల యాక్టింగ్, కథను నడిపించిన విధానం
మైనస్ పాయింట్స్: ఎంతో ఆసక్తిగా సాగే కథకు సరిపోయే పాటలు లేకపోవడం, కొన్ని సన్నివేశాల్లో మిస్ అయిన లాజిక్, కథ స్లోగా సాగడం, గ్రాఫిక్స్
ఫైనల్ వర్డ్ : హైవే సినిమా థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చుతుంది. అయితే కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ కావడంతో సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. మొత్తానికి ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హైవే సినిమా ఒక డీసెంట్ థ్రిల్లర్.
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ, మానస రాధాకృష్ణన్, సయామి ఖేర్
దర్శకత్వం: కేవీ గుహన్
నిర్మాతలు: వెంకట్ తలారి
మ్యూజిక్ డైరెక్టర్: సైమన్ కె కింగ్
సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్
ఎడిటర్: తమ్మిరాజు
రేటింగ్: 2 / 5