తమిళ చిత్ర పరిశ్రమకు ఇది స్వర్ణయుగం.. మంచి కథలతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు: శింబు (Simbu)

Updated on Nov 11, 2022 09:17 PM IST
దయచేసి కొత్త సినిమాల అప్‌డేట్ గురించి పదే పదే ప్రస్తావించవద్దని శింబు (Simbu) తన అభిమానులను కోరారు
దయచేసి కొత్త సినిమాల అప్‌డేట్ గురించి పదే పదే ప్రస్తావించవద్దని శింబు (Simbu) తన అభిమానులను కోరారు

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ (Tollywood)లోనూ మంచి క్రేజ్ ఉన్న నటుడు శింబు (Simbu). ‘మన్మధ’, ‘వల్లభ’ సినిమాలు తెలుగునాట మంచి విజయాలు సాధించాయి. దీంతో శింబు నటించే చిత్రాలు తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ఆ మధ్య వరుస పరాజయాలతో డీలాపడ్డ శింబుకు ‘మానాడు’ చిత్రం ఊపిరి పోసింది. ఆ తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమా ‘వెందు తణిందదు కాడు’ (Vendhu Thaninthathu Kaadu). ఈ మూవీని తెలుగులో ‘ది లైఫ్​ ఆఫ్ ముత్తు’ (The Life Of Muthu) పేరుతో రిలీజ్ చేశారు. ఇక్కడ ఈ చిత్రం యావరేజ్ సినిమాగా నిలిచింది. అయితే తమిళనాట మాత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం అర్ధ శతదినోత్సవ వేడుకలను చెన్నైలో తాజాగా నిర్వహించారు. 

ఈ వేడుకల్లో పాల్గొన్న శింబు తమిళ చిత్రసీమ (Kollywood) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తున్నారని.. ఇది తమిళ సినిమాకు స్వర్ణయుగమని ఆయన అభిప్రాయపడ్డారు. కథ బాగుంటే ఆడియెన్స్ కచ్చితంగా ఆ సినిమాను ఆదరిస్తారని.. అందుకు ‘విక్రమ్’, ‘పొన్నియిన్ సెల్వన్’, ‘లవ్ టుడే’ చిత్రాలే ఉదాహరణ అని అన్నారు.

‘వెందు తణిందదు‘ కాడు సినిమా విడుదలవ్వడానికి ముందు నాకు కొంత భయం ఉండేది. కమర్షియల్ హంగులు, హీరోయిజం లాంటివి లేకుండా ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించారు. కానీ.. ఆడియెన్స్ మాత్రం ఈ చిత్రాన్ని బంపర్ హిట్ చేయడం చూసి నిజంగానే ఆశ్చర్యపోయా. ఇందులో  ‘ముత్తు‘ పాత్ర కోసం శ్రమించి నటించా’ అని శింబు పేర్కొన్నారు. 

ఒక నిర్మాత, ఒక దర్శకుడు కలసి.. ఎన్నో వ్యయప్రయాసలను కోర్చి ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తారని శింబు అన్నారు. కానీ, ప్రేక్షకులు పదే పదే అప్‌డేట్ అడిగితే ఆయా ప్రాజెక్టు ఇబ్బందిలో పడే  అవకాశం ఉందన్నారు. అందువల్ల దయచేసి కొత్త సినిమా అప్‌డేట్ల గురించి ప్రస్తావించడం మానుకోవాలని శింబు తన అభిమానులను కోరారు.

చెన్నైలోని సత్యం థియేటర్‌లో నిర్వహించిన ఈ వేడుకలో చిత్ర నిర్మాత గణేశన్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, హీరోయిన్ సిద్ధి ఇద్నానీ పాల్గొన్నారు. వీరితోపాటు సీనియర్ నటి రాధిక, దర్శకుడు ఏఎల్ విజయ్ తదితరులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇకపోతే, రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘వెందు తణిందదు కాడు’ మూవీ రూ.60 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ‘మానాడు’ హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శింబు.. ‘వెందు తణిందదు కాడు’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో  వేసుకొని దూసుకుపోతున్నాడు.  

Read more: హిందీలో నంబర్ 1.. తెలుగులో నంబర్ 4.. ఓటీటీలో నాగార్జున (Nagarjuna) ‘ది ఘోస్ట్’ (The Ghost) మూవీ హవా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!