Megastar Chiranjeevi : చిరు 154 వ సినిమా టైటిల్ ఖరారు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !
'ఆచార్య' సినిమా విడుదల తర్వాత, మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టుల మీద దృష్టి కేంద్రీకరించారు. వరుసగా సినిమాలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో తన 154 వ సినిమా టైటిల్‌ను దాదాపు ఫైనలైజ్ చేశారు. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి. దానికీ ఓ కారణం ఉంది. ఎందుకంటే, 100 శాతం ఒరిజనల్ కథతో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది.
1990 ప్రాంతానికి సంబంధించిన కథతో, చిరంజీవిని వింటేజ్ లుక్‌లో ఈ సినిమాలో చూపిస్తున్నారట. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చిత్రమేంటంటే, చాలా రోజుల నుండి ఈ సినిమా టైటిల్ పై వివిధ వార్తలు వచ్చాయి. ‘వాల్తేర్ వీరయ్య’ (Waltair Veerayya) అనే టైటిల్‌ను ఈ సినిమాకు పెడుతున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, నిర్మాతలు ఈ విషయాన్ని ఎక్కడా ధ్రువీకరించలేదు. కానీ, అనుకోకుండా 'ఆచార్య' సినిమా ప్రచార కార్యక్రమాలలో, చిరు తన తదుపరి సినిమా టైటిల్‌ను లీక్ చేసేశారు. ఓ ఇంటర్వ్యూలో.. తను నటిస్తున్న చిత్రం పేరు ‘వాల్తేర్ వీరయ్య’ అని నోరు జారారు.
ఇప్పుడు దర్శకుడు బాబీ (Bobby) కూడా ‘వాల్తేర్ వీరయ్య’ టైటిల్‌నే తాము ఫిక్స్ చేశామని తెలిపారు. విజయవాడలో జరిగిన మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) అండర్‌కవర్ కాప్‌గా ఒక వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు. విశాఖ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో, నటుడు రవితేజ ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.